
- పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఢిల్లీలోనే కాదు.. గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ఆయన సోమవారం మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతుంది. కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం.
కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్(ఎస్పీఎల్) లో బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యం. పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి కష్టపడుతున్న నిఖార్సైన కార్యకర్తలకే ఈసారి టిక్కెట్లు ఇస్తాం. అంతేకాదు గెలిపించుకుంటాం..’ అని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ను బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిధులివ్వకపోవడమే కాకుండా.. కేంద్రం నిధులను సైతం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు.