గ్రేటర్​లోవాటర్ పొల్యూషన్​కు చెక్ .. ఎక్కడపడితే అక్కడ తవ్వకాలుండవ్

గ్రేటర్​లోవాటర్ పొల్యూషన్​కు చెక్ .. ఎక్కడపడితే అక్కడ తవ్వకాలుండవ్
  • క్విక్ ఇన్​స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్’తో లీకేజీల గుర్తింపు
  • టైమ్​తో పాటు మనీ సేవ్ అవుతున్నదంటున్న అధికారులు
  • ఒక్కసారి చార్జింగ్ చేస్తే 48 గంటల పాటు వర్క్
  • ఎండోస్కోపీలాగా పని చేసి.. లీకేజీ పాయింట్ గుర్తింపు
  • ఆ ప్రాంతంలోనే తవ్వి.. పైప్​లైన్ మారుస్తున్న సిబ్బంది

హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లోని ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించాలనే లక్ష్యంతో మెట్రో వాటర్ బోర్డు అధికారులు ‘క్విక్ ఇన్​స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్’ (క్యూఐడబ్ల్యూపీఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నీటి కాలుష్యాన్ని అడ్డుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ఏ ప్రాంతంలో అయినా నీటి కాలుష్యం జరిగినట్టు సమాచారం అందితే వెంటనే పరిష్కరిస్తున్నారు. 

దీంతో డయేరియా కేసులు చాలా వరకు తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. నీళ్లు ఎక్కడ పొల్యూట్ అవుతున్నదో గుర్తించేందుకు క్యూఐడబ్ల్యూపీఎస్ పరికరం ఉపయోగపడుతున్నది. రోడ్డు తవ్వకుండానే ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. గతంలో నీరు పొల్యూట్ అవుతుందో లేదో గుర్తించేందుకు రోడ్లను తవ్వాల్సి వచ్చేది. అయినా ఒక్కోసారి సమస్య పరిష్కారం అయ్యేది కాదు. సమయంతో పాటు పైప్​లైన్ మార్చడంతో డబ్బులు కూడా వృథా అయ్యేవి. నల్లాల్లో ఇరుక్కున్న వ్యర్థాలు తొలగించడానికి సిబ్బంది ఎంతో ఇబ్బంది పడేవారు. పైప్​లైన్​లో రాళ్లు, మురుగు వ్యర్థాలు చిక్కుకునేవి. 

కొన్ని చోట్ల మంచి నీటి పైప్ లైన్​లో మురుగు నీటి  పైప్​లు పగిలి పొల్యూట్ అయ్యేవి. సమస్య ఎక్కడుందో గుర్తించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు. ఇష్టమున్న చోట తవ్వేవాళ్లు. వీటన్నింటికి ‘క్విక్ ఇన్​స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్’ పరికరంతో చెక్ పెట్టామని వాటర్ బోర్డు సర్కిల్–2 చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభు వెల్లడించారు. బోర్డు పరిధిలోని అన్ని డివిజన్లకు ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో అసలు నీటి కాలుష్యం అన్నది లేకుండా చూడడమే తమ లక్ష్యమని అన్నారు.

పరికరానికి కెమెరాతో పాటు లైట్

‘క్విక్ ఇన్​స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్’ అనే పరికరానికి లైట్ తో పాటు కెమెరా ఉంటుంది. నీటి కాలుష్యం జరుగుతున్న పైప్​లోకి దీన్ని పంపిస్తారు. దాదాపు 120 మీటర్ల పొడవు ఉన్న ఈ పరికరం.. పైప్ లోపల ఉన్న పరిస్థితిని కెమెరా ద్వారా మానిటర్​లో చూపిస్తుంది. మనిషికి ఎండో స్కోపీ ఎలా చేస్తారో.. అచ్చం అలాగే పైప్​లో ఏముందో ఈ పరికరం చెప్తుంది. లోపల ఉన్న మురుగు, రాళ్లను, ఇతర అడ్డంకులను కెమెరా గుర్తిస్తుంది. బ్యాటరీ సాయంతో నడిచే ఈ యంత్రం.. లీకేజీని పక్కాగా గుర్తిస్తుందని మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఎక్కడ అయితే సమస్య ఉందో.. అక్కడ మాత్రమే తవ్వి పైపులు సరి చేస్తున్నామని వివరించారు. దీంతో టైమ్​తో పాటు ఖర్చు కూడా తగ్గుతున్నదని తెలిపారు. 

రిమోట్​తో కూడా ఆపరేటింగ్

పైప్​లైన్​తో పాటు మ్యాన్​హోల్​లోని పూర్తి సమాచారాన్ని ‘క్విక్ ఇన్​స్పెక్షన్ వాటర్ పొల్యూషన్ సిస్టమ్’ పరికరం అందిస్తుంది. ఈ మెషీన్ ఆపరేటింగ్ చేసే వ్యక్తి.. పైప్​లోపల ఉన్న పరిస్థితిని మానిటర్ ద్వారా పరిశీలిస్తాడు. నీళ్లు ఎక్కడ కలుషితం అవుతున్నాయో గుర్తించేందుకు ఈ మెషీన్ ఎంతో ఉపయోగపడుతున్నదని అధికారులు వివరించారు. రిమోట్​తో కూడా ఆపరేట్ చేయొచ్చని తెలిపారు. పైప్ లైన్ లేదా మ్యాన్ హోల్ లోపల ఉన్నదంతా వీడియో రికార్డ్ చేసేందుకు మెమొరీ కార్డు కూడా ఉంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 48 గంటల వరకు నాన్ స్టాప్​గా పని చేస్తుంది.