హిమాలయ టౌన్లలో నీళ్ల తిప్పలు..4 దేశాల్లో ఇదే పరిస్థితి

హిమాలయ టౌన్లలో నీళ్ల తిప్పలు..4 దేశాల్లో ఇదే పరిస్థితి

హిమాలయాల సుట్టుముట్టున్న ప్రాంతాలంటే నీళ్లకు ఫికర్‌‌‌‌ లేదనుకుంటరు. ఎండాకాలమైనా నీళ్ల కోసం తిప్పలు వడాల్సిన అవసరం ఉండదనుకుంటరు. కానీ ఆడ కూడా నీళ్ల కోసం పరేషానే ఉందంట. ఎండాకాలమైతే నీళ్లు దొరుకుడు కష్టమైతున్నదంట. హిందూకుష్‌‌‌‌ హిమాలయ ప్రాంతంలో ఉన్న 4 దేశాల్లోని 13 పట్టణాలల్ల నీళ్ల కరువు ముంచుకొస్తున్నదంట. ఇందులో మన దేశంలోనివే 5 టౌన్లున్నయంట. ‘అర్బన్‌‌‌‌ హిమాలయా రన్నింగ్‌‌‌‌ డ్రై’ పేరుతో విడుదలైన ఓ స్టడీ ఈ విషయం వెల్లడించింది. మన దేశంలో ముస్సోరి, దేవ్‌‌‌‌ప్రయాగ్‌‌‌‌, సింగ్టమ్‌‌‌‌, కలింపోంగ్‌‌‌‌, డార్జిలింగ్‌‌‌‌తో పాటు నేపాల్‌‌‌‌లోని ఖాట్మండు, భరత్‌‌‌‌పూర్‌‌‌‌, తాన్‌‌‌‌సేన్‌‌‌‌, దమౌలీ, పాకిస్థాన్‌‌‌‌లోని ముర్రీ, హవేలియన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌లోని సిల్హెట్‌‌‌‌, చిట్టగాంగ్‌‌‌‌లలో ఈ పరిస్థితి గుర్తించినట్టు పేర్కొంది.

బావులు, చెరువులు మాయమైతున్నయ్‌‌‌‌

హిమాలయ హిందుకుష్‌‌‌‌లో నీటి కొరత సర్వేను ఇంటర్నేషనల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మౌంటెయిన్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఐసీఐఎంవోడీ) నిర్వహించింది. అసలా ప్రాంతంలో నీళ్లకు కరువొచ్చే పరిస్థితి ఎందుకొచ్చిందో పరిశీలించగా..  నీటి నిర్వహణ, పట్టణాల్లో ప్లానింగ్‌‌‌‌ సరిగా లేకపోవడం, పట్టణ జనాభా, టూరిజం పెరుగుతుండటం, ఎక్కువవుతున్న వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని తేలింది. హిమాలయ ప్రాంతంలోని నీటి బుగ్గలు, చెరువులు, సరస్సులు, కాలువలు, నదులలోని నీళ్లను ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారని, ఇందులోని నీళ్లు కలుషితమవుతున్నాయని పేర్కొంది. స్థానికంగా ఉండే బావులు, చెరువులు మాయమైపోతున్నాయని, ఆక్రమించేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

మున్ముందు కష్టమే

ప్రస్తుతానికి హిమాలయ, హిందూకుష్‌‌‌‌ ప్రాంతంలోని మొత్తం జనాభాలో3 శాతమే అక్కడి పెద్ద సిటీల్లో ఉంటోందని, 8 శాతం చిన్న పట్టణాల్లో నివసిస్తోందని సర్వే వెల్లడించింది. కానీ 2050 నాటికి పట్టాణాల్లో జనాభా 50 శాతానికి మించి పెరుగుతుందని, అప్పుడు నీటి డిమాండ్‌‌‌‌ పెరిగి సమస్య వస్తుందని హెచ్చరించింది. ఎక్కడ నీళ్ల కరువొచ్చినా ఎక్కువ ఇబ్బంది పడేది పేదలేనని, నీళ్లు దొరక్క అల్లాడిపోతారని చెప్పింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండాకాలంలో జనానికి నీళ్ల తిప్పలు ఏటేటా ఎక్కువైతూనే ఉన్నాయని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే నీటి వనరులను కాపాడాలని, వాటర్‌‌‌‌ హార్వెస్టింగ్‌‌‌‌ పద్ధతులను పాటించాలని సూచించింది.