లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్‌‌ స్వీప్ చేస్తం.. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ: మంత్రి వివేక్‌‌

లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్‌‌ స్వీప్ చేస్తం.. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ: మంత్రి వివేక్‌‌
  • తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచింది
  • బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల్లో ఉద్యమంలా మారింది
  • రాష్ట్రంలో బీజేపీ డీలా.. పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్
  • ఢిల్లీలో మీడియాతో మంత్రి చిట్‌‌చాట్‌‌

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు చెప్పని ఎన్నో కొత్త పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానంగా రుణ మాఫీ, రైతు భరోసా వంటి హామీలను రేవంత్ సర్కార్ చేసి చూపిందన్నారు. వందేండ్ల తర్వాత శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కుల గణన మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ గణాంకాల ఆధారంగా లోకల్ బాడీ ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని వెనుకబడిన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. ఇలా ప్రతి వర్గం మద్దతుతో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ మంగళవారం పెద్దపలి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రతి గ్రామంలో ఉద్యమంగా మారిందన్నారు. ఒకప్పుడు అగ్రవర్ణాలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లు వేయించేవని, కానీ ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం సైతం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.  రాజకీయంగా బీసీలు కూడా ఎదిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు. అందుకే వెనుకబడిన వర్గాలకు రాజకీయం, విద్యా, ఉద్యోగాల్లో సామాజిక న్యాయం అందించాలనే తమ పార్టీ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. ఈ దిశలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. 

అంతర్గత విభేదాల్లో బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. మరోవైపు, అంతర్గత వివాదాలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్‌‌‌‌తో పోటీలో కూడా లేవని విమర్శించారు. గతంతో పోలిస్తే బీజేపీ డీలా పడిందన్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ వీక్ అవుతుందన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, కేంద్రంలోని బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న పోరాటంతో ఆ పార్టీకి ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని చెప్పారు. ఇదే టైంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి, నియంతృత్వ చర్యలతో ఆ పార్టీ పీకల్లోతు మునిగిందని విమర్శించారు. కుటుంబంలో ఆస్తులు, అధికారం కోసం జరుగుతున్న పంచాయితీ వల్ల ప్రజా క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కనిపించడం లేదన్నారు. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌‌‌‌కే పరిమితం కావడం క్యాడర్‌‌‌‌‌‌‌‌ని పూర్తిగా వీక్ చేసిందన్నారు. కాగా, తమ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచనలు, రాహుల్ దిశా నిర్దేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా రంజక పాలన అందిస్తోందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమ వెంటే ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.