
సూర్యాపేట, వెలుగు : మూసీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వానాకాలం ఆరు తడి పంటల సాగుకు నేటి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. తొలి విడత 25 రోజులు ఆ తర్వాత మూడు విడతలుగా ఒక్కో విడతకు 15 రోజుల విరామంతో 15 రోజులపాటు నీటిని విడుదల చేసేలా షెడ్యూల్ రూపొందించారు.
మొదటి విడత నేటి నుంచి ఆగస్టు 12 వరకు, రెండో విడత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11వరకు, మూడో విడత సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు, నాల్గో విడత అక్టోబర్ 26 నుంచి ప్రాజెక్ట్ లో నీరు ఉన్నంత వరకు కాల్వలకు నీటిని విడుదల చేయన్నున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 641.29 అడుగులు(3.54టీఎంసీలు) నీరు ఉంది. మూసీ నీటితో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 35 వేల ఆయకట్టు సాగులోకి రానుంది.