
- భారీగా పెరిగిన ఫంక్షన్ హాళ్ల రెంట్స్
- జూన్ 30 నుంచి జులై 28 వరకూ ఆషాఢం
- రేపటి నుంచి జూన్ 14 వరకు వరుసగా ముహూర్తాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లగ్గాలు జోరుగా జరుగుతున్నాయి. పోయిన నెల చివరి వారం వరకూ నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో రాష్ర్టవ్యాప్తంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. మళ్లీ శుభ ఘడియలు రావడంతో లగ్గాలు, గృహ ప్రవేశాలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7న వందల సంఖ్యల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. వచ్చే నెల 14 వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో జంటలు ఏకం కానున్నాయి. ఈ నెల రోజుల్లో సుమారు 20 వేల లగ్గాలు జరగనున్నాయని పురోహితులు అంచనా వేస్తున్నారు.
ఆగస్టు 20 నుంచి శ్రావణ మాసం
ఈ నెలలో వైశాఖ మాసం, వచ్చే నెలలో జ్యేష్ఠ మాసం సందర్భంగా వచ్చే నెల14 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్ట్ 20 వరకు ముహూర్తాలు లేవు. ఆరోజు నుంచే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది రెండు నెలలు మూఢాలు వచ్చినయి. జూన్ 30 నుంచి జులై 28 వరకు ఆషాఢ మాసం ఉండటంతో సుమారు నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
వందల కోట్ల వ్యాపారం
పెండ్లి ముహూర్తాలు స్టార్ట్ కావటంతో రాష్ర్టంలో వందల కోట్ల వ్యాపారం జరగనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే క్లాత్, గోల్డ్ షోరూమ్ లలో షాపింగ్ లు మొదలయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేలు పలుకుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెండ్లిలో బంగారం ప్రధానం కావటంతో కొనక తప్పదని అంటున్నారు. ఇక ఫంక్షన్ హాల్స్, బాంక్వెట్ హాల్స్ అన్నీ రికార్డు స్థాయిలో 2 నెలల పాటు బుక్ అయ్యాయి. ప్రస్తుతం ముహూర్తాలు అధికంగా ఉండటంతో నిర్వాహకులు రెంట్ ను భారీగా పెంచారు. ఒకే రోజు 2, 3 ఫంక్షన్లు కూడా నిర్వహించేలా హాళ్లు బుక్ అయ్యాయి. చిన్న ఫంక్షన్ హాల్‌కు సైతం 8 గంటలకు రూ.5 లక్షలు వసూలు చేస్తుండగా.. పెద్ద హాల్స్, రిసార్ట్స్ లు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఫొటోగ్రాఫర్లకు రూ.3 లక్షలు, డెకరేషన్ కు రూ.3 లక్షలు అవుతున్నాయి. ప్లేట్ నాన్ వెజ్ ఫుడ్‌కు రూ.550 నుంచి రూ.1,200 వరకు, వెజ్ అయితే రూ.200 నుంచి రూ.400 వరకు కాస్ట్ ఉందని క్యాటరింగ్ నిర్వాహకులు చెబుతున్నారు.
లక్షల మందికి ఉపాధి
ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో క్యాటరింగ్, టెంట్, బ్యాండ్, సన్నాయి మేళం, డెకరేషన్, పూలు, లైటింగ్, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్స్, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఫుల్ గిరాకీ వస్తోంది. ఈ సర్వీసుల ద్వారా లక్షల మందికి ఉపాధి దొరుకుతోంది. రోజువారీ క్యాటరింగ్ కు వెళ్లే వారికి 8 గంటలకు రూ. 1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మంచి ముహూర్తాలు ఇవే..
- మే: 3, 4, 12, 14, 18, 20, 21, 22, 25
- జూన్: 1, 3, 5, 6, 8, 9, 10, 14
- జూన్ 30 నుంచి జులై 28 వరకు ఆషాఢం
- ఆగస్ట్ 20 వరకు మూఢాలు
- ఆగస్ట్ 20 నుంచి శ్రావణ మాసం
ఈ నెలలో11 పెళ్లిళ్లు బుక్ అయినయ్
మా రిసార్ట్‌లో 11 పెళ్లిళ్లు బుక్ అయ్యాయి. ఒక్క రోజుకు రూ.4 లక్షలు చార్జ్ చేస్తున్నాం. రూమ్‌లు అయితే మరో లక్ష అదనంగా ఉంటుంది. కొంత మంది 3, 4 రోజుల పాటు కూడా చేస్తున్నరు. వారికి రూ.13 లక్షల వరకు తీసుకుంటున్నం. డెకరేషన్, ఫుడ్ క్యాటరింగ్‌కు అదనంగా మరో రూ.15 లక్షలు ఖర్చు అవుతుంది.
- రాంరెడ్డి, బండ్లగూడ, రిసార్ట్ మేనేజర్, హైదరాబాద్
ఆర్డర్స్ ఎక్కువై వదులుకుంటున్నం
పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావడంతో మా స్టూడియోకు ఆర్డర్స్ ఫుల్ వస్తున్నయి. జులైలో ఆషాఢమాసం కారణంగా ముహుర్తాలు లేవు. గత నెలలో కూడా లేవు. కొన్ని తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో ఆర్డర్స్ వదులుకుంటున్నం. ఒక్కో పెండ్లికి రూ.3 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చార్జ్ చేస్తున్నం. ఇందులో పెండ్లి, ప్రీవెడ్డింగ్ షూట్, సంగీత్, రిసెప్షన్ అన్నీ ఉన్నాయి.
- సుభాష్ రెడ్డి, హైదరాబాద్