
- వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఘటనలు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు చెందిన ముగ్గురు రెండు రోజుల వ్యవధిలోనే మృతిచెందారు. వీరి మరణానికి కారణం మిర్చి ఘాటా..! లేకా గుండెపోటా..! అనేది తేలాల్సి ఉంది. ఎండల తీవ్రతతోనే గుండె సంబంధిత సమస్యలు వచ్చి అకస్మాత్తుగా చనిపోతున్నారని మార్కెట్హమాలీలు, గుమస్తాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం మధ్యాహ్నం వర్ధన్నపేట మండలం సాగరం గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్(38) ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి బస్తాలను కాంటాలు వేస్తూ కుప్పకూలి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందాడు. మరో ఇద్దరు శనివారం రాత్రి, ఆదివారం ఉదయం మృతిచెందారు. మృతుల్లో వరంగల్రాంకీలో ఉండే చిట్ల ప్రభాకర్(55) లక్ష్మిసాయి ట్రేడర్స్పార్టనర్. అలాగే వాసవి అడ్తి గుమస్తా బండి అయిలయ్య (65) కూడా చనిపోయారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వీరు అకస్మాత్తుగా చనిపోవడంతో మార్కెట్ వర్గాల్లో భయాందోళన నెలకొంది.