అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలం.. రెండు రోజులు వానలు

అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలం.. రెండు రోజులు వానలు

చెన్నై: కేరళ తీరానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 28 నుంచి జనవరి 30 వరకూ వాతావరణం పొడిగా ఉంటుందని.. అల్ప పీడన ప్రభావంతో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పుదుచ్చేరి, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

సముద్రం మీదుగా బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని.. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాలు, కన్యాకుమారి ప్రాంతంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెన్నై వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జనవరి 29, 30 తేదీల్లో కూడా కన్యాకుమారి దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

►ALSO READ | అది యాక్సిడెంట్ కాదు.. ఊహించని హత్య కుట్ర : భయంకరమైన నిజాన్ని బయటపెట్టిన డాష్ క్యామ్ విజువల్స్

సముద్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందు వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెన్నై వాతావరణ కేంద్రం సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోయినప్పటికీ మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పెరిగే అవకాశాలున్నాయి.