ఏడేండ్లలో బీసీలకు ఒరిగిందేమిటి?

ఏడేండ్లలో బీసీలకు ఒరిగిందేమిటి?

‘‘ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ ప్లాన్‌‌ మాదిరిగానే బీసీ సబ్‌‌ ప్లాన్‌‌ను చట్ట పద్ధతిలో వంద శాతం తెస్తం. మన రాష్ట్రమే వీకర్‌‌ సెక్షన్‌‌ రాష్ట్రం. ఎవరికీ శషభిషలు ఉండాల్సిన అవసరం లేదు. అపోహలు అక్కర్లేదు. తర్వాతి ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో బీసీ సబ్‌‌ ప్లాన్‌‌ తెస్తం. చట్టం కూడా ఇదే సభలో పాస్‌‌ చేస్తం” - 2017లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌‌ చెప్పిన మాటలివి. అయితే నాలుగేండ్లు గడిచినా ఈ హామీ అమలు కాలేదు. సబ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌ కింద నిధులు వస్తే బాగుపడతామని బీసీలు ఆశిస్తే.. ఉన్న ఫండ్స్‌‌‌‌‌‌‌‌నే ఏటా బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. నాలుగేండ్లవుతున్నా బీసీ సబ్‌‌ప్లాన్ కోసం అడుగు ముందుకు పడలేదు. ప్రతి బడ్జెట్‌‌కు ప్రకటిస్తారని బీసీలు ఎదురు చూస్తున్నా నిరాశే మిగులుతోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వాళ్ల కోసం సబ్​ప్లాన్​ తీసుకొస్తామని ఇచ్చిన హామీని టీఆర్ఎస్​ ప్రభుత్వం గాలికొదిలేసింది. పైగా ఎస్సీల‌‌కు స‌‌బ్ ప్లాన్ నిధులు కూడా విడుదల చేయడం ఆపేసింది. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తే ఏటా బీసీ సంక్షేమ శాఖకు ఇప్పుడు బడ్జెట్​లో కేటాయించే దానికంటే అదనంగా మరో రూ.10 వేల కోట్లు సమకూరుతాయి. దీని ద్వారా బీసీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ, ప్రభుత్వం సబ్​ప్లాన్​ పేరిట నాలుగేండ్ల కింద సమావేశాలు పెట్టి అటకెక్కించింది. నిధులు లేకపోవడంతో బీసీ సంక్షేమ శాఖ ఉత్తగనే ఉంటోంది. బీసీలకు సంబంధించిన పథకాలు సక్కగ అమలు కావడం లేదు. 

మీటింగ్​ పెట్టిన్రు.. మరిచిపోయిన్రు
బీసీల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తేవడానికి 2017 డిసెంబర్​లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం బీసీల సమస్యలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆఖరికి 210 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎడ్యుకేషన్, హెల్త్, రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ ప్లాన్‌‌ మాదిరిగా బీసీ సబ్‌‌ప్లాన్‌‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదే అంశంపై అసెంబ్లీలో కూడా సీఎం ప్రకటన చేశారు. శాసనమండలిలోనూ తీర్మానం చేశారు. నాలుగేండ్లవుతున్నా బీసీ సబ్‌‌ప్లాన్ కోసం అడుగు ముందుకు పడలేదు. మిగతా తీర్మానాల సంగతి కూడా మరిచిపోయారు.

ఉపాధి లోన్లు ఎప్పుడిస్తరు
తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండుసార్లు మాత్రమే స్వయం ఉపాధి లోన్లు ఇచ్చారు. 2015లో ఒకసారి, 2018లో మరోసారి ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో 5.7 లక్షల మంది అప్లై చేశారు. ఎలక్షన్‌‌‌‌  ఇయర్‌‌‌‌  కావడంతో 50 వేల మందికి లోన్లు ఇచ్చారు. 5.2 లక్షల అప్లికేషన్లు పెండింగ్​లో పెట్టారు. లోన్ ఎప్పుడిస్తారని దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు లోన్ల కోసం యాక్షన్‌‌‌‌ ప్లాన్లు రూపొందిస్తున్నా సర్కారు మాత్రం అప్రూవ్ చేయడం లేదు. రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకి/బోయ, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమారి శాలివాహన, గీత పనివారలు, సగర(ఉప్పర) ఫెడరేషన్లు ఉన్నాయి. సాధారణంగా ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు అందజేయడం, కులవృత్తులపై శిక్షణ ఇవ్వడం, సబ్సిడీ కింద వివిధ మెషీన్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి. అయితే ఈ ఫెడరేషన్లకు మూడేండ్ల నుంచి బడ్జెట్‌‌‌‌లో రూపాయి కూడా కేటాయించడంలేదు. దీంతో ఫెడరేషన్లు ఖాళీగా ఉంటున్నాయి.

కార్పొరేషన్లకు పైసలు ఇస్తలేరు
ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్‌‌‌‌  ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ కొత్తగా ఒక్క ఫెడరేషన్​ కూడా ఏర్పాటు చేయలేదు. తెలంగాణ వచ్చేనాటికి బీసీలకు బీసీ కార్పొరేషన్‌‌‌‌ ఒక్కటే ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2016లో ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 సంచార జాతుల కులాలను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చారు. కానీ జిల్లాల వారీగా సంచార జాతుల జనాభాను గుర్తించి, వారి అభివృద్ధి కోసం చేయాల్సిన పనులపై ప్లాన్లు రూపొందించలేదు. మొదటి మూడేండ్లలో రూ.2,433 కోట్లు బడ్జెట్‌‌‌‌లో పెట్టారు. అందులో రూ.350 కోట్లే మంజూరయ్యాయి. వాటిలోనూ రూ.89.79 కోట్లే కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారు. తర్వాత నుంచి బడ్జెట్‌‌‌‌లో నిధులు కేటాయించడం లేదు. ఇటీవల బడ్జెట్‌‌‌‌లో రూ.500 కోట్లు పెట్టినా ఒక్కపైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్‌‌‌‌కు చైర్మన్‌‌‌‌ కూడా లేరు. 

ఎలక్షన్స్​ వస్తేనే గొర్రెల పంపిణీ
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండేండ్లుగా నిలిచిపోయింది. 7.29 లక్షల గొల్లకురుమ కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాలని నిర్ణయించినా.. మొదటి విడత పంపిణీనే పూర్తి కాలేదు. గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున డీడీలు తీశారు. అనేక మంది బంగారం కుదువపెట్టి, ప్రైవేటు వడ్డీలు తీసుకుని డీడీలు కట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎక్కడైనా ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితేనే గొర్రెల పంపిణీ చేపడుతున్నారు. చేప పిల్లల పంపిణీ చేపట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నా ఏటా టార్గెట్‌‌‌‌ను మాత్రం అందుకోవడం లేదు. రజకుల కోసం దోభీఘాట్లను ఏర్పాటు చేస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హామీ ఇచ్చింది. 2018 ఆగస్టులో ప్రగతి భవన్‌‌‌‌లో రజక సంఘం నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లు, హాస్టళ్లు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను అప్పగిస్తామన్నారు. దోభీఘాట్లను నిర్మిస్తామని, డ్రైయింగ్ మెషీన్లను అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏవీ అమలు కాలేదు.

బీసీలు ప్రశ్నించడం నేర్చుకోవాలె
తెలంగాణ వస్తే అన్ని వర్గాలు బాగుపడతాయని ఆశించాం. బీసీలకు న్యాయం జరుగుతుందని భావించాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మరింత వెనుకబాటుకు, అణిచివేతకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్‌‌ఎస్‌‌కు బీసీలు గుర్తుకొస్తారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌‌ వస్తోంది కాబట్టి మళ్లీ బీసీలు గుర్తొస్తున్నారు. ఇప్పటికైనా బీసీలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. హామీలు ఇవ్వడం, వాటిని మరిచిపోవడం అలవాటుగా మారిన టీఆర్ఎస్​ సర్కారును నిలదీసేందుకు బీసీలంతా ఏకం కావాలి.

ఎన్నికల హామీలను అమలు చేస్తలేరు
హెయిర్ సెలూన్లలో కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం నాయీ బ్రాహ్మణులకు సబ్సిడీ ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్ ఎన్నికల్లో మోడ్రన్​ హెయిర్‌‌‌‌ సెలూన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికలు రెండోసారి జరిగినా ఆ హామీ అమలు కాలేదు. దేవాలయాల్లోని కల్యాణకట్టలో పనిచేసే  క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చినా ముందుకు క‌‌దిలింది లేదు. చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై నూలు, రైతుల మాదిరి 5 లక్షల బీమా, హెల్త్‌‌‌‌కార్డులు ఇస్తామని చెప్పినా ఏవీ అమలు కావడంలేదు. తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉండగా, ఇప్పుడు 220కి తగ్గాయి. ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వ్యవస్థను తయారు చేస్తామని, హ్యాండ్లూమ్‌‌‌‌ కార్పొరేషన్, పవర్‌‌‌‌లూం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా పత్తాలేవు. వరంగల్‌‌‌‌ కాకతీయ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌  పార్క్‌‌‌‌ నిర్మాణంలోనే ఉంది. 9 నెలలు కావస్తున్నా చేనేత పొదుపు పథకాన్ని పునరుద్ధరించడం లేదు.

ఆత్మగౌరవ భవనాల అడ్రస్ లేదు
హైదరాబాద్‌‌లో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. 73 ఎకరాల భూమి, రూ.53 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ మూడేండ్లు దాటినా ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. కొన్నింటికి ఇప్పటి వరకూ పునాదులే తీయలేదు. అగ్రకులాల‌‌కి జుబ్లీహిల్స్‌‌, హైటెక్‌‌సిటీల్లో స్థలాలు ఇచ్చి.. వెనుకబడిన వ‌‌ర్గాల‌‌కు మాత్రం కొండ‌‌లు, గుట్టల్లో స్థలాలు ఇవ్వడం దేనికి సంకేత‌‌మో మ‌‌నం అర్థం చేసుకోవ‌‌చ్చు. పాత సెక్రటేరియట్​ను కూల్చి.. కొత్త సెక్రటేరియట్ కోసం చకచకా పనులు సాగిస్తున్నారు. కానీ.. బీసీల ఆత్మ గౌవర భవనాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. 

- మ‌‌న్నారం నాగ‌‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌‌స‌‌త్తా పార్టీ