సినిమా హాళ్లపై మమత సర్కార్ కీలక నిర్ణయం

సినిమా హాళ్లపై మమత సర్కార్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా అన్‌‌లాక్‌‌లో భాగంగా మూసేసిన పలు రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే సినిమా హాళ్లు మాత్రం తెరవలేదు. దీంతో సినీ రంగానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అలాగే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో సినిమా హాళ్ల తెరిచివేతకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి తమ స్టేట్‌‌లో సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేట్లరును తెరుచుకోవచ్చునని ఆమె ప్రకటించారు. అయితే సోషల్ డిస్టెన్సింగ్‌‌తోపాటు కరోనా నిబంధనలను పక్కాగా పాటించాల్సిందేనని తెలిపారు. థియేటర్‌‌లో 50 లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో ప్రేక్షకులతో నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 22న దుర్గ పూజ ఉత్సవాల నేపథ్యంలో దీదీ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి జాతరలు, ఆటలు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు, సినిమా హాళ్లు, మ్యూజికల్ డ్యాన్స్, మేజిక్ షోలను 50 మంది లోపు ప్రజలతో అక్టోబర్ 1 నుంచి నిర్వహించుకోవడానికి అనుమతిస్తున్నాం. అయితే ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్కులు కట్టుకోవడం లాంటి ప్రోటోకాల్స్‌‌‌ను మాత్రం తప్పకుండా పాటించాలి’ అని మమత చెప్పారు.