పోలీస్ స్టేషన్‌కు చేరిన బాలీవుడ్ హీరోయిన్ల పంచాయితీ

పోలీస్ స్టేషన్‌కు చేరిన బాలీవుడ్ హీరోయిన్ల పంచాయితీ

బాలీవుడ్ హీరోయిన్స్ మధ్య మొన్నటిదాకా మాటల యుద్దమే చూశాం. కానీ ఇప్పుడు అది కాస్తా పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రాలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి రాఖీ సావంత్‌, ఆమె అడ్వకేట్‌ స్నేహితుడు ఫల్గుణి బ్రహ్మభట్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా సమావేశంలో ఓ అభ్యంతరకర వీడియోను చూపించి వారిద్దరూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈ విషయాన్ని షెర్లిన్ చోప్రా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో నటి సావంత్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. రాఖీ సావంత్,  ఆమె న్యాయవాది ఫల్గుణి బ్రహ్మభట్‌పై IPC సెక్షన్లు 354A, 500, 504, 509, IT చట్టం 67A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్ మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. షెర్లిన్ చోప్రా సినీ నిర్మాత సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపు ఆరోపణలు చేసింది.

గత నెలలో ఈ కేసులో సాజిద్ ఖాన్‌పై ఫిర్యాదు కూడా చేశారు. సాజిద్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీపైనా షెర్లిన్ ప్రశ్నలు లేవనెత్తింది. మీటూ నిందితులు షోలోకి ప్రవేశించకూడదని డిమాండ్ చేసింది. ఈ తర్వాత రాఖీ సావంత్ బహిరంగంగా సాజిద్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడంతో షెర్లిన్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరు నటీమణులు ఒకరిపై ఒకరు తీవ్రంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.