వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌కు మోక్షం కలిగేనా?

వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌కు మోక్షం కలిగేనా?
  •     పదేళ్లుగా పెండింగ్‌‌లో పెట్టిన బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌
  •     1972లో రూపొందించిన ప్లాన్‌‌తోనే అభివృద్ధి పనులు
  •     కాంగ్రెస్‌‌ ప్రభుత్వమైనా ఆమోదించాలని కోరుతున్న ప్రజలు

హనుమకొండ, వెలుగు : ఫ్యూచర్‌‌ సిటీగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌‌ మహానగరానికి మాస్టర్‌‌ ప్లానే లేకుండా పోయింది. భవిష్యత్‌‌ అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్‌‌ ప్లాన్‌‌ అమలు చేయాల్సి ఉండగా పదేండ్ల నుంచి ఆ ఫైల్‌‌ ప్రభుత్వం వద్దే మూలుగుతోంది. ఫలితంగా వరంగల్‌‌ నగరంలో యాభై ఏళ్ల కిందటి ప్రణాళికే అమలవుతోంది.

కాకతీయ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ (కుడా) అధికారులు 2013లో అప్పటి కాంగ్రెస్‌‌ ప్రభుత్వ హయాంలోనే కొత్త మాస్టర్‌‌ ప్లాన్‌‌ను రూపొందించారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం మాస్టర్‌‌ ప్లాన్‌‌ను పట్టించుకోకపోవడంతో ఇన్నేళ్లూ పెండింగ్‌‌లో పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌‌ గవర్నమెంట్‌‌ ఏర్పడడంతో ఇప్పటికైనా మాస్టర్‌‌ప్లాన్‌‌ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇంకా 51 ఏండ్ల కిందటి ప్రణాళికే..

ఏ నగరానికైనా ప్రతి 20 ఏండ్లకోసారి మాస్టర్‌‌ప్లాన్‌‌ను రూపొందించాల్సి ఉంటుంది. అది కూడా భవిష్యత్‌‌ అవసరాలు, చేపట్టబోయే నిర్మాణాలు, ప్రాజెక్ట్‌‌లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను తయారుచేయాలి.

కానీ వరంగల్‌‌ నగరానికి 1972లో అప్పటి అవసరాల మేరకు తయారుచేసిన మాస్టర్‌‌ ప్లానే ఇప్పటికీ అమలవుతోంది. అప్పటికీ, ఇప్పటికీ వరంగల్‌‌ రూపురేఖల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో 40 ఏండ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకొని 2013లో కుడా అధికారులు కొత్త మాస్టర్‌‌ ప్లాన్‌‌ను రెడీ చేశారు. కానీ ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడడం, ఎలక్షన్ల హడావుడితో పాటు వివిధ కారణాలతో మాస్టర్‌‌ ప్లాన్‌‌ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నగరంలో అడ్డదిడ్డంగా నిర్మాణాలు పెరిగిపోయాయి.

పదేండ్ల నుంచి పెండింగ్‌‌లోనే...

2041 విజన్‌‌తో 2013లోనే మాస్టర్‌‌ ప్లాన్‌‌ను తయారుచేయగా ఆ తర్వాత వరంగల్‌‌ నగరం స్మార్ట్‌‌ సిటీ, అమృత్​, హృదయ్‌‌ వంటి కేంద్ర పథకాలకు ఎంపికైంది. గతంతో పోలిస్తే నగర జనాభా విపరీతంగా పెరగడంతో 2018లో మళ్లీ మాస్టర్‌‌ప్లాన్‌‌ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్​పనులు చూస్తున్న ‘లీ అసోసియేట్స్’ అనే ప్రైవేట్‌‌ ఏజెన్సీ సంస్థతో కలిసి మాస్టర్‌‌ప్లాన్‌‌లో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కుడా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని మొత్తం 19 మండలాలు, 181 గ్రామాలు, 3.3 లక్షల ఇండ్లు, 14 లక్షల మంది జనాభాను దృష్టిలో పెట్టుకుని ‘మాస్టర్‌‌ ప్లాన్‌‌ -2041’ని ఫైనల్‌‌ చేశారు.

ఇందులో వివిధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, ఇతర భవిష్యత్‌‌ అవసరాలకు అనుకూలంగా ఉండేందుకు వివిధ జోన్లుగా విభజించారు. ఈ మేరకు రెసిడెన్షియల్, కమర్షియల్‌‌ ఇండస్ట్రియల్, మిక్స్‌‌డ్ యూజ్‌‌ జోన్, పబ్లిక్‌‌ యుటిలిటీస్‌‌ జోన్‌‌, పబ్లిక్​అండ్‌‌ సెమీ పబ్లిక్​జోన్, గ్రోత్‌‌ కారిడార్‌‌ 1, 2, రీక్రియేషన్‌‌ జోన్, విలేజ్‌‌ ఎక్స్‌‌పాన్షన్ జోన్‌‌, ట్రాన్స్‌‌పోర్ట్‌‌, అగ్రికల్చర్‌‌, ప్రొటెక్టెట్‌‌ అండ్​అన్‌‌డెవలపబుల్‌‌ యూజ్‌‌, హెరిటేజ్‌‌ కన్జర్వేషన్‌‌ జోన్‌‌ ఇలా మొత్తం 14 రకాల జోన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకొని అందులో సాధ్యమైన వాటిని పరిష్కరించి 2018లోనే ప్లాన్‌‌ను ఫైనల్‌‌ చేశారు.

అప్పటి లీడర్లు, ఆఫీసర్లు పలుమార్లు రివ్యూలు పెట్టి హడావుడి చేశారు. చివరకు 2020 మార్చి 11న అప్పటి మున్సిపల్‌‌ మంత్రి కేటీఆర్‌‌ ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా లీడర్లు, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి మాస్టర్‌‌ప్లాన్‌‌ను ఆమోదిస్తూ సంతకం చేశారు. కానీ ఇంతవరకు మాస్టర్‌‌ ప్లాన్‌‌పై ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదముద్ర పడలేదు. దీంతో పదేండ్ల నుంచి మాస్టర్ ప్లాన్‌‌ ఫైల్‌‌ ప్రభుత్వం వద్దే పెండింగ్‌‌లో ఉండిపోయింది.

కాంగ్రెస్‌‌ హయాంలోనైనా అమలయ్యేనా ?

చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌‌ నగరానికి 2013లో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలోనే మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందించారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పదేండ్ల పాలన పూర్తయినా ఫైల్‌‌కు మోక్షం కలగలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడడంతో మాస్టర్‌‌ ప్లాన్‌‌పై ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 మంది కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరూ మంత్రులుగా ఎంపికకావడంతో మాస్టర్‌‌ ప్లాన్‌‌కు ఈ సారైనా ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి జిల్లా నేతలు ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.