Summer Alert : వడదెబ్బ ఇంట్లో ఉన్నా వస్తుందా.. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..!

Summer Alert : వడదెబ్బ ఇంట్లో ఉన్నా వస్తుందా.. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..!

ఎండకు బయటకు పోవాలంటే అందరూ భయపడ్తారు. జర ఎండలు మరు కాగానే ఒక్కపూట బళ్లు మొదలైతయ్. తర్వాత రెండు నెలలు బళ్లు మొత్తం మూసేస్తరు. ఇక్కడే అర్థమైతుంది ఎండా కాలం తీవ్రత ఏంటో! ఆటలు ఆడుకోవడానికి.. ఎంజాయ్ చెయ్యడానికి ఎండాకాలం మంచి టైం అని చాలామంది అనుకుంటరు. అది నిజమే కానీ.. ఈ ఎండాకాలం ఆరోగ్యాన్ని కూడా రిస్క్ ల పెడ్తాది. గవన్ని మనసుల పెట్టుకుని జర పైలంగా ఉంటే.. ఈ కాలం మంచిదే! ఎండాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది వడదెబ్బ.. మరి అది ఎట్ల వస్తది? ఎందుకొస్తది? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
 

వడదెబ్బ (హీట్ స్ట్రోక్) అంటే?

104 నుంచి 105 డిగ్రీల జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి జారిపోవడాన్ని హేట్ స్టోక్ అంటాం. ఇది వడదెబ్బ చివరి దశ, హైఫీవర్తో పాటు మనిషి స్పృహ తప్పిపోతాడు.

ఎండసెగ ఎవరెవరికి వస్తది?

బయట ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందనేం లేదు. ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా తగులుతది. ఎండలో ఎక్కువగా కష్టపడేవాళ్లకు వచ్చే వడదెబ్బని 'ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ ' అంటరు. భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు, రైతు కూలీలకు, ఎండలో విధులు నిర్వహించే ఆర్మీ, పోలీసులు ఈ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ బారిన పడ్డారు. ఎండలో కష్టపడకున్నా.. ఇంట్లో ఉన్నా వచ్చేదాన్ని 'క్లాసిక్ హీట్ స్ట్రోక్ ' అంటారు. బయటి ఎండకు చుట్టూ వ్యాపించి ఉన్న వేడి సోకడం వల్ల ఇది వస్తుంది. ఇది ఎక్కువగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వాళ్లకు వస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు, గుండె సంబంధించిన వ్యాధులున్న వాళ్లకు, కొన్ని మందులు వాడుతున్న వాళ్లకు కూడా ఈ క్లాసిక్ హీట్ స్ట్రోక్ " వస్తుంది. వాళ్లు వాడే మందుల్లో చెమటని తగ్గించే గుణం ఉంటుంది. అలాంటి వాళ్లు జాగ్రత్తలు తీసుకోకుంటే క్లాసిక్ హీట్ స్ట్రోక్ రావడం ఖాయం.

ఎలా గుర్తించాలి?

లక్షణాలను పరిశీలిస్తే వడదెబ్బ తగిలిందనే విషయం సులభంగా గుర్తించవచ్చు. వెంటనే తగిన చర్యలు తీసుకుంటే వడదెబ్బ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
• తలనొప్పి రావడం,
• నీరసంగా అనిపించడం.
• కాళ్లల్లో తిమ్మిర్లు రావడం.
• పని ఏకాగ్రత తగ్గి గందరగోళపడటం
• చెమటలు పట్టకపోవడం... నాడి వేగంగా కొట్టుకోవడం..
వంటి లక్షణాలు ఉంటే తొలిదశ వడదెబ్బగా గుర్తించాలి.

అప్పుడేంచెయ్యాలి?

లక్షణాలు కనిపించిన వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశంలోకి మార్చాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న గదిలో పడుకోబెట్టాలి. కొన్ని ద్రవపదార్థాలు ఇస్తే.. కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు అన్ని తగ్గిపోతాయి. అయితే ఇది తొలిదశలోనే పని చేస్తుంది. 

హైపర్ హీట్ స్ట్రోక్ అంటే?

పైన చెప్పిన లక్షణాలతో పాటు 104 నుంచి 105 జ్వరం ఉంటే హైపర్ హీట్ స్ట్రోక్ అంటారు. ఈ సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతరు. వడదెబ్బలో ఇది చివరి దశ. ఈ టైంలో వాళ్లని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఆస్పత్రి దూరంగా ఉంటే వాళ్లని కూల్ వాటర్లో ఉంచాలి. లేదా ఐస్ వేసిన వాటర్ డ్రమ్ లో తల ఒక్కటి పైకి ఉంచి... మిగతా శరీరమంతా దానిలోపల మునిగేలా చూడాలి. లేదా మెడపై.. గజ్జులో... ఐస్ ప్యాక్ పెట్టి ఫ్యాన్ కింద పడుకోబెట్టాలి. ఆ సమయంలో టెంపరేచర్ 101 వరకు తగ్గించిన పర్వాలేదు. సాధారణ శరీర ఉష్ణోగ్రతకు రాకున్నా ఏం కాదు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డట్టే. 

హైపర్ హీట్ స్ట్రోక్ని నిర్లక్ష్యం చేస్తే?

హైపర్ హీట్ స్టోరీని నిర్లక్ష్యం చేస్తే.. శరీరంలో రక్తం గడ్డ కట్టే వ్యవస్థతో పాటు లీవర్, కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అది ప్రాణాల మీదకు తెస్తది. కాబట్టి తొలి దశలోనే వడదెబ్బను గుర్తించి.. చల్లని ప్రదేశాలకు తరలించి.. ద్రవపదార్థాలు తాగించాలి.