‘నేతన్నకు బీమా’ కంటితుడుపు చర్య కారాదు : డా. శ్రీరాములు గోసికొండ

‘నేతన్నకు బీమా’ కంటితుడుపు చర్య కారాదు : డా. శ్రీరాములు గోసికొండ

అనాదిగా తెలంగాణ రాష్ట్రంలోని పద్మశాలీల  సాంప్రదాయక కులవృత్తి చేనేత. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలోని ఘన చరిత్ర కలిగిన చేనేత రంగం కుదేలై, నేత కార్మికులు పవర్ లూమ్ లకు ప్రసిద్ధి గాంచిన పశ్చిమ పట్టణాలైన భీవండి, సోలాపూర్, సూరత్, బొంబాయి లకు పొట్టచేత పట్టుకొని ఉన్నఊరు-, కన్నతల్లి కట్టుకున్న ఆలి, -పుట్టిన పిల్లలను వదిలి వెళ్ళారు. 1970 దశకంలో మొదలైన ఈ నేతన్నల వలసలు దాదాపు 2000 సం. వరకు కొనసాగాయి.  మారిన కాలానుగుణంగా నేతన్నల కుటుంబాల్లో ఈ వలస సమస్యలు లేవు.

విభిన్న వృత్తులు చేపడుతున్న పద్మశాలీలు

కొంతమంది పద్మశాలీలు చీరలకు ప్రసిద్ధిచెందిన ప్రాంతాలైన పోచంపల్లి, గద్వాల, కొత్తకోట, నారాయణపేట వంటిచోట్ల,  మరికొంతమంది సిరిసిల్ల ‘మినీ షోలాపూర్’ అయ్యాక, పవర్ లూమ్స్ స్థాపిస్తూ, వాటిని నడిపిస్తూ చేనేత వృత్తిలోనే కొనసాగుతున్నారు, కానీ, చాలామంది పద్మశాలి కులస్తులు చేనేత వృత్తిలో ‘ఆమ్ దాని’   లేదనే కృతనిశ్చయానికి వచ్చారు. ఫలితంగా మెజారిటీ పద్మశాలీల్లో ముఖ్యంగా యువత రకరకాల  వృత్తులను  ఎంచుకున్నారు. చాలామంది చిరు  వ్యాపారాలు చేయడం,   ఇంకా కొంతమంది ఆధునిక విద్యనభ్యసించి వివిధరంగాల్లో ఉద్యోగస్తులుగా  వృత్తులను మార్చుకొని జీవితంలో నిలదొక్కుకుంటున్నారు.  అయినా మెజారిటీ పద్మశాలీలు తమ వృత్తిలోనే బతుకుతున్నారు.

అనారోగ్యం పాలవుతున్నరు

హాండ్లూమ్ పై పనిచేసే నేతకార్మికులైనా, పవర్ లూమ్ పై పనిచేసే నేతకార్మికులైనా 50 ఏండ్లు  పైబడ్డ తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు. నేతన్నలు గంటలతరబడి కూర్చోవడం/నిలబడడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగక పక్షవాతం, కిడ్నీల్లో వాపు రావడం వంటి రోగాల బారినపడుతున్నారు.  నేత కార్మికులతో పాటుగా కండెలు చుట్టేవారు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. చాలామంది నేతకార్మికుల కుటుంబాల్లోని మహిళలు బీడీలు చేస్తారు కావున వారిని కాన్సర్ వంటి మహమ్మారి కబళించే ప్రమాదమూ ఉంది. అంటే మొత్తమ్మీద నేత కార్మికుల కుటుంబాలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు నేతన్నల కుటుంబాలకు, వారి చేసే వృత్తివల్ల ఏవిధమైన జబ్బులు వస్తాయనే విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అహ్మదాబాదులోనున్న  ‘నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్’ ను సంప్రదించాలి. ఇంకా ఉపాధి కరువై వందల సంఖ్యలో నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అందుకే 2004 లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించింది. 

అందరికీ  వర్తించని ‘నేతన్నకు బీమా’ పథకం

2022 ఆగస్ట్​ నెల నుంచి నేత కార్మికుల కోసం ‘నేతన్నకు బీమా’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.   ఏ కారణం చేతనైనా 18నుంచి-59 ఏండ్ల మధ్య వయసున్న నేత కార్మికులు చనిపోతే, వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ చెల్లిస్తుంది. కానీ రాష్ట్రంలో చాలా మంది చేనేత కార్మికులు 59 ఏండ్లు పైబడ్డవారే ఉన్నందువల్ల చేనేత కార్మికులకు ఈ పథకం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది.  కావున ఈ బీమా మొత్తాన్ని సగానికి  తగ్గించైనా, చేనేత కార్మికులందరికీ  ఈ పథకాన్ని అమలుచేయాలి. అయితే ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేనప్పుడుగానీ, ఏదైనా రంగం అవసానదశలో ఉన్నప్పుడుగానీ ఇటువంటి బీమా సౌకర్యం అనే కొత్త పల్లవిని అందుకుంటాయి. మరో మాటలో చెప్పాలంటే, నేతన్న యొక్క ప్రాణం విలువ 5 లక్షల రూపాయలన్నమాట. నిజానికి బీమా సౌకర్యం అనేది నేతన్నలే సొంతంగా చేసుకునేలా వారిని  ఆర్థికంగా పరిపుష్టం చేయాలి. ఏ వృత్తిలోనైనా ఫాయిదా లేకపోతే యువత ఆ వృత్తిని ఎంచుకోవడానికి ఇష్టపడదు. ప్రస్తుతం చేనేత రంగం కూడా ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేవలం బీమా సౌకర్యం కల్పిస్తూ, చేనేత రంగాన్ని గాడిలోపెట్టకపోతే, సిరిసిల్ల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ జంపఖానలు కనుమరుగైనట్లే. వేరే ప్రాంతాల్లోని చేనేతవస్త్రాలు కూడా అంతరించిపోవడం ఖాయం.  అందువల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి, బీమా యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించి,  వారి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి సులభంగా ప్రీమియంలను చెల్లించే బీమా సౌకర్యాన్ని  ఎంచుకునేలా ప్రోత్సహించాలి.  కావున నేతన్నలు చనిపోయిన తర్వాత వచ్చే బీమా సొమ్ముకు బదులుగా, రాష్ట్ర ప్రభుత్వం వారికి  బ్రతికున్నప్పుడే సరైన పని కల్పిస్తే గౌరవప్రదంగా, హుందాగా ఉంటుంది. 

నేతన్నలందరికీ పనికల్పించని బతుకమ్మ చీరలు

తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2010 నుండి 2020 వరకు రాష్ట్రంలో 323 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేతన్నల కుటుంబాలు ఇటు సరైన ఆదాయంలేక అప్పుల సుడిగుండంలో కూరుకుపోవడం, అటు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని భావించిన తెలంగాణ సర్కారు వారిని ఆదుకొనేందుకు ఆసరా పథకం, బతుకమ్మ చీరలు వంటి పథకాలు అమలుచేస్తోంది. నేతన్నలకు ఉపాధి కల్పించడానికి 2017  నుంచి  ఇప్పటివరకు మొత్తం 5 సార్లు, 5.81 కోట్ల బతుకమ్మ చీరలను నేయించింది. 2022 లో ఈ చీరల తయారీకి  సుమారు రూ. 339 కోట్లు వెచ్చించింది. కానీ బతుకమ్మ చీరల యొక్క నాణ్యత విషయంలో అనేక విమర్శలు వస్తున్నాయి.  కూలీ రేటు పెంచి,  సరికొత్త డిజైన్లతో మంచి నాణ్యతా ప్రమాణాలతో చీరలను తయారు చేయమని ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. అయితే ఈ చీరలు పూర్తిగా మరమగ్గాలపై మాత్రమే నేస్తున్నారు. అలా రాష్ట్రంలో  చేనేత కార్మికులకు సరైనపని దొరక్క నష్టపోతున్నారు. అంటే ప్రభుత్వం నేరుగా సహాయంచేసే ఈ పథకం యొక్క ఫలాలు  హాండ్లూమ్ పై పనిచేసే నేతకార్మికులకు చేరడంలేదన్నమాట. కాబట్టి ప్రభుత్వం చేనేత కార్మికులకు తగినంత పనికల్పించాలి.

- డా. శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, జడ్చర్ల