రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా డ్యూటీ చేస్తాం : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్

రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా డ్యూటీ చేస్తాం : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సీరియస్ ​యాక్షన్

హనుమకొండ, వెలుగు: పోలీసులు భూ సమస్యల జోలికి పోవద్దని వరంగల్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు. వ్యక్తులను టార్గెట్​చేసి రెచ్చగొట్టే కామెంట్స్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని, కామన్ మ్యాన్ మెసేజ్ చేసినా స్పందిస్తానన్నారు. శనివారం మధ్యాహ్నం వరంగల్ సీపీగా ఏవీ.రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఉమ్మడి వరంగల్​ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. వరంగల్ అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి భూసమస్యలు ఎక్కువగా ఉంటాయని, పోలీసులు భూ సమస్యల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా పని చేస్తామన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

శాంతిభద్రతలను పణంగా పెడితే ఊరుకోం..

శాంతిభద్రతలను పణంగా పెట్టి రాజకీయంగా ఎదగాలని చూస్తే ఊరుకోబోమని సీపీ ఏవీ.రంగనాథ్​ స్పష్టం చేశారు. ఏడాదిలోగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇదే క్రమంలో రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందన్నారు.  నేరుగా గానీ, సోషల్ మీడియాలో గానీ వ్యక్తిగత దూషణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తమ భుజాలపై తుపాకీ పెట్టి ఎదుగుదామని చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. షర్మిల పాదయాత్రపై స్పందిస్తూ కోర్డు ఆదేశాల మేరకు పాదయాత్ర కొనసాగించవచ్చునని వివరించారు.

కొత్త సీపీకి గ్రాండ్​ వెల్​ కమ్..

వరంగల్ సీపీగా బాధ్యతలు తీసుకున్న ఏవీ రంగనాథ్​కు ఇక్కడి పోలీస్​ ఆఫీసర్లు గ్రాండ్​ వెల్​ కమ్​ చెప్పారు. ముందుగా కమిషనరేట్​ ఆఫీస్​ కు చేరుకున్న ఆయనకు.. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత బదిలీపై వెళ్తున్న డా.తరుణ్​ జోషి.. సీపీ రంగనాథ్​కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇతర ఆఫీసర్లు కొత్త సీపీకి బొకెలు, పూల మొక్కలు అందించి వెల్​కమ్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డా.వినీత్ జీ, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్ కుమార్, సీతారాం, అడిషనల్​ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, సంజీవ్, సురేశ్ ఉన్నారు.