
- నిధుల్లేక ఆగిన షిఫ్టింగ్ పనులు
- రూ.3.8 కోట్లతో గత సర్కార్ నిర్మించిన కొత్త బిల్డింగ్
- వస్తువుల తరలింపునకు మాత్రం నిధులు ఇవ్వలేదు
- విద్యార్థులు, పర్యాటకుల సందర్శనకు నోచుకోట్లేదు
- మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ విజిటింగ్ కు నో చాన్స్
హనుమకొండ, వెలుగు: కాకతీయుల కళాసంపద నిర్లక్ష్యానికి గురవుతోంది. రాజుల ఆయుధాలు, రాతి ఫిరంగులు, తవ్వకాల్లో బయటపడిన విగ్రహాలు, శిలా శాసనాలు.. ఇలా ఎన్నో పురాతన వస్తువులు వరంగల్ మ్యూజియంలో ఉన్నాయి. చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆధారాలెన్నో ఉన్నా పట్టించుకునేటోళ్లు లేరు. దశాబ్దాల కింద నిర్మించిన మ్యూజియం బిల్డింగ్పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాన్ని వరంగల్ కోటకు తరలించేందుకు పనులు చేపట్టిన గత సర్కార్ మధ్యలోనే చేతులెత్తేసింది.
నిధులు విడుదల చేయక షిఫ్టింగ్ ఆగిపోయింది. చారిత్రక ఆనవాళ్లన్నీ శిథిల భవనంలోనే పాడయ్యే దశకు చేరుతున్నాయి. దీంతో పర్యాటకుల సందర్శనకు కూడా నోచుకోవడంలేదు. ఈనెల14న మిస్వరల్డ్కాంటెస్టెంట్స్ వరంగల్ కోటకు రానుండగా.. కాకతీయుల కాలంనాటి ఆనవాళ్లు సందర్శించుకునే పరిస్థితి లేకుండాపోయింది.
1,200కుపైగా కళాఖండాలు
1991లో వరంగల్మున్సిపల్ కార్పొరేషన్ఆఫీస్ సమీపంలో కేంద్ర పురావస్తు ప్రదర్శనశాల(మ్యూజి యం)ను ప్రారంభించారు. ఆది మానవుల ఆయుధాలు, చోళులు, చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి వస్తువులు, వంట పాత్రలు, రాజుల కత్తులు, ఢాళ్లు, రాతి ఫిరంగులు, శిల్పాలు, శిలా శాసనాలు, దేవతామూ ర్తుల విగ్రహాలు, పురాతన నాణేలు, పింగాణి వస్తువులు.. ఇలా అన్నీ కలిపి సుమారు 1,200కుపైగా కళాఖండా లను భద్రపరిచారు. బిల్డింగ్ కొన్నాళ్లకే శిథిలావస్థ కు చేరింది. గోడలకు బీటలు పడ్డాయి.
కొన్నిచోట్ల పెచ్చులూడి కూలిపోయే దశకు చేరింది. దీంతో మ్యూజియం సిబ్బంది తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అయినా.. ఎప్పుడు కూలుతుందో తెలియక భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. టూరిస్టులు, స్కూల్ స్టూడెంట్స్‌తో మ్యూజియం రద్దీగా ఉండేంది. కాగా.. మ్యూజియం ముందు భాగంలో జీడబ్ల్యూఎంసీ బిల్డింగ్నిర్మాణానికి గుంత తీశారు. దీంతో దారి కూడా సరిగా లేకపోవడంతో ఎవరూ రావడంలేదు. ఇకనైనా మ్యూజియాన్ని కోటలోకి షిఫ్ట్చేసి, సాధ్యమైనంత త్వరగా జనాలు సందర్శంచేలా చూడాలి.
బిల్డింగ్ కట్టినా.. షిఫ్టింగ్‌కు పైసలియ్యలే
వరంగల్ కోటలోకి షిఫ్ట్ చేసేందుకు పురావస్తుశాఖ అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మ్యూజియం నిర్మాణానికి రూ.3.85 కోట్లు, వస్తువుల షిఫ్టింగ్, షోకేస్ లు, బిల్డింగ్‌లో సౌలతులు, సీసీ కెమెరాలు వంటి వాటికోసం మరో రూ.2.5 కోట్లతో ప్రపోజల్స్పెట్టారు. 2015లో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. కానీ బిల్లులు సరిగా రిలీజ్ చేయక దాదాపు ఏడేండ్ల పాటు పనులు కొనసాగుతూ వచ్చాయి.
2022 మార్చిలో బిల్డింగ్నిర్మాణం పూర్తయింది. పాత మ్యూజియం నుంచి పురాతన వస్తువులను షిఫ్ట్ చేసి, భద్రపరచాల్సి ఉండగా అందుకు రూ.2.5 కోట్లను రిలీజ్చేయలేదు. దీంతో షిఫ్టింగ్ కు నోచుకోలేదు. శిథిల భవనంలోనే వస్తువులు ఉండిపోయాయి. కొత్త బిల్డింగ్ వినియోగంలోకి రాక వృథాగా మిగిలింది.
ప్రపోజల్స్ పంపించాం
మ్యూజియాన్ని వరంగల్ కోటకు తరలిం చేందుకు గతంలోనే సర్కార్ కు నివేదించాం. వస్తువుల షిష్టింగ్, భద్రత, మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.2.5 కోట్లు కావాలని ప్రపోజల్స్ పంపించాం. నిధులు మంజూరైన తర్వాత మ్యూజియం తరలిస్తామని పురావస్తుశాఖ వరంగల్ ఏడీ మల్లు నాయక్ తెలిపారు.