చిన్నారుల సంరక్షణ మనందరి బాధ్యత

చిన్నారుల సంరక్షణ మనందరి బాధ్యత

కరోనా ఎఫెక్ట్​చిన్నారులపైన కూడా పడింది. అనాథ ఆశ్రమాల్లో, చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్‌‌లో బాలలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నారు.  చాలా మంది పిల్లలు వారి పేరెంట్స్​ను కోల్పోయి అనాథలుగా మారారు. గ్రామీణ భారతంలో వందలాది మంది బాలలు చదువుకు దూరమయ్యారు. దివ్యాంగులైన చిన్నారుల పరిస్థితి మరీ దారుణం. విద్య, వైద్యం, సంరక్షణతోపాటు రోజువారీ జీవితంలోనూ ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే బాలల సంరక్షణ, వారి హక్కులను కాపాడటంతోపాటు కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సొసైటీ మీద ఉంది. ఎందుకంటే రేపటి భారతావని పిల్లలదే. బోసినవ్వుల చిన్నారులు, కల్మషం లేని ఆ లేత మనసులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? అందుకే భవిష్యత్ భారతావనికి ప్రతిబింబాలైన చిన్నారులను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇండియా భావిస్తోంది.

ఇందుకోసం1992లో చేపట్టిన ‘కన్వెన్షన్ ఆన్ ది రైట్ ఆఫ్ చైల్డ్’ నిబంధనలను ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగానే బాలల హక్కులు, వారి అభివృద్ధికి సంబంధించి వివిధ సానుకూల విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్త మానవాళి, వివిధ రంగాలపై దుష్ప్రభావాన్ని చూపింది. నేరుగా చిన్నారులపై ఎఫెక్ట్​ పడకపోయినా, మొత్తం పరిణామాల నేపథ్యంలో వారు కూడా కరోనా బాధితులుగా మిగిలిపోయారు. వారి సంరక్షణ, సంక్షేమంపైనా కరోనా పెను ప్రమాదాన్నే చూపించింది. కరోనానంతరం చిన్నారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

నూతన భవిష్యత్తు స్వాప్నికులుగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పని పరిస్థితుల్లో అన్ని రూల్స్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులను కాపాడుకునే దిశగా మరిన్ని చర్యలు చేపట్టడం మనందరి బాధ్యత. కొన్ని కుటుంబాల్లో పేరెంట్స్​ను కోల్పోయిన చిన్నారుల్లో ధైర్యం నింపడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అభినందించి తీరాల్సిందే. ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిగిలిన చిన్నారుల పరిస్థితిపైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది.  
ప్రభుత్వ పథకాలు అవసరం..
దేశవ్యాప్తంగా అనాథ ఆశ్రమాల్లో, చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్‌‌లో ఉంటున్న చిన్నారులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలు కొంత మేరకే ఉపశమనాన్నిఇస్తున్నాయి. బయటకు వెళ్లాల్సిన విషయంలో ఆంక్షలు, పరిమిత వనరులు వంటివి అనాథలు, ఇతర బాధిత చిన్నారులకు ప్రతికూలంగా మారుతున్నాయి. జువెనైల్ జస్టిస్ యాక్ట్ – 2015 ప్రకారం.. అనాథ పిల్లలు 21 ఏండ్లు వచ్చే వరకు ప్రభుత్వ పథకాలను పొందేందుకు అర్హులవుతారు. ఆ‌‌ తర్వాత కూడా వారికి సరైన మద్దతు అవసరం. విద్య, ఉపాధి కల్పన విషయంలో అనాథ పిల్లలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి అనాథ పిల్లలకు తత్సంబంధితమైన సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల లబ్ధిని పొందగలుగుతారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలు, లబ్ధిని కలిగించే పథకాలను మిగిలిన చిన్నారులకు, అనాథలకు కూడా వర్తింపజేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాలకు మరింత న్యాయం చేసినట్లవుతుంది.

దివ్యాంగులైన చిన్నారులకు 
కరోనా మహమ్మారి టైమ్​లో ప్రకటించిన పథకాల లబ్ధిదారుల జాబితాలో దివ్యాంగులైన చిన్నారులను కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. దివ్యాంగులైన చిన్నారులు వారి రోజువారి జీవితంలో, విద్య, వైద్యం, సంరక్షణ విషయంలో తప్పనిసరిగా ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తోంది. కరోనా కారణంగా ఇలాంటి చిన్నారులు వివిధ సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పౌష్టికాహారం, విద్య, వైద్యం, వ్యక్తిగత సంరక్షణ వంటి ఎన్నో విషయాల్లో దివ్యాంగ చిన్నారులు సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే, కరోనా సమయంలో వారి సంరక్షణ అపాయంలో పడిందనడంలో సందేహం లేదు. ఇన్ని సమస్యలను నెలల తరబడి ఎదుర్కోవడం ద్వారా వారి మానసిక ఆరోగ్యం, వారి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. దీనికితోడు ఆన్‌‌లైన్ విద్యకోసం ఏర్పడిన సాంకేతిక అంతరం వీరి జీవితాలను మరింతగా ఎఫెక్ట్​చేసింది. అప్‌‌డేటెడ్‌‌ టెక్నాలజీ అందుబాటులో లేని కారణంగా వారు మెరుగైన విద్యకు దూరమైన పరిస్థితి తలెత్తింది. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అనాథలు, ఇతర వర్గాల కోసం అందిస్తున్న పథకాలు, కార్యక్రమాలను దివ్యాంగ చిన్నారులకు కూడా వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాలికలపై  ఎఫెక్ట్
ఆదాయం తక్కువగా ఉన్న, నిమ్న సామాజిక వర్గాలకు చెందిన చిన్నారులపైనా కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని ఎక్కువగానే చూపింది. ఆ ఎఫెక్ట్​బాలికలపై ఎక్కువగానే పడింది. బాలకార్మికులు, గృహహింస, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు వంటి కేసుల సంఖ్య పెరగడం వారు ఎదుర్కొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. గత వందేండ్లలో యావత్ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో కరోనా పెద్ద
విపత్తుగా ప్రపంచాన్ని వణికించింది. ఈ పరిస్థితుల్లో చిన్నారుల సంరక్షణ, వారి హక్కులు, వారి కనీస అవసరాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా..వాటిని సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థలను ఇప్పటి నుంచే నిర్మించుకోవాలి.

అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి..
కరోనా నేర్పిన గుణపాఠాలను గుర్తు చేసుకుంటూ మహమ్మారి తదనంతర పరిస్థితుల్లో సమాజంలోని అన్ని వర్గాలకు జీవనామోద యోగ్యమైన పరిస్థితులను కల్పించే విషయంలో విభిన్న వర్గాలు అన్ని రకాలుగా మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. ఇందుకోసం వివిధ స్థాయిల్లో చర్చలు జరగాలి. మౌలిక వసతుల లేమి, విధి విధానాల అమలులో సమస్యలు, మానవ వనరుల కొరత వంటి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించు కుంటూ..  చిన్నారుల సంరక్షణకు సంబంధించిన అనువైన వాతావరణాన్ని నిర్మించుకోవాల్సిన అవసరముంది. జవాబుదారీతనాన్ని పెంచడం, ఆర్థిక తోడ్పాటును అందించడం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. సీసీఐలను వికేంద్రీకరించడం ద్వారా ప్రత్యామ్నాయ చిన్నారుల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి.