నెమళ్లతో అనుబంధం.. వీడియోను షేర్ చేసిన మోడీ

నెమళ్లతో అనుబంధం.. వీడియోను షేర్ చేసిన మోడీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నెమళ్లతో తనకున్న అనుబంధం, సాన్నిహిత్యాన్ని అందమైన వీడియో రూపంలో నెటిజన్స్‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన అధికార నివాసంలో నెమళ్లతో మోడీ ఆహ్లాదంగా ఉండటం ఆకట్టుకుంటోంది. నెమళ్లకు గింజలు తినిపిస్తూ వాటిపై తన ఇష్టాన్ని, సాన్నిహిత్యాన్న వీడియో ద్వారా అందరితో పంచుకున్నారు. 1.47 నిమిషాల ఈ వీడియోను ట్విట్టర్‌‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు జతగా ఒక హిందీ పద్యాన్ని కూడా మోడీ జత చేశారు. బతికితే మురళీతోనే, వెళ్తే మురళీధరుడి కిరీటంతోనే అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పోయమ్‌ ఆకట్టుకుంటోంది.

వీడియోలో నెమళ్లకు గింజలు తినిపిస్తూ, అధికార భవనంలోని పచ్చదనంలో వాటి మధ్య నడుస్తూ, మార్నింగ్ ఎక్సర్‌‌సైజ్‌లు చేస్తూ మోడీ సరదాగా కనిపించారు. అధికారుల ప్రకారం.. సదరు నివాసంలో మోడీ పక్షులు గుడ్లు పెట్టుకోవడానికి, గూడు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండటానికి ‘ఛబూత్రాస్‌’ నిర్మించినట్లు సమాచారం. ప్రకృతిపై తన విజన్‌ను తెలపడానికి ‘కన్వీనియన్ యాక్షన్: గుజరాత్‌ రెస్పాన్స్‌ టూ చాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్‌’, ‘కన్వీనియంట్ యాక్షన్– కంటిన్యునిటీ ఫర్ చేంజ్‌’ అనే రెండు పుస్తకాలను మోడీ రాసిన సంగతి తెలిసిందే.