కేవలం వారం రోజులే ఆలోచించా: రిటైర్మెంట్‎పై అసలు విషయం బయటపెట్టిన పుజారా

కేవలం వారం రోజులే ఆలోచించా: రిటైర్మెంట్‎పై అసలు విషయం బయటపెట్టిన పుజారా

టీమిండియా నయా వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 24) సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలపై పుజారా నోరు విప్పాడు. నేషనల్ మీడియా చానెల్ ఆజ్ తక్‌తో పుజారా మాట్లాడుతూ.. క్రికెట్‎కు వీడ్కోలు పలకడం గురించి పెద్దగా ఆలోచించలేదని, కేవలం వారం రోజుల నుంచే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని తెలిపారు. 

రిటైర్మెంట్‎కు ఇదే మంచి సమయం అనిపించడంతో ఇక ఆటకు గుడ్ బై చెప్పేశానన్నాడు ఈ నయా వాల్. రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఇందుకు తనకు ఎలాంటి బాధ లేదన్నాడు. టీమిండియా తరుఫున విజయవంతమైన కెరీర్‌ను ఆస్వాదించడం సంతోషంగా ఉందన్నాడు. తనకు సహకరించిన సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

భారతదేశం తరపున ఆడాలనేది చిన్నప్పుటి నుంచి నా కల. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి.. చాలా సంవత్సరాలు ఈ ప్రయాణం కొనసాగించడంతో నా కల నెల వేరింది. నా కెరీర్‎లో ఎన్నో  జ్ఞాపకాలు, గర్వకారణమైన క్షణాలు ఉన్నాయన్నారు పుజారా. రానున్న రంజీ ట్రోఫీ ఆడాలని అనుకున్నా కానీ యువ ఆటగాళ్లకు దేశీయ క్రికెట్‌లో అవకాశం కల్పించడం కోసం తాను రిటైర్మెంట్ ప్రకటించానని తెలిపారు. యువ ఆటగాళ్లకు జట్టులో ఎంత త్వరగా అవకాశం వస్తే వారు అంత త్వరగా సిద్ధమవుతారని అభిప్రాయపడ్డారు. 

►ALSO READ | AUS vs SA: సిరీస్ గెలిచినా చిత్తుగా ఓడారు.. సౌతాఫ్రికా వన్డే చరిత్రలో అతి పెద్ద ఓటమి

భారత జట్టుతో నా ప్రయాణం, మేము ఆడిన మ్యాచ్‌లు, సిరీస్‌లు, జట్టు ప్రదర్శనలు, అవన్నీ నాకు చాలా స్పెషల్ అని చెప్పాడు. తనకు సంవత్సరాల పాటు దేశం తరపున ఆడే అవకాశం లభించిందని.. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టు తరపున ఆడే అవకాశం లభించినందుకు తాను కృతజ్ఞుడనన్నారు. 2009,  2011లో తనకు రెండు పెద్ద గాయాలు అయ్యాయని.. వాటి నుంచి కోలుకుని మళ్లీ గ్రౌండ్‎లో అడుగుపెడతానని అనుకోలేదని.. కానీ దేవుడి దయ వల్ల గాయాల నుంచి కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి చాలా కాలం పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించానని కెరీర్‎లోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు పుజారా. 

ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్ లాడిన పుజారా 43 యావరేజ్ తో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు చేసిన పుజారా.. టెస్టుల్లో స్పెషలిస్టుగా పేరుపొందాడు. ఆస్ట్రేలియాపై 2023లో డబ్ల్యూటీసి ఫైనల్ లో పుజారా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పుజారా కేరీర్ లో చిరస్మరణీయంగా మిగిలిన టెస్టు 2018-19 లో ఆడిన ఆస్ట్రేలియా టెస్టు. ఈ టెస్టులో మొత్తం 1258 బాల్స్ ఫేస్ చేసిన పుజారా.. 521 రన్స్ చేసి అదరగొట్టాడు. పన్నెండు వందలకు పైగా బాల్స్ ఫేస్ చేసి ఆస్ట్రేలియాకు వికెట్ దొరకకుండా చుక్కలు చూపించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా చేయడం దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.