ఫోన్ ట్యాపింగ్ కేసు.. పరారీలో కీలక నిందితులు : డీసీపీ విజయ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసు.. పరారీలో కీలక నిందితులు : డీసీపీ విజయ్ కుమార్
  •    ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశాం
  •     కోర్టుకు ఆధారాలు సమర్పించాం
  •     మీడియాలో ఊహాజనిత వార్తలు సరికాదు: వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ 

హైదరాబాద్, వెలుగు : ఎస్ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం, ఫోన్​ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకూ నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశామని, మరికొందరు కీలక అనుమానితులు పరారీలో ఉన్నారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. కేసు దర్యాప్తుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌లోని కొందరు పోలీసు అధికారులు

ఇతరులు కలిసి ఎస్ఐబీ నిబంధనలకు విరుద్ధంగా పలు నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. దీనికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో (సీఆర్‌‌‌‌ నెం 243/2024) కేసు నమోదు అయిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇన్వెస్టిగేషన్ పురోగతికి సంబంధించి ఇప్పటికే నాలుగుసార్లు ప్రెస్ రిలీజ్​ఇచ్చామన్నారు.

కేసుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే కోర్టుకు అందించామని తెలిపారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఇతర వివరాలేవీ బయటకు చెప్పలేదని డీసీపీ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు ఊహాగానాల ఆధారంగా వార్తలు రాస్తున్నాయని, ఇది ప్రజలను అయోమయానికి గురిచేయడమేనన్నారు. ఊహాగానాలతో వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.