ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు.. వరంగల్‍ సీపీ ముందు విద్యార్థుల ఆవేదన

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు..  వరంగల్‍ సీపీ ముందు విద్యార్థుల ఆవేదన

వరంగల్‍, వెలుగు:  ‘యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే నాన్‍ బెయిలబుల్‍ కేసులు పెడుతున్రు.. విద్యార్థుల ఇబ్బందులు, కేయూలో సమస్యలపై వినతిపత్రం ఇస్తామంటే ఇయ్యనివ్వట్లేదు. మంత్రులు, సీఎం వస్తున్నారంటే రాత్రికిరాత్రి డోర్లు పగలగొట్టి బైండోవర్​చేస్తున్నరు. చర్చలు, సమావేశాలు పెట్టుకుంటామంటే వైస్‍ ఛాన్స్​లర్ ​పర్మిషన్‍ ఇవ్వట్లేదు. బాధలు చెప్పుకోడానికి క్యాంపస్‍ ఏరియాలో ప్రెస్‍మీట్‍ కూడా పెట్టుకోనీవ్వట్లేదు. పోలీసులు కూడా నిరసనలు, ఆందోళనలు జరిగే సమయాల్లో లేని విద్యార్థులపైన కూడా కేసులు పెడుతున్నరు’ అంటూ వరంగల్‍ కేయూ విద్యార్థి సంఘాల నేతలు, స్టూడెంట్లు  పోలీస్‍ కమిషనర్‍ ఏవీ.రంగనాథ్‍ ముందు గోడు వెల్లబోసుకున్నారు.

అక్రమార్కులను వదలం

కాకతీయ యూనివర్సిటీ భూములను ఆక్రమించినవారిని వదిలే ప్రసక్తి లేదని సీపీ రంగనాథ్‍ స్పష్టం చేశారు. దీనిపై స్పెషల్‍ టీం పనిచేస్తోందని చెప్పారు. దీనిపై స్టూడెంట్లు మాట్లాడుతూ.. చిన్న ఇష్యూ జరిగితే తమపై కేసులు పెట్టించే వీసీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్‍ రిజిస్ట్రార్‍ అశోక్‍ బాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకు దగ్గర పెట్టుకున్నారని ప్రశ్నించారు. దీంతో సీపీ మాట్లాడుతూ ఆక్రమణదారుల్లో అశోక్‍ బాబు కాదు కదా అంతకంటే పెద్దలు ఉన్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. వారు ఫేక్‍ డాక్యుమెంట్లు సృష్టిస్తే.. దానికంటే ముందున్న డాక్యుమెంట్ల చరిత్రను బయటకు తీసి మరీ దోషులను పట్టుకుంటామన్నారు. కేయూలో న్యాక్‍ బృందం పర్యటన, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు ముగిశాక దాని ఫలితం చూపుతామన్నారు. ఆక్రమణల్లో ఇండ్లున్న కూల్చేయిస్తామని, కేయూ భూముల చుట్టూరా హద్దులు పాతేలా కేయూ అధికారులతో కలిసి పనిచేస్తామని  హామీ ఇచ్చారు. కేయూ వీసీ తాటికొండ రమేశ్​మాట్లాడుతూ యూనివర్సిటీలో రాజకీయాలు చేయొద్దనే ఉద్దేశంతోనే కొన్ని కార్యక్రమాలకు పర్మిషన్‍ ఇవ్వట్లేదన్నారు. కేయూ భూకబ్జాలపై తానే అప్పటి కలెక్టర్‍ కు ఫిర్యాదు చేసి డిజిటల్‍ సర్వే చేయించానన్నారు. కేయూలో సమస్యల పరిష్కారానికి, కొత్త హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయించానని చెప్పారు.  కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‍ టి.శ్రీనివాసరావు, డీసీపీ బారీ, ఏసీపీ కిరణ్‍ కుమార్‍, సీఐ దయాకర్‍ పాల్గొన్నారు.

పర్మిషన్​ ఇస్తలేరు..

‘ కేయూలో 5 వేలకుపైగా స్టూడెంట్లు ఉంటే 2 వేల మందికి సరిపడా సౌకర్యాలు కూడా లేవు. ప్రతి ఏడాది ఫీజులు పెంచుతున్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ఇవ్వట్లేదు. పూర్తిస్థాయి అధ్యాపకులు, సిబ్బంది లేక క్లాసులు నడవట్లేదు. హాస్టళ్లలో పురుగులు వస్తున్నాయి. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయ్‍. వీటిపై ఆర్గనైజేషన్‍ తరపున ప్రశ్నిస్తే వీసీ రమేశ్‍ కక్షగట్టి కేసులు పెట్టిస్తున్నారు. స్టూడెంట్లలో గ్రూపులు చేసి మాలో మాకే గొడవలు పెట్టిస్తున్నారు’ అంటూ కొందరు స్టూడెంట్లు సీపీ దృష్టికి తీసుకొచ్చారు. ‘మీరు మా మంచికోరి అర్థవంతమైన చర్చలు చేసుకోండి. సమావేశాలు పెట్టుకుని సమస్యలను పైవారి దృష్టికి తీసుకువెళ్లండి అంటున్నారు. కానీ, మేం అలాంటి కార్యక్రమాల కోసం పర్మిషన్‍ అడిగితే ఇచ్చినట్టే ఇచ్చి రాత్రికి రాత్రే క్యాన్సిల్​ చేస్తున్నరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడకుండా కేయూ అధికారులు.. రోడ్లపైకి వచ్చి నిరసన తెలపకుండా పోలీసులు తమ గొంతు నొక్కితే ఏం చేయాలని ప్రశ్నించారు. ఆందోళనలు జరిగే సమయాల్లో అక్కడ లేని స్టూడెంట్ల మీద కూడా నాన్‍ బెయిలబుల్‍ కేసులు పెడుతున్నారని.. ఆఫీసర్లు ఇచ్చే పేర్ల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అక్కడికక్కడే స్పందించిన సీపీ ఎట్టిపరిస్థితుల్లో ఆ తరహా తప్పుడు కేసులు నమోదు చేయొద్దని స్టేషన్‍ ఆఫీసర్లకు సూచించారు.

ఇంటరాక్షన్‍లో మంచి మాటలు.. హెచ్చరికలు

కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో గతానికి భిన్నంగా స్టూడెంట్‍ ఆర్గనైజేషన్‍ లీడర్లు, స్టూడెంట్లతో పోలీస్‍ కమిషనర్‍ రంగనాథ్‍ గురువారం ఇంటరాక్షన్‍ ప్రొగ్రాం పెట్టారు. వైస్‍ ఛాన్స్​లర్​ తాటికొండ రమేశ్‍ అధ్యక్షతన సెనెట్‍ హాల్‍లో నిర్వహించిన ఈ సమావేశంలో మొదట సీపీ మాట్లాడారు. స్టూడెంట్లు, పోలీసుల మధ్య ఎవరికివారు కాలు దువ్వే వాతావరణం మంచిది కాదన్నారు. మంచి లీడర్లుగా ఎదగాలనుకునే వారు సమస్యలపై, స్టూడెంట్స్​ఇష్యూలపై పూర్తి అవగాహనతో ప్రజాస్వామిక పోరాటం చేయాలన్నారు. దానిని తాము పక్కాగా స్వాగతిస్తామని చెప్పారు. కానీ, నిరసనల పేరుతో కుర్చీలు విరగ్గొడతాం, పూల కుండీలు పగలకొడతామంటే ఒప్పుకునేది లేదన్నారు. పేపర్లలో, సోషల్‍ మీడియాలో హీరో కావాలనే ఆలోచనను పక్కనపెట్టాలన్నారు. అలాంటి పనులు ఏ  యూనియన్‍ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ‘యూనివర్సిటీలో ఆడపదడపా గొడవలు జరిగి స్టూడెంట్లపై కేసులు నమోదైన క్రమంలో.. నా సొంత పిల్లలుగా భావించాను కాబట్టే కొందరిపై కేసులు ఎత్తివేయించా’ అంటూ కొన్ని కేసులు ప్రస్తావించారు. పోలీసులు కూడా  అక్రమార్కుల పనిపట్టాలనే ఆరాటం చూపాలి తప్పితే.. స్టూడెంట్లపై హీరోయిజం చూపొద్దని సుత్తిమెత్తగా మందలించారు.