
మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీనరసింహ పురంలో రూ.2.98 కోట్లతో నిర్మించే 33/11 కేవీ సబ్ స్టేషన్, గొల్లగూడెం దగ్గర పాకాల వాగుపై రూ.7 కోట్లతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. జీకే పేటలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వ్యవసాయం, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలపై పన్నుల భారం మోపకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ఇందిర సౌర గిరి జల వికాసం కింద ఆదివాసీ రైతులకు బోర్లు, సోలార్ పవర్ పంప్సెట్లు, డ్రిప్ పరికరాలు అందిస్తామని, ఈ పథకాన్ని ఈ నెల 18న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట చెంచుకాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జాటోత్ రామచంద్రనాయక్, భూక్య మురళి నాయక్, రాందాస్ నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.
సీతారామ నీళ్లించేందుకు సర్వే చేస్తాం
భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సీతారామ నీళ్లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇంట్లో మీడియాతో మాట్లాడారు. సీతారామ నీళ్లు ఇల్లెందు, మహబూబాబాద్ ప్రాంతాలకు అందించేందుకు సర్వే చేసి నివేదికలు తెప్పిస్తానని తెలిపారు.
రాజీవ్ యువ వికాసం స్కీం లోన్ల విషయంలో సోషల్ మీడియాలో సిబిల్ స్కోర్ పేరుతో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. సిబిల్ స్కోర్ విషయంలో అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం తీసుకువచ్చామని చెప్పారు.
జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్బావ వేడుకల్లో అర్హులైన వారందరికీ యువ వికాసం మంజూరు ఆర్డర్లు ఇస్తామన్నారు. సింగరేణి సీఎండీ ఎన్. బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహూల్ పాల్గొన్నారు.