రాష్ట్రంలో నీటి వనరులు పెరిగినయ్ : మంత్రి తలసాని

రాష్ట్రంలో నీటి వనరులు పెరిగినయ్ : మంత్రి తలసాని

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా అన్ని నీటి వనరులకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని హరితప్లాజాలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యరంగం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సహజ నీటి వనరులలో చేపల పెంపకంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయతో వైభవం వచ్చిందన్నారు.

కాళేశ్వరం వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేప పిల్లలను వదులుతున్నామని పేర్కొన్నారు. 2014 కు ముందు 1.90 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, ఇప్పుడు 4 లక్షల టన్నుల కు పెరిగిందన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తిని మన రాష్ట్రంలోనే జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఈ ఏడాది 10 కోట్ల మేర చేప పిల్లలు ఉత్పత్తి చేశామని తెలిపారు. అన్ని వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను కోహెడ వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు చెప్పారు.