
హైదరాబాద్, వెలుగు: ఒక్క బిట్‌కాయిన్ వాల్యూనే సుమారు రూ. 30 లక్షలు..మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్ల మొత్తం విలువ ఏ రూ. 56 లక్షల కోట్లను దాటేస్తుంది. ఇంత డిమాండ్ ఉన్న బిట్‌కాయిన్లకు తాను 25 డాలర్లు (రూ. 1,900) కూడా ఇవ్వనని సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పారు. చాలా సార్లు క్రిప్టో కరెన్సీలను విమర్శించిన ఆయన, వీటిని ఎంతకు కొన్నా మరొకరికి అమ్మాల్సిందేనని చెప్పుకొచ్చారు. అదే యూఎస్‌లోని ఒక శాతం అపార్ట్‌మెంట్లనైనా కొనడానికి 25 బిలియన్ డాలర్లు చెల్లించొచ్చని ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్ కొంటే అద్దెల రూపంలో ఆదాయం వస్తుందని, పంట భూములను కొంటే పండించుకోవచ్చని బఫెట్ అన్నారు. కానీ, బిట్‌కాయిన్లను కొంటే ఏం రాదని చెప్పారు. భవిష్యత్‌లో ఈ క్రిప్టో కరెన్సీ ఎంత వరకు పెరుగుతుందో చెప్పలేనని, కానీ, క్రిప్టోలకు ఎటువంటి ప్రొడక్షన్ వాల్యూ ఉండదని అన్నారు. బిట్‌కాయిన్‌పై మస్క్ చేసిన ట్వీట్స్‌కు వ్యతిరేకంగా బఫెట్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ‘బిట్‌కాయిన్ జీసస్’ పబ్లిక్‌లోకి తిరిగొచ్చారు’ అని మస్క్‌ను ఉద్దేశిస్తూ బఫెట్ కిందటి వారం వ్యాఖ్యానించారు. ‘హా హా, ఆయన చాలా సార్లు బిట్‌కాయిన్ అంటున్నారు’ అని మస్క్ దీనికి రిప్లైగా ట్వీట్ చేశారు.