ఓడామని ఏడుస్తూ కూర్చోం.. బ్రాంజ్ మెడల్‌తో తిరిగొస్తాం

ఓడామని ఏడుస్తూ కూర్చోం.. బ్రాంజ్ మెడల్‌తో తిరిగొస్తాం

టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని అనుకున్న భారత్ పురుషుల హాకీ టీమ్ కల చెదిరింది. సెమీఫైనల్‌లో పటిష్టమైన బెల్జియంపై మూడు గోల్స్ తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో హాకీ ఫ్యాన్స్, దేశ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత జట్టు.. ఈసారి స్వర్ణంతోనే తిరిగొస్తుందని అందరూ భావించారు. కానీ సెమీస్‌లో చతికిలపడటంతో అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే గోల్డ్, సిల్వర్ మెడల్ గెలిచే చాన్స్ మిస్సయినప్పటికీ భారత్‌కు బ్రాంజ్ నెగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో మన హాకీ ప్లేయర్లు కూడా ఫుల్ పాజిటివిటీతో కనిపిస్తున్నారు. సెమీస్‌లో ఓడినందుకు బాధపడుతూ కూర్చుంటే బ్రాంజ్ మెడల్ కోసం జరిగే పోరుపై దృష్టి పెట్టలేమని అంటున్నారు. 

‘బెల్జియంపై ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చింది. మేం గెలవాలనే మైండ్‌సెట్‌తో గ్రౌండ్‌లోకి దిగాం. కానీ దురదృష్టవశాత్తూ మేం విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు మేం బ్రాంజ్ మెడల్ కోసం జరిగే మ్యాచ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఐదేళ్లుగా ప్లేయర్లు అందరమూ కలసి ఓ జట్టుగా ముందుకెళ్తున్నాం. ఈస్థాయికి చేరుకోవడానికి మేం చాలా కష్టపడ్డాం. మరింత మెరుగైన ఫలితానికి మేం అర్హులం. కానీ మాకు ఏదీ కలసి రాలేదు. అయితే తదుపరి జరిగే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. దేశానికి కనీసం కాంస్య పతకం అందించాలని అనుకుంటున్నాం. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది’ అని భారత మెన్స్ హాకీ టీమ్‌ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. 

కెప్టెన్ మన్‌ప్రీత్ అభిప్రాయంతో సీనియర్ ప్లేయర్, గోల్ కీపర్ శ్రీజేష్ ఏకీభవించాడు. ‘సెమీస్‌లో బెల్జియంతో  ఓటమి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మర్చిపోయి భవిష్యత్‌పై దృష్టి పెట్టాలి. ఇప్పటికీ మేం మెడల్ నెగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఓటమిని తల్చుకుని ఏడుస్తూ కూర్చోలేం. మాకు అంత టైమ్‌ కూడా లేదు. గత మ్యాచ్ వీడియోలు చూస్తూ చేసిన తప్పిదాలను గుర్తిస్తాం. వాటిని సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌లో సత్తా చాటుతాం’ అని శ్రీజేష్ తెలిపాడు.