పులి చర్మాన్ని ట్రాన్స్​పోర్టు చేస్తున్నందుకు నీపై కేసు పెట్టాం : సైబర్ నేరగాళ్లు

పులి చర్మాన్ని ట్రాన్స్​పోర్టు చేస్తున్నందుకు నీపై కేసు పెట్టాం : సైబర్ నేరగాళ్లు
  •     వృద్ధుడికి కాల్ చేసిభయపెట్టిన సైబర్ నేరగాళ్లు
  •     డబ్బులిస్తే కేసు మాఫ్ చేస్తమంటూ రూ.20 లక్షలు వసూలు

బషీర్​బాగ్, వెలుగు : పులి చర్మం అక్రమంగా రవాణా చేస్తున్నవంటూ వృద్ధుడికి కాల్ చేసి భయపెట్టిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి డబ్బులు కాజేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్(70)కు ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఫిడెక్స్ కొరియర్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పాడు. ‘ నీ పేరుతో కొరియర్ ద్వారా విదేశాలకు పులి చర్మం వెళ్తోంది.. ఇలా ట్రాన్స్​పోర్టు చేయడం నేరం’ అని వృద్ధుడికి చెప్పాడు. దీనిపై తాము సీబీఐకి సమాచారమిచ్చామని చెప్పి సదరు వ్యక్తి కాల్ కట్ చేశాడు. కొద్దిసేపటికే మరో వ్యక్తి వృద్ధుడికి కాల్ చేశాడు. తాను సీబీఐ అధికారినని చెప్పాడు. 

పులి చర్మం ట్రాన్స్ పోర్టు చేసున్నందుకు నీపై కేసు బుక్ చేశామంటూ బెదిరించాడు. ఈ కేసు మాఫ్ చేయాలంటూ రూ.20 లక్షలు తాను చెప్పిన అకౌంట్​కు పంపించాలని వృద్ధుడికి చెప్పాడు. సదరు వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. అతడు చెప్పిన అకౌంట్ కు డబ్బులు పంపించాడు. ఆ తర్వాత కూడా సదరు వ్యక్తి డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.