గన్నీ బ్యాగుల ఇండస్ట్రీ ఏమాయే?

గన్నీ బ్యాగుల ఇండస్ట్రీ ఏమాయే?
  • వరంగల్​లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఎర్రబెల్లి
  • ఏడాదిన్నర గడిచినా ముందుకుపడని అడుగు 
  • కోల్​కతా నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి
  • సంచులు లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

‘‘మన రాష్ట్రంలో గన్నీ బ్యాగుల ఇండస్ట్రీ లేదు. ప్రతిసారీ అవసరమైన సంచులను కోల్​కతా నుంచి తెప్పించుకుంటున్నం. తెలంగాణలో కూడా గన్నీ బ్యాగుల ఇండస్ట్రీ పెట్టాలని రిక్వెస్ట్​ చేస్తే.. ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు.  వరంగల్​లో ఏర్పాటు చేసేందుకే సీఎం కేసీఆర్​యాక్సెప్ట్​ చేశారు. మామునూరు లేదా మడికొండలో దీనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.’’ 
– గతేడాది ఏప్రిల్​13న వడ్ల కొనుగోలుపై అప్పటి వరంగల్ అర్బన్​, రూరల్​ జిల్లాల ఆఫీసర్లతో హనుమకొండలో నిర్వహించిన మీటింగ్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పిన మాటలివి.

హనుమకొండ, వెలుగు: ఏటా పంట కోత సీజన్​ వచ్చిందంటే అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ఇబ్బందులు ఎదురవుతుంటే.. మరోవైపు ఓపెన్​ చేసిన చోట్ల బార్దాన్​ లేక అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే వర్షాల ముప్పు పొంచి ఉండటం.. బార్దాన్​ లేక కొనుగోళ్లు సాగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సీజన్​లో ఈ సమస్య ఎదురవుతుండగా.. గన్నీ సంచుల కోసం ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సి వస్తోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి  తెలంగాణలోనే గన్నీ బ్యాగుల ఇండస్ట్రీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇదే విషయాన్ని గతేడాది యాసంగి కొనుగోళ్ల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రకటించారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు సంచుల కొరత తీరుతుందని అంతా భావించారు. కానీ మంత్రి మాట ఇచ్చి ఏడాదిన్నర దాటినా దాని గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత తీరక కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు సంచుల కోసం రోజులపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

25.8 కోట్ల సంచులు అవసరం
ప్రతి సీజన్​లో వడ్లు సేకరించడానికి సివిల్​సప్లైస్​కార్పొరేషన్​కు సగటున 20 కోట్ల వరకు గోనె సంచులు అవసరం అవుతాయి. అన్ని కొత్త బ్యాగులు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమవుతున్న నేపథ్యంలో ప్రతి సీజన్​లో 46 శాతం పాత బ్యాగులు వాడుకునేందుకు ఎఫ్​సీఐ వెసులుబాటు కల్పించింది.  అయినా రాష్ట్రంలో అనుకున్న విధంగా సంచులు అందుబాటులో లేక ప్రతి సీజన్​లో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ వానాకాలం సీజన్​ లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. 1.03 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని సివిల్​ సప్లయిస్​ కార్పొరేషన్​అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లను కొనేందుకు మొత్తంగా 25.8 కోట్ల వరకు సంచులు అవసరమవుతాయని ఆఫీసర్లు ప్రతిపాదించారు.  కానీ రాష్ట్రంలో కొత్తవి, పాతవి అన్నీ కలిపి సుమారు 12 కోట్ల సంచులు మాత్రమే ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అంటే అనుకున్న టార్గెట్ లో సగం కూడా లేవు. దీంతో చాలా సెంటర్లలో పాత సంచులతోనే నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. 

రేటు పెంచుతున్న కాంట్రాక్టర్లు
గోనె సంచుల కొరత నేపథ్యంలో ప్రతి సీజన్​లో ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గన్నీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోనే ఉన్నాయి. దీంతో సీజన్​ స్టార్ట్​ అయిన ప్రతిసారి కోల్​కతా, విజయనగరం జిల్లా నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా అక్కడి నుంచే సరఫరా అవుతుండటంతో అక్కడా కొరత ఏర్పడింది.  దీంతో కాంట్రాక్టర్లు రేట్లు పెంచి సప్లై చేస్తున్నట్లు తెలిసింది. కొనుగోలు కేంద్రాలకు అనుకున్న స్థాయిలో సంచులు అందక ఇబ్బందులు తలెత్తుండగా.. బార్దాన్​ లేనికారణంగా కాంటాలు కూడా వేయడం లేదు. దీంతో అన్నదాతలు కాంటాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 8న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కొనుగోలు కేంద్రం ఓపెన్​ చేసేందుకు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్ బాబు రాగా.. అక్కడి రైతులు ఆయనను అడ్డుకున్నారు. బార్దాన్​ లేకుండా వడ్లను కొనుగోలు కేంద్రాలకు ఎలా తీసుకురావాలని నిలదీశారు. ఇదే తరహాలో సంగారెడ్డితో పాటు ఇతర జిల్లాలోనూ ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే సరిపడా బార్దాన్​ లేక వడ్లు తీసుకువచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో టోకెన్లు ఇవ్వడం లేదు. అందుబాటులో ఉన్న బార్దాన్​ను దృష్టిలో పెట్టుకుని రోజుకు కొంతమందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగతావారికి ఎదురుచూపులు తప్పడం లేదు.  ఇకనైనా రాష్ట్రంలో గన్నీ ఇండస్ట్రీని ప్రారంభించి బార్దాన్​ సమస్య రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. 

బార్దాన్​ లేక టోకెన్లు ఇస్తలేరు
వారం కింద వరి కోతలు కంప్లీట్​అయ్యాయి. ఆఫీసర్లు చెప్పిన ప్రకారం వడ్లను ఆరబెట్టినం. కానీ బార్దాన్​ కొరత వల్ల రోజుకు పది మందికి మాత్రమే టోకెన్​ఇస్తున్నారు. సంచులు అందుబాటులో లేక వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్దనే ఎదురుచూడాల్సి వస్తోంది. సంచుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  
– పిట్టల రాజేంద్ర, కొత్తకొండ, భీమదేవరపల్లి మండలం