ప్లాస్టిక్ పరేషాన్.. సముద్ర గర్భంలో కోటి 40 లక్షల టన్నుల ప్లాస్టిక్

ప్లాస్టిక్ పరేషాన్.. సముద్ర గర్భంలో కోటి 40 లక్షల టన్నుల ప్లాస్టిక్

ప్లాస్టిక్.. మనం నిత్యం వాడే ప్రతి వస్తువు దీనితో ముడిపడి ఉన్నదే. తినే తిండి మొదలుకుని ప్రతి దాని విషయంలోనూ ప్లాస్టిక్​వాడకం తప్పనిసరి అయిపోయింది. దాని వల్ల ఎదురయ్యే ప్రతికూలతల గురించి తెలిసి కూడా మనం ప్లాస్టిక్​ వాడటాన్ని కంట్రోల్​ చేసుకోలేకపోతున్నాం. ప్లాస్టిక్‌‌ వాడకాన్ని కంట్రోల్​ చేసేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. దీంతో అర్బన్, రూరల్​ ఏరియాలనే తేడా లేకుండా అన్నింటా ప్లాస్టిక్​ వేస్ట్​ పెరిగిపోతోంది.

అంతటా ప్లాస్టిక్​ వేస్టే..

భూమిపైనే కాదు కాల్వలు, నదులు ఆఖరికి సముద్ర జలాలనూ ప్లాస్టిక్‌‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. ప్రతిఏటా ప్లాస్టిక్​ పొల్యూషన్​తో సముద్రాలు మరింత కలుషితమైపోతున్నాయి. బీచ్​లు, సముద్రతీరాల్లో ప్లాస్టిక్ వేస్ట్​ మేటలు వేస్తోంది. అయితే సముద్రం పైనే కాదు లోపల కూడా గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్​ వేస్ట్​ పేరుకుపోతోందని తాజా స్టడీలో వెల్లడైంది. దీని ప్రభావం సముద్ర జీవులపై చాలా ఎక్కువగా పడుతోంది. ప్లాస్టిక్​ వేస్ట్​ను తిని లేక వాటిలో చిక్కుకుని ఎన్నో అరుదైన జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజా స్టడీ ప్రకారం సముద్ర గర్భంలో దాదాపు 14 మిలియన్​ టన్నుల(కోటి 40 లక్షల టన్నులు) మైక్రో ప్లాస్టిక్​ తిష్ఠ వేసినట్టు అంచనా. అంటార్కిటికానే కాక మహా సముద్రాల్లోని చాలా రిమోట్​ఏరియాలకు కూడా ఈ ప్లాస్టిక్​ వేస్ట్​ చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్ర జలాల్లో తేలుతుందని భావిస్తున్న ప్లాస్టిక్​ కంటే ఇది 35 రెట్లు ఎక్కువ. సముద్ర గర్భంలో చిన్న చిన్న ముక్కలుగా అంటే ఐదు మిల్లీమీటర్ల కంటే చిన్నగా ప్లాస్టిక్​ ముక్కలుగా పరుచుకుని ఉన్నాయని గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్​ సైన్స్​ ఏజెన్సీ సీఎస్ఐఆర్​వో స్టడీలో ఈ విషయం బయటపడింది.

ఈ తరానికే పెను సవాల్

‘‘మహాసముద్రం అడుగు భాగంలో కూడా ప్లాస్టిక్ పొల్యూషన్​ సమస్య ఎదురవుతోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్నచిన్న ముక్కలుగా మారి కిందికి చేరుతున్నాయి. అక్కడే అలా పేరుకుపోతున్నాయి” అని ఈ స్టడీని లీడ్​ చేసిన జస్టిన్​ బారెట్​ చెప్పారు. ఈ తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఎన్విరాన్​మెంటల్​ సవాళ్లలో మైక్రో ప్లాస్టిక్​ కూడా ఒకటని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది చిన్న సమస్యకాదని, గ్లోబల్​గా డీల్​ చేయాల్సిన విషయమని అంటున్నారు. ఇది నిరంతరమైన సమస్య అని, సముద్రంపైనే కాక అందులో ఉండే జీవరాశుల మనుగడకు ప్రమాదకరమని, వీటి వల్ల మనుషుల ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్​ ప్రొడక్షన్​ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ‘‘రిమోట్​ ఏరియాల్లో అంత స్థాయిలో మైక్రోప్లాస్టిక్​ను గుర్తించడం షాక్​కు గురిచేసింది. ఎక్కడ, ఎంత మైక్రోప్లాస్టిక్​ ఉందో గుర్తించడం ద్వారా ఈ సమస్య తీవ్రత ఎంత ఉందనే విషయం తెలుస్తుంది’’ అని ప్రిన్సిపల్​ రీసెర్చ్​ సైంటిస్ట్​ డాక్టర్​ డెనిసీ హార్డెసీ చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే మానవ జాతి మనుగడకే సవాలు అని హెచ్చరించారు. వీలైనంత మేర ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడం మానవాళి బాధ్యత అని, ఇందుకు ప్రభుత్వాలతో పాటు ఇండస్ట్రీలు, సామాన్య జనాలు కలసి పని చేయాలని, అప్పుడే ప్లాస్టిక్​ వేస్ట్​ను తగ్గించగలుగుతామని చెప్పారు.

3,000 కిలోమీటర్ల లోతులో శాంపిల్స్ సేకరణ

ఒక రోబోటిక్​ సబ్​మెరైన్​ ద్వారా సౌత్​ ఆస్ట్రేలియాకు 380 కిలోమీటర్ల పరిధిలోని ఆరుచోట్ల  సముద్రంలో 3,000 మీటర్ల లోతులో శాంపిల్స్​ కలెక్ట్​ చేశారు. మొత్తం 51 శాంపిల్స్​ను ఎనలైజ్​ చేయగా.. ఒక గ్రాముకు సగటున 1.26 మైక్రో ప్లాస్టిక్​ పీస్​లను గుర్తించారు. గతంలో సముద్ర గర్భంలో చేసిన స్టడీలతో పోలిస్తే ఇది 25 రెట్లు ఎక్కువ. ఈ శాంపిల్స్​ను 2017 మార్చి, ఏప్రిల్​ మధ్యలో తీసుకున్నారు. ప్రస్తుతం 15 కోట్ల టన్నుల ప్లాస్టిక్​వేస్ట్​ సముద్ర జలాల్లో తేలుతూ ఉందని, ఏటా అదనంగా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్​ అందులోకి చేరుతోందని వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం డేటా చెబుతోంది. గ్లోబల్​ ఎఫర్ట్ పెట్టి ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించినప్పటికీ 2040 నాటికి ప్లాస్టిక్​ వేస్ట్​ 71 కోట్ల టన్నులకు చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది.