ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నామని, అరకొరగా మిగిలి ఉన్న పనులు కూడా త్వరలో పూర్తి చేసుకుందామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. శనివారం మండలంలోని వి.వి పాలెంలో రూ.53లక్షలతో అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రఘునాథపాలెం మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశామన్నారు. జిల్లాలో ఇప్పటికే 1.50 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు అందుతుండగా, కొత్తగా 49 వేల మందికి అందించనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీ గౌరీ, జడ్జీటీసీ ప్రియాంక పాల్గొన్నారు.

మార్కెట్​నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి 

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు ఒకేచోట లభించేలా నిర్మిస్తున్న మోడ్రన్​వెజ్, నాన్​వెజ్​ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ శనివారం పరిశీలించారు. వీడీవోస్​కాలనీలో 2ఎకరాలలో నిర్మిస్తున్న మార్కెట్​లో 65 వెజ్​ స్టాల్స్​. 23 ఫ్రూట్​ స్టాల్స్​, 46 నాన్​వెజ్​ స్టాల్స్​ మొత్తం 134 స్టాల్స్​ను ఏర్పాటు చేసి ప్రజలకు అన్నీ ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. మంత్రితోపాటు మేయర్​పునుకొల్లు నీరజ పాల్గొన్నారు.  

కారును వెంబడించి బంగారు గొలుసు చోరీ 

పాల్వంచ,వెలుగు: ఓ కారును వెంబడించిన ఐదుగురు వ్యక్తులు యజమానిని బెదిరించి బంగారు గొలుసు చోరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరకు చెందిన రాజశేఖర్ రెడ్డి శుక్రవారం రాత్రి పాల్వంచకు కారులో వస్తుండగా వెనుక నుంచి మరో కారులో వచ్చిన ఐదుగురు యువకులు మండలంలోని కేశవాపురం వద్ద కారును అడ్డగించారు. రాజశేఖర్ రెడ్డి పై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోతే తుపాకీతో కాల్చి వేస్తామని 
భయపెట్టి చైన్​ చోరీ చేశారని బాధితుడు శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు ఎస్సై ఎం.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక 

పాల్వంచ, వెలుగు: రాష్ట్ర స్థాయి పోటీలకు పాల్వంచ మండలం కిన్నెరసాని మోడల్  క్రీడా స్కూల్​లో శనివారం ఐటీడీఏ పరిధిలోని స్కూళ్లకు చెందిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ పోటీలను ట్రైబల్​వెల్ఫేర్​డీడీ ఆర్.రమాదేవి ప్రారంభించారు. అండర్–19 బాలబాలికల విభాగంలో వివిధ క్రీడాంశాల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, చెస్, అథ్లెటిక్స్, వాలీబాల్..  క్రీడాంశాల్లో క్రీడాకారులను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ వీరానాయక్ తెలిపారు.

రామయ్య భూముల ఆక్రమణపై..ఏపీ హైకోర్టులో పిల్​

భద్రాచలం,వెలుగు: పురుషోత్తపట్నంలోని భద్రాచలం రామాలయం భూముల ఆక్రమణపై ఏపీ హైకోర్టులో పిల్​ దాఖలైంది. రాష్ట్రీయ వానరసేన ఏపీ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు లాయర్​కె.మల్లిఖార్జునమూర్తి అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 917 ఎకరాలను  ఏపీ అధికార పార్టీ లీడర్లు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ నవంబరు 2న ప్రజాప్రయోజనాల పిల్​ దాఖలు చేశారు. ఈ పిల్​ ఈనెల 7న విచారణకు రానుంది. 

పోడు భూములకు సర్వే చేపట్టాలని..పోడుదారుల రాస్తారోకో

ములకలపల్లి,వెలుగు: 40 ఏండ్ల కింద వలస వచ్చి అడవిలో పోడు భూములు సాగుచేసుకుంటున్నామని, ఆ భూములకు సర్వే చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఫారెస్ట్​ ఆఫీస్​ ముందు పోడుదారులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకుడు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ వలసొచ్చి ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ ​వీరభద్రం అక్కడకు చేరుకొని ఉన్నతాధికారులతో మాట్లాడి సర్వే చేయిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎండీ యూసూఫ్, నరాటి రమేశ్, వీరూనాయక్, ఇమ్మాన్యూయేల్ పాల్గొన్నారు. ములకలపల్లి మండలం మాధారంలోని పోడు భూములను సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పరిశీలించారు. పోడు భూముల సర్వే చేసి పోడుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

యాదవ, కురుమలకు నగదు బదిలీ చేస్తాం.. 

సత్తుపల్లి, వెలుగు: యాదవ, కురుమలకు ఉపయోగపడేలా నగదు బదిలీ చేస్తామని గొర్రెల, మేకల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శనివారం యాదవ, కురుమలకు పాడి గేదెలు, గొర్రెల పంపిణీ సబ్సిడీ లోన్లపై సత్తుపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యాదవ, కురుమలకు గొర్రెల పంపిణీకి సంబంధించి నగదు బదిలీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా సబ్సిడీ లోన్లు, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్సూర్, కార్యదర్శి నాగేశ్వరరావు, లీడర్లు పాల్గొన్నారు. 

కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు

ఖమ్మం టౌన్, వెలుగు: కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో పెండింగ్ కోర్టు కేసులపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించి 62 టైం బౌండ్​కేసులు, 79 డైరెక్షన్స్, 11 ధిక్కార, 323 రిట్ పిటిషన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ధరణిలో దరఖాస్తుదారులు తమ సమస్యలను ఏ మాడ్యూల్స్ లో దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జడ్పీ సీఈవో అప్పారావు, డీపీవో హరిప్రసాద్, డీఈవో యాదయ్య, డీఆర్డీవో విద్యాచందన, డీఎంహెచ్​వో బి.మాలతి పాల్గొన్నారు.

కేజీబీవీలో విద్యార్థుల ధర్నా

కరకగూడెం, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లిలోని కేజీబీవీలో శనివారం విద్యార్థులు క్లాస్​రూమ్ లో  ధర్నాకు దిగారు. కొన్ని రోజులుగా మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని, కారం పొడి, నీల్లచారుతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తే  టీసీ ఇచ్చి పంపిస్తామని, అసభ్యకర మాటలతో ఎస్​వో మేడం బెదిరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు కేజీబీవీకి చేరుకొని ఎస్​వోను నిలదీశారు. కరకగూడెం ఎస్సై జీవన్ రాజ్​ విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. సమస్య ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కరమయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.

12న జాతీయ లోక్​ అదాలత్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 12న జాతీయ లోక్​ అదాలత్​ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్​ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు హాల్​లో శనివారం పోలీస్​ అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రాజీ కాదగిన పెండింగ్​ క్రిమినల్​ కేసులపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్​ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.

ఉమెన్స్ కాలేజ్ లో పుస్తక ప్రదర్శన

ఖమ్మం టౌన్, వెలుగు: ఈ నెల 14 నుంచి 20 వరకు జరిగే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఖమ్మం సిటీలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో బుక్ రీడర్స్ క్లబ్ తెలంగాణ పబ్లికేషన్స్ సౌజన్యంతో శనివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.పద్మావతి ప్రారంభించారు.

నేడు ఛాంబర్ ఆఫ్ కామర్స్​ ఎన్నికలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో నేడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అధికారి పీబీ పట్టాభి తెలిపారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు అనుబంధంగా ఉన్న 19 శాఖల పోస్టులకు ఆదివారం సిటీలోని జూబ్లీ క్లబ్​లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 1240 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధ్యక్ష పదవికి ముగ్గురు వ్యాపారులు పోటీలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన కొదుమూరి మధుసూదన్​మధ్య తీవ్ర పోటీ ఉంది

సబ్​ సెంటర్ల పనుల్లో డిలే ఎందుకు?

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: నిర్మాణాలు పూర్తి చేయరు, పూర్తి చేసిన వాటిని వినియోగించరు, ఇట్లయితే ఎట్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్​ అనుదీప్​ ఇంజినీరింగ్​ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో సబ్​ సెంటర్లు, పల్లె దవాఖానాలు,  హాస్పిటల్స్​ రిపేర్లపై పబ్లిక్​హెల్త్, ఇంజినీరింగ్​ అధికారులతో శనివారం రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో 155 సబ్​ సెంటర్ల నిర్మాణం చేపట్టగా 134 పూర్తయ్యాయని, 21 అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటిని కూడా వినియోగంలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నామని ప్రశ్నించారు. భద్రాచలంలో చిన్న పిల్లల వార్డు పనులు ఈ నెల 20లోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్​ అధికారులను ఆదేశించారు. మీటింగ్​లో డీఎంహెచ్​ఓ దయానందస్వామి, హాస్పిటల్స్​ కో ఆర్డినేటర్​ డాక్టర్​ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్​ఓ డాక్టర్​ సుకృత, ఐటీడీఏ ఈఈ తానాజీ, టీఎస్​ఎండీసీ డీఈ వెంకట్​, ప్రోగ్రాం అధికారులు డాక్టర్​ నాగేంద్ర ప్రసాద్​, డాక్టర్​ సుజాత పాల్గొన్నారు.

బంగారు తులసీదళాలతో రామయ్యకు అర్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం గర్భగుడిలో మూలవరులకు బంగారు తులసీదళాలతో అర్చన నిర్వహించారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చి భక్తుల సమక్షంలో సుప్రభాత సేవ చేశారు. భద్రుని మండపంలో శ్రీరామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం జరిగింది. కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం చేశారు. 65 జంటలు ఈ క్రతువును నిర్వహించాయి. సాయంత్రం దర్బారుసేవ జరిగింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా శనివారం రాత్రి సీతారామచంద్రస్వామి జగన్మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు.  క్షీరసాగర మథనం జరిగిన రోజు కాబట్టి అర్చకులు అమృత  ప్రసాదాన్ని నివేదన చేశారు. 

గిరిజన రైతులకు పట్టా పాస్​పుస్తకాలు ఇవ్వాలి 

పెనుబల్లి, వెలుగు: ఏరుగట్లలో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాస్​పుస్తకాలు ఇవ్వాలని ఎంపీపీ లక్కినేని అలేఖ్య రెవెన్యూ అధికారులను కోరారు. శనివారం గిరిజన రైతుల భూ సమస్యలపై తహసీల్దార్​తో ఎంపీపీ సమావేశమయ్యారు. మండలంలోని  ఏరుగట్ల గ్రామ రెవెన్యూలోని 1 నుంచి 161 సర్వే నంబర్లలలో గిరిజనులు, పేద రైతులకు పంచిన 120ఎకరాల పట్టాభూములు నేటికీ ధరణిలో నమోదు కాకపోవడంతో వారికి రైతుబంధు , రైతు బీమా వర్తించడం లేదన్నారు. వెంటనే ఆ భూములను సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. 

చికిత్స పొందుతూ యువకుడు మృతి 

కూసుమంచి, వెలుగు: కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన సుంకరి రమేశ్​(30) అనే యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రమేశ్​కూసుమంచిలోని ఓ ఫర్టిలైజర్​షాపులో గుమాస్తాగా పనిచేసేవాడు. షాపులో ఎరువులు, పురుగు మందు డబ్బాలు రమేశ్​చోరీ చేసినట్లు ఓనర్​గత నెల 29న కేసు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి మూడు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.