మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా

మినీ ట్యాంకర్లతో నీటి సరఫరా

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​పరిధిలో మండుతున్న ఎండలతో నీటి వాడకం పెరిగింది. మెజారిటీ కాలనీలు, బస్తీలు వాటర్​ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. అయితే చాలాచోట్ల గల్లీలు ఇరుకుగా ఉండడంతో బడా ట్యాంకర్లు లోనికి వెళ్లలేకపోతున్నాయి. నల్లాల ద్వారా నీళ్లు రాక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా ఏరియాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటర్​బోర్డు కొత్త ఆలోచన చేసింది. మినీ ట్యాంకర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

ప్రస్తుతం వాటర్​బోర్డు వద్ద 600 ట్యాంకర్లు ఉండగా, ఆర్టీఏ, ప్రైవేట్ వ్యక్తుల నుంచి వాహనాలు సేకరించి మరో 200 ట్యాంకర్లతో నీటిని అందించేందుకు అధికారులు ప్లాన్​చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్​బోర్డు అధికారులు పగలు, రాత్రి సమయాల్లో 5 వేల లీటర్లు,10 వేల లీటర్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొత్తగా 2,500 లీటర్ల కెపాసిటీతో 70 ట్యాంకర్లను అందుబాటులోకి తేవాలని ప్లాన్​చేస్తున్నారు. 

వీటితో అన్ని ప్రాంతాల్లోకి ఈజీగా వెళ్లొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చామని, వాటిని చిన్న, చిన్న వాహనాలకు అమర్చి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. శివారు మున్సిపాలిటీల్లో మున్ముందు ట్యాంకర్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉన్నందున వీలైతే ట్రాక్టర్ ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్​చేస్తున్నామన్నారు.

మరింత పటిష్ఠంగా అమలు

సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్ మెన్ల పనితీరు తదితర అంశాలపై ఉన్నతాధికారులు సీరియస్​గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తాగునీటి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. దీంతో అధికారులు వేసవి ముగిసేవరకు సిటీలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్ మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వాటర్​బోర్డు రూపొందించిన యాప్ లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కిందిస్ధాయి సిబ్బందికి ఆదేశాలు అందాయి. నీటి సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే బాధ్యులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. 

జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరాలం, ఆసిఫ్ నగర్ దగ్గరున్న ఫిల్టర్ బెడ్స్ వంద శాతం పనిచేసేలా రిపేర్లు చేపడుతున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఆయా ప్రాంతాల్లో చిన్న చిన్న  నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి స్థలం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.