రేవంత్పై అసమ్మతి నేతల తిరుగుబాటు

రేవంత్పై అసమ్మతి నేతల తిరుగుబాటు

కొత్త కమిటీల నియామకం రాష్ట్ర కాంగ్రెస్లో అసమ్మతిని మరోసారి బయటపెట్టింది. కమిటీల నియామకంతో ఏర్పడిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి  పదవులు కట్టబెట్టారంటూ సీనియర్లు గరమవుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ పదవులకు రాజీనామా సైతం చేశారు. తాజాగా కాంగ్రెస్ అసమ్మతి నేతలంతా  భట్టి ఇంట్లో సమావైశమై కొత్త కమిటీల అంశంపై చర్చించారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడుపుతున్నారని, పార్టీని కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్న నేతలు కమిటీల వ్యవహారంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా రేవంత్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ను వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోంది : భట్టి

కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్లకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీని కాపాడేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం చేపడుతామన్నారు. పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి కమిటీల్లో అవకాశం రాలేదని తెలిపారు. ఈ విషయంలో తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతూ పార్టీని బలహీన పరుస్తున్నారని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని కొందరు నేతలు తనతో చెప్పారని.. అయితే కమిటీల నియామకంలో తాను పాలుపంచుకోలేదని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఆయన.. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని.. దేశవ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటామని చెప్పారు. 

నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడట : ఉత్తమ్

కమిటీల్లోని 108 మందిలో 58 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి పార్టీని ఉద్దరిస్తాడా..? అని ప్రశ్నించారు. కొత్త కమిటీల్లో బయటి పార్టీ నుంచి వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారన్న ఉత్తమ్... కావాలనే సోషల్ మీడియాలో తమను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. తన వాళ్లే పదవుల్లో ఉండాలని తానెప్పుడూ భావించలేదని, కాంగ్రెస్ను రక్షించుకునేందుకే ఒరిజనల్ కాంగ్రెస్ నేతలంతా సమావేశమయ్యామని ఉత్తమ్ చెప్పారు. 

పార్టీని నాశనం చేసే కుట్ర : మధుయాష్కి

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. క్యారెక్టర్ లేనివాళ్లు పార్టీని నడిపిస్తున్నారని, తమను ప్రశ్నించే స్థాయి వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస వచ్చినోళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు పంచాయితీ వచ్చిందన్నారు. ఇదంతా పార్టీని నాశనం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. సీఎల్పీ నేతను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్న మధుయాష్కీ.. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాపోయారు. సోషల్ మీడియా ఖబర్దార్ అన్న మధుయాష్కీ.. తమపై తప్పుడు ప్రచారం చేయకండని అభ్యర్థించారు. పీజేఆర్ కుమారుడు విష్ణు అవకాశం ఇవ్వరా..? అని ప్రశ్నించారు. విష్ణుకు అనుకూలంగా అలోచించి వార్తలు రాయండని కోరారు. తమకు పదవులు కాదు..పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు పదవులు ఇవ్వాలని అడుగుతున్నామని కోరారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మేం నాలుగు పార్టీలు తిరిగి రాలేదు : రాజనరసింహా

రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని దామోదర రాజనరసింహా అన్నారు. అందరితో మమేకమవుతూ.. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీని పెంచే దిశగా తాము ఎప్పుడూ ప్రయత్నం చేస్తామన్నారు. భట్టి, ఉత్తమ్ చెప్పినట్టు సోషల్ మీడియాలో తమను తప్పుపడుతున్నారని చెప్పారు. నాలుగు పార్టీల్లో తిరిగి వచ్చిన చరిత్ర తమది కాదన్న దామోదర రాజ నర్సింహ్మ... కాంగ్రెస్ లో పుట్టినం.. కాంగ్రెస్ లో పెరిగినం..  కాంగ్రెస్ లోనే చస్తమని తేల్చి చెప్పారు. కానీ కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే.. వారిని కాపాడే దిశగా తమ ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

నేతలు వలసొచ్చాకే కోవర్టులనే పదం వినిపిస్తోంది : జగ్గారెడ్డి

వలసొచ్చిన నేతలు వచ్చాకే  కోవర్టులు అనే పదం వినిపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. లోకల్ బాడీ ఎమెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే బాగోదని..పోటీ చేశామని..సిద్ధిపేట, ఖమ్మం జిల్లాలో పోటీలో నిలబడి కాంగ్రెస్  ఉనికి కాపాడినమన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న తాము కోవర్టులమా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తమపై  తప్పుడు ప్రచారాలు జరుగుతున్నా..వలస నాయకుడు కనీసం ఖండించడం లేదన్నారు. రాహుల్ అంటే పిచ్చి కాబట్టే..ఆయన పాదయాత్రను సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు. భవిష్యత్లో ఇంకా చాలా విషయాలు చెబుతానని స్పష్టం చేశారు.