విశ్లేషణ : తెలంగాణ అభివృద్ధికి ప్లాన్స్​ ఏవి?

విశ్లేషణ : తెలంగాణ అభివృద్ధికి ప్లాన్స్​ ఏవి?

తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు కేంద్రంగా ఉండటం, అద్భుతమైన వాతావరణ పరిస్థితులు, విశాలమైన భూములు, నీటి లభ్యత, విస్తృత నైపుణ్యాలు గల విద్యావంతులు ఇలా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఇక తెలంగాణ జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు వలస వస్తున్నారు.  హైదరాబాద్‌‌‌‌ ప్రపంచ స్థాయి మెగా సిటీ కాగలదు. ఇక్కడ భారీ పెట్టుబడుల కోసం చేయిచాచాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తి చాలా ఎక్కువ. పెద్ద సినీ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. ఐటీ, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. కేంద్రం లేదా మరే ప్రభుత్వ సహాయం లేకుండానే ఇవన్నీ ప్రగతి సాధిస్తున్నాయి. 

కొత్త ఎకో సిస్టం రావాలె
ప్రధాన సమస్య ఏమిటంటే ప్రభుత్వాలు అవసరమైన దానికంటే చాలా నిదానంగా పని  చేస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప బ్యూరోక్రాట్లు ఉండేవారు. ఇప్పుడు కూడా కొందరున్నప్పటికీ, క్రమంగా వీరి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరోవైపు కొందరు బ్యూరోక్రాట్లు రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా అవకాశాలను తెలంగాణ, హైదరాబాద్​ కోల్పోయాయి. ప్రభుత్వాలు, నిపుణులు భారీ పెట్టుబడులు అవసరమని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఉన్న గొప్ప అవకాశాలను, అనుకూలతలను వారు విస్మరిస్తున్నారు. నా దృష్టిలో తెలంగాణ ప్రభుత్వం చిన్న స్థాయి పెట్టుబడులపై దృష్టి సారించాలి. హైదరాబాద్​ గొప్ప ఎకనమిక్​ సెంటర్​ అయ్యేందుకు కొత్త ఎకో సిస్టంను అభివృద్ధి చేయాలి.

బేగంపేట ఎయిర్​పోర్ట్​ను రీ ఓపెన్​ చేయాలె
హైదరాబాద్‌‌‌‌ బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ 1930లో ఓపెన్‌‌‌‌ అయ్యింది. దురదృష్టవశాత్తు 2008లో దానిని మూసేసారు. అప్పటికి ప్రతిరోజు 700 ఫ్లైట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు బేగంపేట నుంచి నడుస్తున్నాయి. ఇతర నగరాల నుంచి గంటలోపు హైదరాబాద్​ చేరుకునే లేదా కనీసం పక్క రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే దేశీయ విమానాల కోసం బేగంపేట ఎయిర్ పోర్ట్​ను వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలి. బేగంపేట ఎయిర్​పోర్ట్​ తెరుచుకుంటే.. తెలంగాణలోని ఇతర ఎయిర్​పోర్ట్​లు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడే ట్రావెల్, టూరిజం, కమర్షియల్​ బూమ్​ వస్తుంది. ప్రస్తుతం చెన్నై నుంచి హైదరాబాద్‌‌‌‌కు వచ్చే వారు గమ్యస్థానానికి చేరడానికి 3 గంటల సమయం పడితే, తిరిగి వెళ్లే ఫ్లైట్‌‌‌‌ను వారు అందుకోవడానికి మరో 3 గంటల టైం పడుతోంది. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తే, సిటీ మధ్యలో ఉన్నందున ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. తక్కువ దూరం వెళ్లే ఫ్లైట్‌‌‌‌ల కోసం బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ని తెరిచేందుకు శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపకూడదు? బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ తెరుచుకుంటే, హైదరాబాద్‌‌‌‌ కన్వెన్షన్‌‌‌‌ సిటీ ఆఫ్ ఇండియాగా మారుతుంది. హోటల్స్‌‌‌‌, కన్వెన్షన్ హాల్స్‌‌‌‌, మ్యారేజ్‌‌‌‌ హాల్స్‌‌‌‌లో ఉపాధి పెరుగుతుంది. అలాగే పన్నుల రూపంలో ఆదాయం పెరిగి ఎకనమిక్​ బూమ్​ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌ చేరుకోవడం చాలా క్లిష్టంగా మారింది. ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌కతా వంటి నగరాలకు సిటీ మధ్యలో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ లేదు. హైదరాబాద్‌‌‌‌కు మాత్రమే అలాంటి అరుదైన అవకాశం ఉంది. దానిని మనం ఉపయోగించుకోవాలి.

రవాణా రంగంలో బూమ్​ వస్తది
హైదరాబాద్‌‌‌‌కు మరిన్ని ఫ్లైట్‌‌‌‌లు వస్తే, స్థానిక ట్యాక్సీలు, బస్సులు, ఆటోలు, చిన్న చిన్న హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లకు కూడా ఎక్కువ లాభం కలుగుతుంది. సర్వీస్​ సెక్టార్లోని ఈ రంగాలలో తక్షణమే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 

హైదరాబాద్–కర్నూల్​ మధ్య కనెక్టివిటీ పెంచాలె
మంచి రహదారులు, వేగవంతమైన రైళ్ల ద్వారా హైదరాబాద్‌‌‌‌, కర్నూల్​ను అనుసంధానించాలి. కర్నూల్‌‌‌‌ రాయలసీమకు గేట్‌‌‌‌వే లాంటిది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అక్కడికే వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉన్నప్పటికీ మెజారిటీ లాయర్లు హైదరాబాద్‌‌‌‌ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కర్నూల్‌‌‌‌ కు వేగంగా చేరుకునే సదుపాయం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే, హైదరాబాద్‌‌‌‌–కర్నూల్‌‌‌‌ పరిసర ప్రాంతాలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. హైదరాబాద్‌‌‌‌లో పనిచేసే వేలాది మంది లాయర్లు, వారి సిబ్బంది హైదరాబాద్‌‌‌‌ నుంచి కర్నూల్‌‌‌‌కు ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇందుకోసం హై స్పీడ్‌‌‌‌ రైళ్లు, హైదరాబాద్‌‌‌‌ నుంచి సులువుగా వెళ్లే సదుపాయాలు, మెరుగైన రహదారులను నిర్మించాలి. తెలంగాణ ఆ పని చేయలేదా?

హైదరాబాద్‌‌‌‌లో మెడికల్‌‌‌‌ జోన్‌‌‌‌
పూర్తిగా మెడికల్​ సెక్టార్​ కోసం హెల్త్​ జోన్​ను ఏర్పాటు చేయాలి. దానికి అవసరమైన భూమిని కేటాయించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. అప్పుడే కొత్త మెడికల్​ కాలేజీలు, హాస్పిటల్స్, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ మౌలిక సదుపాయాలు వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్​ అంతటా ఆస్పత్రులు ఉన్నాయి. అందువల్ల  ఇండియాకే కాకుండా ప్రపంచ దేశాలకు హైదరాబాద్‌‌‌‌ హెల్త్‌‌‌‌ టూరిజం సెంటర్‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. తెలంగాణ కనీసం 20 కొత్త మెడికల్‌‌‌‌ కాలేజీలను ప్రారంభించాలి. భూమిని కేటాయించి, మెడికల్‌‌‌‌ సిటీని అభివృద్ధి చేసే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి లేదా?

మెరుగైన సిటీ ప్లాన్
ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్​ను ఎక్కువగా ఉపయోగించడం ద్వారా సిటీలోని ఇతర రహదారులపై రద్దీని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. కొన్ని సెంటర్లలో రద్దీని తగ్గించడానికి కొత్త మార్కెట్లను ఏర్పాటు చేయాలి. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లకు, రైల్వే స్టేషన్లకు అదేవిధంగా సిటీ నుంచి బయటకి వెళ్లేందుకు ఉత్తమ మార్గాలను అన్వేషించాలి. ఇక సౌదీ అరేబియా ఎగుమతి చేసే ఆయిల్​ కంటే, ఇండియా ఎక్కువ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు చేస్తోంది. హైదరాబాద్‌‌‌‌కు రాష్ట్రం బయట ఉండే ఐటీ కంపెనీల అవసరం ఎక్కువగా ఉంది.

వ్యవసాయం
స్వాతంత్ర్యానికి పూర్వం కరువు కాటకాల వలన ఇండియాలో బియ్యానికి కొరత ఉండేది. ఇప్పుడు మనదేశం కోట్ల టన్నుల మిగులు బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 100 సంవత్సరాలకు పూర్వం కరువులు ఉండేవి కాబట్టి గోదావరి డెల్టాలో బియ్యాన్ని ఉత్పత్తి చేసి విజయవంతం అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం వరి ఉత్పత్తి నుంచి పక్కకు తప్పుకోవాలి. అమెరికా, యూరప్‌‌‌‌ దేశాల్లో మాదిరిగా రైతులు వరిని పండించకుండా ఉండేందుకు వారికి కొంత మొత్తం చెల్లించాలి. కాఫీ, నట్స్‌‌‌‌, పండ్లు, పువ్వులు, తేనె, అధిక నాణ్యత గల పప్పులతో పాటు కలపను ఉత్పత్తి చేసేలా రైతులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలి. అప్పుడే చేసిన తప్పును సరిదిద్దుకోవచ్చు.

సులువైన పద్ధతులు
ఇవన్నీ చాలా సులువైన, తేలికైన పనులే. కొంచెం తెలివి, కొంచెం పెట్టుబడి ఉంటే అసాధ్యమేమీ కాదు. బేగంపేట ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ తెరిచేందుకు, కర్నూల్‌‌‌‌తో హైవే కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించాలి. ఢిల్లీ దగ్గర్లో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లు కట్టేందుకు ఉత్తరప్రదేశ్ కూడా ఇదే చేసింది. హైదరాబాద్‌‌‌‌ చుట్టూ హాస్పిటల్‌‌‌‌/మెడికల్‌‌‌‌ జోన్‌‌‌‌ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇండియాలో మరెక్కడా ఇలాంటిది లేదు. ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే.. ప్రభుత్వాలను నడుపుతున్న రాజకీయ నాయకులు ఎవరి నుంచీ సలహాలు తీసుకోవడం లేదు. అందువల్లే ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికీ స్టీల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ కావాలి. కానీ రూ.20,000  కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కాని 30,000 ఉద్యోగాలు రావు. 

కొత్త ఆలోచనలను అంగీకరించాలె
ఎవరికీ ఉచిత సలహాలు అవసరం లేదు. ఉచిత సలహాలన్నీ నిరుపయోగమని చాలా మంది అభిప్రాయం. వాళ్లు కరెక్టే కావచ్చు. కానీ ఈ ఒక్క ఆర్టికల్‌‌‌‌ మొత్తం ప్రణాళికను సూచించదు. కానీ వారు తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాలను పొందవచ్చు. ప్రతి ప్రభుత్వం ఉచిత పథకాలు అందించొచ్చు. కానీ కొందరు నాయకులు మాత్రమే సృజనాత్మకంగా ఆలోచిస్తారు. పీవీ నరసింహారావు, మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌ మన ఆర్థిక వ్యవస్థకు ఎంత మేలు చేశారో మనం గుర్తు చేసుకోవాలి. కొత్త ఆలోచనలకు, అభిప్రాయాలకు వెంటనే అంగీకారం దొరక్కపోవచ్చు. కానీ గొప్ప నాయకులు వీటన్నింటినీ దాటుకుని ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తారు.

- పెంటపాటి పుల్లా రావు, పొలిటికల్ ఎనలిస్ట్