- సిటీలో నీట మునిగిన కాలనీలు.. రోడ్లపై గంటల కొద్దీ ట్రాఫిక్‌జామ్
- వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ స్టేషన్లలో రైళ్ల నిలిపివేత
- స్కూళ్లకు సెలవులు ప్రకటించిన కలెక్టర్లు
- ఆఫీసర్లను అప్రమత్తం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు : మొంథా తుఫాన్ దెబ్బకు ఓరుగల్లు చిగురుటాకులా వణికింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా.. మొంథా తుఫాన్ తన ప్రతాపాన్ని చూపింది. ఏపీపైనే ప్రధానంగా ప్రభావం ఉంటుందని, ఇక్కడ మహా అయితే చిరుజల్లులు పడుతాయని ప్రజలు భావించగా.. కుండపోతలా వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా స్తంభించింది.
రైల్వే స్టేషన్లలోని పట్టాల మీదకు వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. గ్రేటర్ వరంగల్‌లోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఇండ్లలోకి వరద చేరడంతో నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. వాన ఉధృతి భారీగా ఉండడంతో మధ్యాహ్నం తర్వాత స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం కలెక్టరేట్, జీడబ్ల్యూఎంసీ, ఎన్‍పీడీసీఎల్, పోలీసులు తమ శాఖల తరఫున టోల్‌ఫ్రీ, వాట్సప్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నీటమునిగిన కాలనీలు
మొంథా తుపాను ఎఫెక్ట్ వరంగల్, హనుమకొండతో పాటు జనగామ, మహబూబాబాద్ జిల్లాలపైనే ఎక్కువగా పడింది. అత్యధికంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 24.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఇదే జిల్లాలోని పర్వతగిరి మండలంలోని కల్లెడలో 23.4 సెంటీమీటర్లు, ఖిలా వరంగల్ మండలం ఉర్సు ప్రాంతంలో 22.4 సెంటీమీర్లు, సంగెం మండలంలోని కాపులకానిపర్తిలో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీవర్షాల కారణంగా గ్రేటర్ వరంగల్ అతలాకుతలమైంది.
హనుమకొండ, వరంగల్, కాజీపేట నగరాల్లోని 30 లోతట్టు కాలనీల్లోకి వరదనీరు చేరింది. హనుమకొండ బస్టాండ్‍లోకి, చుట్టూ ఉన్న కాలనీల్లోకి వరద చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ చుట్టూరా ఉండే నాలుగు ప్రధాన మార్గాల్లో దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరంగల్ నగరంలో బస్టాండ్ నిర్మాణం కోసం తవ్విన దాదాపు రెండెకరాల స్థలంలోకి భారీ ఎత్తున వరద నీరు చేరింది.
