సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తయ్ : ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్

సంక్షేమ పథకాలే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తయ్ : ఏఐసీసీ సెక్రటరీ సంపత్  కుమార్

అయిజ, వెలుగు: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మద్దతుదారులను గెలిపిస్తాయని అలంపూర్  మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్  కుమార్  తెలిపారు. ఆదివారం అయిజలోని పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. అలంపూర్  నియోజకవర్గంలోని అయిజ, ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో విద్య, రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు శాంక్షన్  చేయించానని చెప్పారు. 

అయిజ, మానవపాడు, ఉండవెల్లి మండలాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.27 కోట్లు, ఉండవెల్లి, అయిజ మండలాల్లో రెండు స్కూళ్ల డెవలప్​మెంట్​కు రూ.2 కోట్లు ప్రభుత్వం శాంక్షన్  చేసిందన్నారు. ఎన్నికల కోడ్  ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలంపూర్  చౌరస్తాలో నిరుపయోగంగా ఉన్న వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 

ఇక్కడి ఎమ్మెల్యే ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఎమ్మెల్సీ కార్యాలయానికే పరిమితమయ్యాడని విమర్శించారు. అనంతరం అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో కాంగ్రెస్  మద్దతుతో ఏకగ్రీవమైన 10 జీపీల సర్పంచులను సన్మానించారు. ఏఎంసీ చైర్మన్  దొడ్డప్ప, కాంగ్రెస్  రాష్ట్ర అధికార ప్రతినిధి శెక్షావలి ఆచారి, జయన్న, సంకాపూర్  రాముడు, రంగు శ్రీధర్, మద్దిలేటి, దేవేందర్  పాల్గొన్నారు.