
మూడో వన్డే లో భాగంగా ఇండోర్ లో ఉన్న ఇండియన్ క్రికెట్ టీం.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. వీరిలో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అనంతరం బాబా మహాకాల్ భస్మ హారతి చేశారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించామని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సందర్భంగా చెప్పారు. అతడు కోలుకోవడం తమకు చాలా ముఖ్యమన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను ఇప్పటికే గెలిచామన్న ఆయన.. వారితో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన పంత్ కు ఇటీవలే ప్లాస్టిక్ సర్జరీ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.
అంతకుముందు టీమిండియా ఆటగాళ్లు శ్రీపద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అందులో భాగంగా సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ సర్వశక్తిమంతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలో వారు ఆలయంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.