కుంటలుతవ్వి, భూగర్భజలాలు తోడి.. అక్రమంగా నీళ్ల దందా

కుంటలుతవ్వి, భూగర్భజలాలు తోడి.. అక్రమంగా నీళ్ల దందా
  • గ్రేటర్​లో నీటి కొరతను అనుకూలంగా మార్చుకుని వ్యాపారం
  •     రూ. 5  వేల నుంచి 10 వేలకు ట్యాంకర్ చొప్పున అమ్మకాలు 
  •     అక్రమ నీటి దందాలపై రెవెన్యూ అధికారుల దాడులు 
  •     అక్రమంగా తవ్విన వాటర్ పాండ్స్ ధ్వంసం  

హైదరాబాద్/గండిపేట, వెలుగు: వేసవిలో గ్రేటర్ హైదరబాద్ పరిధిలో నీటి కొరతను తమకు అనుకూలంగా మలచుకుంటున్న కొందరు వ్యక్తులు అక్రమ నీటి వ్యాపారంతో జేబులు నింపుకుంటున్నారు. ఏకంగా కృత్రిమంగా వాటర్ పాండ్స్ తవ్వి.. వాటిలోకి బోర్ల ద్వారా అక్రమంగా భూగర్భ జలాలను తోడేసి నింపుతున్నారు. పాండ్స్ లో నీళ్లు ఇంకిపోకుండా టార్పాలిన్ వంటి కవర్లను ఉంచి నీటిని నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించి ఒక్కో ట్యాంకర్ కు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిజానికి మెట్రో వాటర్ బోర్డు అధికారులు ట్యాంకర్లతో బస్తీలకు, కాలనీలకు నీటిని సరఫరా చేస్తుంటారు. కొందరు బోర్లు వేసుకుని, ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముకుంటుంటారు. ఇప్పటివరకూ వ్యవసాయం కోసం పొలాల్లో వాటర్ (ఫామ్) పాండ్స్ ఏర్పాటు చేసుకుని నీటిని నిల్వ చేస్తుంటారు. కానీ కొందరు వ్యక్తులు గ్రేటర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పొలాల్లో వాటర్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని, భూగర్భజలాలను తోడేసి అమ్ముకుంటున్నారు. దీంతో అవాక్కయిన రెవెన్యూ అధికారులు శనివారం గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. జేసీబీలతో పాండ్స్ ను ధ్వంసం చేయించారు. అక్రమంగా పాండ్స్ తవ్వి, నీటిని అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.   

కృత్రిమ కుంటలతో నీటి దందా 

రంగారెడి జిల్లా పరిధిలోని గండిపేట మండలం వట్టినాగులపల్లి, ఖానాపూర్‌‌ తదితర ప్రాంతాల్లో కొందరు ఇలా వ్యవసాయ భూముల్లో కృత్రిమ కుంటలు తవ్వి, బోరు మోటార్లతో నీళ్లు తోడి నింపుతూ అక్రమ దందా చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం వట్టినాగులపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. నీటిని నిల్వ ఉంచిన పాండ్స్ ను ధ్వంసం చేయించారు. చట్ట విరుద్ధంగా భూగర్భజలాలను తోడేసి అమ్ముకుంటున్నవారిని గుర్తించారు. ఇలాంటి అక్రమ వ్యాపారంపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు తెలిపారు. అక్రమంగా నీటిని తోడేసి అమ్ముకుంటే.. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ (వాల్టా) యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

నీటి సరఫరాకు చర్యలు: వాటర్​బోర్డు 

సిటీలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో కాలనీలకు నీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మెట్రోవాటర్​బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే గ్రేటర్​పరిధిలో కొత్తగా 20 ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసి మూడు షిఫ్ట్ ల్లో సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు అదనపు ట్యాంకర్లు, డ్రైవర్లను సమకూర్చుకుంటున్నట్లు వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ నుంచి 200 మంది డ్రైవర్లను తీసుకుంటున్నామని, ఇందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా అంగీకరించారని తెలిపారు.