డాలర్​ విలువ పెరిగితే ఏం జరుగుతుంది?

డాలర్​ విలువ పెరిగితే ఏం జరుగుతుంది?

‘‘డాలర్ రేటు పెరిగింది.. రూపాయి విలువ పడిపోయింది” అని చాలాసార్లు వింటుంటాం. కానీ.. దానికి కారణం ఏంటి? డాలర్​ విలువ పెరిగితే ఏం జరుగుతుంది?.. ఈ విలువ మీద కొన్ని దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీని ఎఫెక్ట్‌ లక్షల కోట్లు వెనకేసుకున్న బిజినెస్​మెన్‌ నుంచి కటిక పేదరికంలో ఉన్న సగటు పౌరుడి మీద కూడా ఉంటుంది. అందుకే, అన్ని దేశాలు డాలర్లను రిజర్వ్‌ చేసుకుంటాయి. వాటితోనే ఆ దేశాలకు కావాల్సిన దిగుమతులు చేసుకుంటాయి. డాలర్లు ఉంటే ఢోకా లేదనుకుంటాయి. అందుకే ఏ దేశానికైనా డాలర్లే పెద్ద ఆస్తి.  

ప్రపంచంలోని అన్ని దేశాలకు సొంత కరెన్సీ ఉంటుంది.  తూర్పు తైమూర్, ఈక్వెడార్, ఎల్ సాల్వెడార్, మైక్రోనేషియా, పనామాలాంటి కొన్ని దేశాలు మాత్రం అమెరికన్​ డాలర్​నే అధికారిక కరెన్సీగా వాడుతున్నాయి. మనదేశంలో కరెన్సీ రూపాయి అని తెలిసిందే కదా. అలాగే బ్రిటన్ కరెన్సీని ‘పౌండ్’, కువైట్​ కరెన్సీని ‘దినార్​’, ఒమన్​ కరెన్సీని ‘రియల్​’.. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో కరెన్సీ చెలామణిలో ఉంటుంది. ఉదాహరణకు అమెరికా నుంచి ఎవరైనా ఇండియాకు వస్తే వాళ్ల డాలర్లను రూపాయల్లోకి మార్చుకొని ఇక్కడ ఖర్చు పెట్టాలి. అలాగే ఇండియన్స్​ అమెరికా వెళ్తే.. రూపాయలను డాలర్లలోకి మార్చుకొని ఖర్చు పెట్టాలి. కానీ.. అన్ని కరెన్సీల్లోకి అమెరికన్​ డాలర్​కి విపరీతమైన డిమాండ్​ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాలకు వాళ్ల కరెన్సీ ఎంత ఇంపార్టెంటో.. డాలర్ కూడా అంతే ఇంపార్టెంట్​. ఉదాహరణకు మన ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్ముకోవాలన్నా, మన ప్రజలకు అవసరమయ్యే వస్తువులను ఇతర దేశాల నుంచి కొనుక్కోవాలన్నా డాలర్​ అవసరం. 
రూపాయి–డాలర్​.. ఈ రెండింటి మధ్య అంత తేడా ఎందుకుంది? ప్రతిసారి రూపాయి మారకం విలువ ఎందుకు పడిపోతుంది? అంటే.. ఈ సమస్య మన ఒక్క దేశానిదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ డాలర్ డామినేషన్ ‌‌ వల్ల అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగే కరెన్సీ లావాదేవీల్లో అమెరికా డాలర్ ‌‌దే పైచేయి. అన్ని దేశాలు డాలర్​ రిజర్వ్​లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. అంతేకాదు.. ఇంటర్నేషనల్​ మార్కెట్​లో ఒక్కోసారి ఎక్కువ డాలర్లు ఏ దేశం దగ్గర ఉంటే ఆ దేశానిదే పైచేయి అవుతుంది. దేశాల మధ్య జరిగే లావాదేవీల్లో దాదాపు 85 శాతం డాలర్ల రూపంలోనే జరుగుతుంటాయి. 

ఎందుకంత డిమాండ్​

మామూలుగా డాలర్ ‌‌కి డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. దాదాపు అన్ని దేశాల కరెన్సీ మీద ఇలాంటి ఎఫెక్ట్ ‌‌ ఉంటుంది. అంటే.. ఇంటర్నేషనల్​ మార్కెట్​లో డాలర్లకు డిమాండ్​ పెరిగిందనుకోండి. అప్పుడు మనదేశం ఎక్కువ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుక్కుంటుంది. తగ్గితే తక్కువ రూపాయలు ఇస్తుందన్నమాట.

ఎగుమతులు పెరిగినప్పుడు ఆదాయం డాలర్లలో వస్తుంది. ఆ డాలర్లు మన దేశ కంపెనీల యజమానులు రూపాయల్లోకి మార్చుకుంటారు. అప్పుడు మన దగ్గర డాలర్ల నిల్వలు పెరుగుతాయి. రూపాయికి డిమాండ్​ పెరుగుతుంది. ఒకవేళ మన దేశ కంపెనీలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే.. అందుకు డాలర్లు చెల్లించాలి. కాబట్టి డాలర్​కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ తగ్గుతుంది. విదేశీ కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్​ చేసినప్పుడు.. కంపెనీల మెయింటెనెన్స్ ‌‌, ప్రొడక్షన్​ కోసం.. వాళ్లకు రూపాయలు కావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ల దగ్గర ఉన్న డాలర్లను మనకు ఇచ్చి, మన కరెన్సీ తీసుకుంటారు. అలాంటప్పుడు కూడా రూపాయి విలువ పెరుగుతుంది. అంటే.. ఇప్పుడు మన కరెన్సీ విలువ బాగా పడిపోయిందంటే.. మన ఎగుమతుల కంటే దిగుమతులు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఇవే కాదు.. ఇంకా అనేక విషయాలు డాలర్ ‌‌ ‌‌ మీద ఎఫెక్ట్ ‌‌ చూపిస్తుంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్​ని యాక్సెప్ట్​ చేస్తాయి. మనం ఇతర దేశాల నుంచి డాలర్​తో వస్తువులను కొనుక్కోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్​ మార్కెట్​లో డాలర్లు తీసుకొని మన ప్రొడక్ట్స్​ని అమ్ముకోవచ్చు. ప్రపంచంలోని అనేక దేశాలు యూఎస్​ డాలర్లను రిజర్వ్​ చేసుకుంటున్నాయి. 

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? 

యూఎస్​ డాలర్లను అన్ని దేశాలు రిజర్వ్​ చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు ఇంటర్నేషనల్​ మార్కెట్​లో డాలర్​తో అమ్మకాలు, కొనుగోళ్లు ఎందుకు చేస్తారు? అనేది తెలుసుకోవాలంటే..  ముందుగా డాలర్​ చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే అది ఎందుకంత బలమైన కరెన్సీగా మారిందనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న డాలర్1914లో ప్రింట్ ‌‌ అయింది. అదే టైంలో యూఎస్ ‌‌ ఎకానమీ చాలా స్పీడ్​గా డెవలప్​ అయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ కింగ్ ‌‌డమ్​ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా మారింది. అయినా.. ప్రపంచంలో ఎక్కువ లావాదేవీలు బ్రిటిష్ పౌండ్లలో జరిగేవి. కరెన్సీతోపాటు అన్ని దేశాలు బంగారాన్ని రిజర్వ్​ చేసుకునేవి. ఈ గోల్డ్​ రిజర్వ్​ల ఆధారంగానే కరెన్సీని స్టెబిలైజ్ ‌‌ చేసుకునేవి. కానీ1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఈ పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చాయి. యుద్ధం టైంలో సైనిక ఖర్చులు పెరగడంతో కరెన్సీ ప్రింటింగ్​లో గోల్డ్​ రిజర్వ్​ల ప్రమాణాన్ని పక్కన పెట్టేశాయి. అవసరమైనంత డబ్బును ప్రింట్​ చేసుకున్నాయి. కానీ.. బ్రిటన్ మాత్రం కరెన్సీ వాల్యూ తగ్గుతుందనే ఉద్దేశంతో బంగారం రిజర్వ్​లను బట్టి కరెన్సీని జారీ చేసింది. కానీ.. యుద్ధం మొదలైన మూడో సంవత్సరం మొదటిసారిగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అనేక దేశాలకు యునైటెడ్ స్టేట్స్ అప్పు ఇచ్చింది. అయితే.. నష్టాలను పూడ్చుకునేందుకు బ్రిటన్ కూడా కొన్నేండ్లకు గోల్డ్ ‌‌ స్టాండర్డ్​ని పక్కన పెట్టింది. దాంతో పౌండ్​ విలువ బాగా తగ్గడం వల్ల చాలామంది ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. 

బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొన్నేండ్లలోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా బాగా బలపడింది. యుద్ధానికి ముందే అమెరికా తన మిత్రరాజ్యాలకు ఆయుధాలు అమ్మింది. అందుకుగాను చాలా దేశాల నుంచి కరెన్సీకి బదులు బంగారం తీసుకుంది. యుద్ధం ముగిసే టైంకి ప్రపంచంలోని మెజారిటీ బంగారం అమెరికా దగ్గరే ఉంది. ఆ తర్వాత చాలా దేశాలు గోల్డ్​ స్టాండర్డ్​కి రావడం కష్టమైంది. అప్పుడు అన్ని దేశాలు ఒక తాటిపైకి వచ్చాయి.1944లో 44 అమెరికా మిత్ర దేశాల ప్రతినిధులు న్యూ హాంప్ ‌‌షైర్ ‌‌లోని బ్రెట్టన్ వుడ్​లో మీటింగ్​ పెట్టుకున్నారు. అప్పటికే అమెరికా దగ్గర చాలా బంగారం ఉంది. గోల్డ్ ‌‌ స్టాండర్డ్​లో అది చాలా కరెన్సీని ప్రింట్ ‌‌ చేయగలదు. కాబట్టి.. అమెరికా కరెన్సీలోనే లావాదేవీలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి చాలా దేశాలు గోల్డ్​ స్టాండర్డ్​ని పక్కనపెట్టి డాలర్​ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందుకే అప్పటినుంచి చాలా దేశాలు డాలర్స్​నే నిల్వ చేసుకుంటున్నాయి. డాలర్ ‌‌తో పోలిస్తే వారి సొంత కరెన్సీల విలువలు బలహీనంగా, చాలా బలంగా మారిన పరిస్థితుల్లో ఆ దేశాలు కరెన్సీ సరఫరాలో మార్పులు చేస్తున్నాయి. 

ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా.. 

బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం తర్వాత యూఎస్​ డాలర్​కి అధికారికంగా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా పట్టాభిషేకం చేసినట్టు అయింది. అప్పటినుంచి బంగారం నిల్వలకు బదులుగా అనేక దేశాలు యూస్​ డాలర్లను రిజర్వ్​ చేసుకుంటున్నాయి. దేశాలే కాదు సెంట్రల్​ బ్యాంక్​లు కూడా డాలర్లను రిజర్వ్​ చేసుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రకారం సెంట్రల్ బ్యాంకుల రిజర్వ్ ‌‌ల్లో 59 శాతం యూఎస్​ డాలర్లే ఉన్నాయి. 

పెట్రోడాలర్​

క్రూడాయిల్​ ధరలు కూడా డాలర్​ విలువను ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే.. ప్రపంచానికి క్రూడాయిల్​ అమ్మే దేశాల్లో మెజారిటీ దేశాలు డాలర్స్​లోనే బిజినెస్ ‌‌ చేస్తుంటాయి. క్రూడాయిల్​ ఇచ్చినందుకు మిగతా దేశాలు డాలర్లు చెల్లించాలి. అంతెందుకు క్రూడాయిల్​ ధర కూడా డాలర్లలోనే డిసైడ్​ అవుతుంది. క్రూడాయిల్​ అమ్మే దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగానే ఉన్నా ఇంటర్నేషనల్​ మార్కెట్​లో డాలర్​కు ఉన్న ప్రయారిటీ వల్ల  డాలర్​నే మారకంగా వాడుతున్నాయి. సంపాదించుకున్న డాలర్లతో వాళ్లకు కావాల్సినవి దిగుమతి చేసుకుంటారు. అయితే.. ఇలా క్రూడాయిల్​ని డాలర్లలో అమ్మడం వల్ల కూడా డాలర్​ డిమాండ్​లో మార్పులు వస్తుంటాయి. క్రూడాయిల్​ ధర పెరిగితే అన్ని దేశాలు డాలర్స్​ రిజర్వులను పెంచుకుంటాయి. దాంతో డాలర్​కు డిమాండ్​ పెరుగుతుంది. డాలర్​ విలువలో మార్పులొచ్చినా క్రూడాయిల్​ ధరల్లో మార్పులు వస్తుంటాయి. ​ 

ఎందుకు జరుగుతోంది?     

ఈ మధ్య డాలర్​ విలువ రికార్డు స్థాయిలో పెరిగింది. దాని విలువను చాలా అంశాలు డిసైడ్​ చేస్తాయి. ప్రస్తుతం మనం ఒక డాలర్​ను కొనాలనుకుంటే బదులుగా 81.29 (అక్టోబర్​ 4నాటికి) రూపాయలు ఇవ్వాలి. దీన్నే ఎక్స్ఛేంజ్ రేట్ అంటారు. రూపాయి-–డాలర్ మాత్రమే కాదు.. అన్ని కరెన్సీల మధ్య ఇలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. అయితే.. ఈ ఎక్స్ఛేంజ్ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లేదా మనీ మార్కెట్​లో ఈ ధరలు డిసైడ్​ అవుతాయి. కరెన్సీ డిమాండ్, సరఫరాపై ఇది ఆధారపడి ఉంటుంది. కరెన్సీకి ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే, దాని విలువ అంత పెరుగుతుంది. దాదాపు అన్ని దేశాలు అమెరికన్ కరెన్సీని రిజర్వ్​ చేసుకోవడం వల్ల ‘డాలర్’కి ఎప్పుడూ డిమాండ్​ ఉంటుంది. ఈ మధ్య దాని డిమాండ్ చాలా పెరిగింది. ఎందుకంటే.. కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ఎకానమీ దెబ్బతిన్నది. దాంతో డాలర్​ విలువ పెరగడం మొదలైంది. అదేటైంలో రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం రావడం వల్ల చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చాలా దేశాలు రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్​ కొనడం ఆపేశాయి. మరి వాటి అవసరాలను ఎలా తీర్చుకోవడం కోసం ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి వంటనూనె ఉత్పత్తులు కొనడం మొదలుపెట్టాయి. దాంతో డిమాండ్​ పెరిగి, ధరలు పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ‌‌ యూరప్ ‌‌తోపాటు అమెరికాపై కూడా పడింది. ఇది మాత్రమే కాకుండా యుద్ధం వల్ల ఉక్రెయిన్​ వంటనూనెల ఎగుమతులు తగ్గించింది. ప్రపంచంలో ఎక్కువ సన్​ఫ్లవర్​ ఆయిల్ ఎగుమతి చేసే దేశం ఇదే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్​ ధరలు కూడా పెరిగాయి. వీటివల్ల అమెరికా, యూరప్ ‌‌లు కూడా ద్రవ్యోల్బణం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్​ నుంచి బయటపడేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. అప్పులు తీసుకున్నవాళ్లపై భారం పెరిగింది. వడ్డీ ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఇండియాలో పెట్టుబడి పెట్టినవాళ్లు వాటిని వెనక్కి తీసుకుని అమెరికాలో పెడుతున్నారు. అందుకోసం ఇండియన్​ రూపాయి అమెరికన్​ డాలర్లలోకి కన్వర్ట్​ చేస్తున్నారు. దాంతో మనీ మార్కెట్ ‌‌లో డాలర్​కి డిమాండ్​ పెరిగి, రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది.

ఎవరు కంట్రోల్ చేస్తారు? ​ 

మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ‌‌ ఇండియా (ఆర్ ‌‌బీఐ) ఉన్నట్టే అన్ని దేశాలకు కేంద్ర బ్యాంకులు ఉంటాయి. అవి వాటి దగ్గర ఇతర దేశాల కరెన్సీని నిల్వ చేసుకుంటున్నాయి. మార్కెట్ ‌‌లోని డిమాండ్-–సరఫరాల్లో తేడాలు వచ్చినప్పుడు కేంద్ర బ్యాంకులు జోక్యం చేసుకుంటాయి. ఒకవేళ మార్కెట్ ‌‌లో డాలర్​ రేటు బాగా పెరిగితే, ఆర్ ‌‌బీఐ డాలర్లను అమ్మడం, కొనడం ద్వారా రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. 

మన దగ్గర 

మన దగ్గర ఉన్న ఫారిన్​ రిజర్వులు కొన్ని రోజుల నుంచి పడిపోతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 16 నాటికి 545.6 బిలియన్లకు పడిపోయాయి. 2020 అక్టోబర్​ 2 తర్వాత ఇంతలా తగ్గింది ఇప్పుడే.  రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచే రూపాయి విలువ 8.9 శాతం తగ్గింది. అందుకే  ఈ టైంలోనే 86 బిలియన్ల యూఎస్ ‌‌ డాలర్లు తగ్గాయి. దాంతో జులైలో రూపాయి విలువ తగ్గకుండా ఆపేందుకు ఆర్ ‌‌ ‌‌బీఐ 19 బిలియన్ డాలర్లను మార్కెట్​లోకి రిలీజ్​ చేసింది. అంటే అమ్మేసింది. అయితే.. మన దగ్గర డాలర్లతో పాటు  యూరో, యెన్ వంటి ప్రధాన కరెన్సీలు తగ్గడం వల్ల కూడా రిజర్వ్​లు తగ్గుతున్నాయి. 

15 నెలలకు 

మన దేశం కనీసం 3-నెలల దిగుమతికి సరిపోయే రిజర్వ్ ‌‌లను ఎప్పుడూ మెయింటెయిన్ ‌‌ చేస్తుంది. అయితే.. ఎక్కువ సార్లు 15 నెలలకు సరిపడా కరెన్సీ నిల్వలు ఉంటాయి. పోయినేడాది అక్టోబర్​లో 642 బిలియన్ల అమెరికన్​ డాలర్లు ఉన్నాయి. వాటితో 16 నెలలపాటు ఇండియాకు కావాల్సిన దిగుమతులు చేసుకోవచ్చు. అయితే.. ఇది ఈ మధ్య 545.6 బిలియన్లు తగ్గడంతో మన దగ్గర 9 నెలలకు సరిపడా ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. 

చైనా నెంబర్​ వన్ ‌

ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ రిజర్వ్ ‌‌లు ఉన్న దేశాల లిస్ట్ ‌‌లో చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశం ఐదో స్థానంలో ఉంది. అయితే.. ఇతర దేశాలు అందుకోలేని స్థాయిలో చైనా రిజర్వ్ ‌‌లు ఉన్నాయి. అయితే.. డాలర్ ‌‌ ‌‌ విలువ పెరిగినప్పుడు చైనా మీద పెద్దగా ఎఫెక్ట్ ‌‌ ఉండదు. ఎందుకంటే.. చైనా దిగుమతి చేసుకునేదాని కంటే ఎగుమతి చేసేవే ఎక్కువ. కాబట్టి పోయే డాలర్ల కంటే వచ్చే డాలర్లే ఎక్కువగా ఉంటాయి. 

డాలర్​ ఒక్కటే కాదు.. 

అమెరికా డాలర్​తోపాటు మరికొన్ని దేశాల కరెన్సీని కూడా నిల్వ చేసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యంగా యూరో, చైనీస్ యువాన్​, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్​ని రిజర్వ్ చేసుకుంటున్నాయి. అమెరికా ప్రింట్​ చేసిన కరెన్సీ నుంచి 6,794.91 బిలయన్​ డాలర్లను అంతర్జాతీయ నిల్వల కోసం కేటాయించింది. యూరో (2,197.30), జపనీస్ యెన్ (624.97), బ్రిటిష్ పౌండ్ (486.08), చైనీస్ యువాన్​ (221.48) ని వివిధ దేశాలు రిజర్వ్ ‌‌ చేసుకున్నాయి. వీటితో ఐఎంఎఫ్ ‌‌ ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్, స్విస్ ఫ్రాంక్​ని కూడా రిజర్వ్ కరెన్సీలుగా గుర్తించింది. 

ప్రత్యామ్నాయంగా యూరో ఇంటర్నేషనల్​ మార్కెట్​లో యూఎస్​ డాలర్​ ఒక్కటే ఎక్కువగా చెలామణిలో ఉండడంతో అనేక దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే దీనికి బదులుగా ఏంచేయాలనే దానిమీద అన్వేషణ

మనకెంత అవసరం? 

మన దేశంలో రోజురోజుకూ డాలర్​ ప్రయారిటీ పెరుగుతోంది. ముఖ్యంగా గడిచిన ముప్ఫై ఏండ్లలో డాలర్​ అవసరం మరీ ఎక్కువైంది. క్రూడాయిల్​ నుంచి బంగారం దాకా అన్ని దిగుమతులకూ మనం డాలర్లలోనే చెల్లించాలి. అలాగే.. మన ఐటీ సర్వీసులకు, టెక్స్​టైల్స్​కు విదేశాలు మనకు డాలర్లలో చెల్లిస్తాయి. కాకపోతే, ఇబ్బందల్లా మన దిగుమతులు మనం చేసే ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటమే. కరోనా మహమ్మారి దెబ్బకు ఎకానమీలు కుదేలైన టైంలో అన్ని దేశాలు కరెన్సీని ఎక్కువగా ప్రింట్​ చేశాయి. ఇలా పరిమితులు లేకుండా కరెన్సీ ప్రింట్​చేసి, లిక్విడిటీ పెంచేయడంతో కొన్ని నెలల్లోనే వస్తువులు, సర్వీసుల ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ రేట్లను కిందికి దించడానికి అన్ని దేశాలూ వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ప్రధానంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇండియా సహా అనేక చిన్న దేశాలు వడ్డీ రేట్లను పెంచక తప్పలేదు. దిగుమతులకు సరిపడా ఫారెక్స్​ నిల్వలు (ముఖ్యంగా డాలర్లు) మెయింటెయిన్​ చేయడం డెవలపింగ్​ ఎకానమీలకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఉదాహరణకు మన దేశాన్నే తీసుకుంటే మన ఫారెక్స్​ నిల్వలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి.

పెట్రోల్ ‌‌పైనే ఎక్కువ

మన దగ్గర ఉన్న డాలర్లలో ఎక్కువగా పెట్రోల్ ‌‌ కోసమే ఖర్చు చేస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ లేనంతగా 2021–2022 ఆర్థిక సంవత్సరంలో దాదపు 119.2 డాలర్లను పెట్రోల్ ‌‌ కోసం ఖర్చు చేశాం. ఎందుకంత ఖర్చు చేయాల్సి వస్తుందంటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రూడాయిల్ ‌‌ దిగుమతిదారు ఇండియానే.

డాలర్ లేక ఇబ్బంది 

ధరలు పెరగడం వల్ల శ్రీలంక ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిందే. తినడానికి తిండి లేక జనాలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల దగ్గర డాలర్స్ ‌‌ ఎక్కువ ఉండి ఉంటే పరిస్థితి విషమించేది కాదు. కానీ.. అప్పటికే డాలర్ ‌‌ ‌‌ నిల్వలు బాగా తగ్గిపోయాయి. డాలర్​లు ఉంటేనే దిగుమతులు చేసుకోవడం వీలవుతుంది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులు కూడా డాలర్స్ ‌‌లోనే చెల్లించాలి. అందుకే డాలర్​ కోసం శ్రీలంక తన కరెన్సీ విలువను తగ్గించుకుంది. ఈ ఏడాది మార్చిలో డాలర్​ విలువ 201.49 శ్రీలంకన్​​ రూపాయలు ఉంది. కానీ.. సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక దాన్ని 230కి పెంచింది. అయినా, డాలర్ ‌‌ ‌‌ వాళ్లకు అందని ద్రాక్ష అయింది. పోయినేడాది అక్టోబర్ ‌‌ 4న డాలర్ ‌‌ ‌‌ విలువ 196.98 శ్రీలంకన్​ రూపాయలు ఉంది. సరిగ్గా ఏడాదికి అంటే ఈ అక్టోబర్ ‌‌ ‌‌ 4 నాటికి డాలర్ ‌‌ ‌‌ విలువ 360.17కి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంక దగ్గర కేవలం 1.6 బిలియన్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి.