విద్యా ప్రమాణాలు తగ్గడానికి..కారణాలేమిటి? పరిష్కారాలేమిటి?

విద్యా ప్రమాణాలు తగ్గడానికి..కారణాలేమిటి? పరిష్కారాలేమిటి?

తెలంగాణ రాష్ట్రంలో అభ్యాసనా సంక్షోభం తీవ్రతరమవుతున్నది.  కేంద్ర  విద్యా శాఖ విడుదల చేసిన  పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 36 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలలో  తెలంగాణ ర్యాంక్ 31కి పడిపోయింది.

విద్యా ప్రమాణాల  విషయంలో  2017–-18లో 12వ ర్యాంకు ఉంటే అది 2021-– 22లో 35కు పడిపోయింది. 2014లో  5వ తరగతి విద్యార్థులలో 45.5% మంది విద్యార్థులు రెండవ తరగతి పుస్తకాన్ని చదివే సామర్థ్యాన్ని కలిగి ఉండగా,   2022లో  32శాతం  మంది విద్యార్థులు మాత్రమే  రెండవ  తరగతి పుస్తకాన్ని చదవగలుగుతున్నారు.  దీనిని బట్టి విద్యా ప్రమాణాలు మన రాష్ట్రంలో ఎంత దిగజారిపోతున్నాయి అనేది స్పష్టం అవుతుంది.

అయితే, ఈ సంక్షోభానికి కారణాలేమిటో  తెలుసుకొని యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది.  పాఠశాల విద్యలో దిగజారుతున్న ఈ ప్రమాణాలకు  ముఖ్యంగా ఐదు కారణాలు చెప్పుకోవచ్చు. 1. తగ్గిపోతున్న విద్యా బడ్జెట్, 2.ఉపాధ్యాయుల కొరత,  3. వసతులు లేకపోవడం, 4. మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలిపోవడం, 5. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై రెగ్యులేషన్ లేకపోవడం. 

తగ్గిపోతున్న విద్యా బడ్జెట్

2014వ  సంవత్సరంలో  విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 11% వరకు కేటాయించారు. కానీ, 2023లో  విద్యా బడ్జెట్ 7.3 శాతానికి తగ్గించారు.  నిజానికి దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం విద్యకు తక్కువగా బడ్జెట్​ కేటాయిస్తున్నది.  విద్యా రంగానికి  దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల విద్యా బడ్జెట్ సగటున 15% వరకు ఉన్నది.  కనుక కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా విద్యకు 15% కేటాయించడం ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది.  రాష్ట్రంలోని 40,656 పాఠశాలలుంటే  అందులో 30 వేలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.  

ఇందులో  సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలలు,  గురుకుల పాఠ శాలలను తీసివేస్తే సుమారు 26 వేల  పాఠశాలలు లోకల్ బాడీస్  కింద ఉన్నాయి.  ప్రైవేటు పాఠశాలలలో  ఒక్కొక్క  పాఠశాలకు సగటున 14 మంది టీచర్లు ఉంటే,  ప్రభుత్వ పాఠశాలలో సగటున  ప్రతి పాఠశాలకు నలుగురు మాత్రమే ఉన్నారు.  ఇంకా  ప్రాథమిక పాఠశాలలను తీసుకుంటే  ప్రతి పాఠశాలకు  ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టీచర్లు ఉన్నారు.  ఒక్కటే గది ఉన్న పాఠశాలలు 3,620 ఉన్నాయి.  ఒక్కరే  టీచర్ ఉన్న పాఠశాలలు 7,915 ఉన్నాయి.  

ఇటువంటి పరిస్థితులలో ఐదు తరగతులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఒక ప్రణాళిక ప్రకారం చదువు ఎలా చెబుతారు? అలాగే ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్, సైన్సు, సోషల్ స్టడీస్ లాంటి సబ్జెక్టులకు టీచర్లు లేనప్పుడు విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? 

ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం

ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలలో నాణ్యమైన విద్య దొరుకుతుందని ఆశతో ఉన్న తల్లిదండ్రుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు దోపిడీ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కనీస అర్హతలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. అక్కడ విద్యార్థులను ఎంత హింసిస్తున్నారు అనేది ఆత్మహత్యలు జరిగితే తప్ప తెలిసే అవకాశం లేకుండాపోయింది. ఇటువంటి అన్ని విషయాల మీద ఒక్క రెగ్యులేటరీ బాడీని వేయాలని ఎప్పటినుంచో  విద్యా రంగంలో పనిచేస్తున్న సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కనుక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల రెగ్యులేటరీ కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.  ఈ కారణాల వలన  విద్యా ప్రమాణాలు అడుగంటాయి.  విద్యా ప్రమాణాలు తగ్గడానికి, విద్యార్థుల సంఖ్య తగ్గడానికి, జీరో విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉనికిలోకి రావడానికి, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు సంబంధం ఉన్నది. అసలు విద్యార్థులే లేని పాఠశాలలు 1,347 ఉన్నాయి. 20 మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న పాఠశాలలు 7,581 వరకు ఉన్నాయి.  ఇవన్నీ భవిష్యత్తులో  మూతపడే పాఠశాలలు.

అసలు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు ఎందుకు ఉండటం లేదు? విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతున్నది ? అనేవి మౌలిక ప్రశ్నలు. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి నిజాయితీపరులు, విద్యావేత్తలతో కమిటీ వేసి లోతైన అధ్యయనం జరపాలి. పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. అభ్యాసనా సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడాలంటే  తెలంగాణ విద్యారంగ సమస్యలపై రేవంత్ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించాలి.

కుప్పకూలిన మానిటరింగ్ వ్యవస్థ

ప్రభుత్వ పాఠశాలలలో.. ఉపాధ్యాయులు వస్తున్నారా లేదా, పాఠాలు  సరిగా చెబుతున్నారా  లేదా, విద్యార్థులు సరిగా వస్తున్నారా  లేదా అనే వాటి మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ ఇప్పుడు లేదు. రాష్ట్రంలోని 539 మండలాలకు 16 మందే మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. 33 జిల్లాలలో  29 జిల్లాలకు విద్యాశాఖ అధికారులు లేరు.  ఉపాధ్యాయులను తయారు చేసే డైట్ కాలేజీలలో 206 లెక్చరర్లు ఉండవలసిన చోట 17 మంది లెక్చరర్లు మాత్రమే ఉన్నారు.  

పాఠ్యాంశాలు తయారుచేసే  ఎస్​సిఈఆర్ టిలో 95 మంది లెక్చరర్స్ ఉండవలసిన చోట ఒక్కరే  ఉన్నారంటే  విద్యారంగం  ఎంత నిర్వీర్యమైపోయిందో అర్థమవుతున్నది.  పకడ్బందీగా మానిటరింగ్ వ్యవస్థను స్థాపించకుండా విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని ఎంత గగ్గోలు పెట్టినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

టీచర్ల సంఖ్య పెరగాలి

విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచరు ఉండాలి, ఉన్నత పాఠశాలలలో అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండడం అత్యవసరం. పాఠశాలలలో  మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటికీ కూడా 24 శాతం పాఠశాలలలో  మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉపయోగించే పరిస్థితుల్లో లేవు.  పరిశుభ్రమైన తాగునీరు లేని పాఠశాలలు ఇప్పటికీ 24%, కంప్యూటర్స్ లేని పాఠశాలలు 92 శాతం ఉన్నాయనేది  ప్రభుత్వ లెక్కలే తెలుపుతున్నాయి. స్కూల్ లను పరిశుభ్రంగా ఉంచడానికి స్కావెంజర్ లు లేరు.

ఇప్పటికీ ప్రహరీ గోడలు లేని పాఠశాలలు ఉన్నాయంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎంత ఉన్నదో అర్థమవుతుంది. అదే కాకుండా పాఠశాలల భూములను దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలలో మూతబడితే కోట్ల రూపాయల పాఠశాల భూములను కబ్జాదారులు ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. బడిబాట పేరుమీద తల్లిదండ్రులను తమ పిల్లలని  స్పూళ్లలో చేర్పించండి అని చెపుతున్న ప్రభుత్వం.. నిధులు మాత్రం కేటాయించడం లేదు. కనుక పాఠశాలలకు అవసరమైన అన్ని సౌకర్యాలకు కావలసినంత డబ్బు కేటాయించి, అందజేసి, యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలను కల్పించడం ఒక్కటే మార్గం.

- ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, హైదరాబాద్ సెంట్రల్  యూనివర్సిటీ