
న్యూఢిల్లీ: కంపెనీలో ఎటువంటి వాటాను కూడా అమ్మాలని చూడడం లేదని, మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వేదాంత లిమిటెడ్ ప్రకటించింది. ఫండింగ్ సేకరించడంలో వాటాలు అమ్మడమనేది తమ చివరి ఆప్షన్ అని గతంలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్న విషయం తెలిసిందే. 5 శాతం కంటే తక్కువ వాటాను అమ్మడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన అప్పుడు అన్నారు.
తాజాగా వేదాంత దీనికి భిన్నంగా ప్రకటన చేసింది. వేదాంతలోని వాటాలను అమ్ముతున్నామనే వార్తలు నిజం కాదని కంపెనీ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. వేదాంత లిమిటెడ్‌లో మెజార్టీ షేరు హోల్డరయిన వేదాంత రిసోర్సెస్ అప్పులను తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను వెతుకుతోంది. జింక్ బిజినెస్‌లను హిందుస్తాన్ జింక్‌కు అమ్మడం ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్లను సేకరించాలని ప్లాన్స్ వేసుకుంది. కానీ, ప్రభుత్వం ఈ డీల్‌కు అడ్డు తగిలింది. హిందుస్తాన్ జింక్ లో వేదాంతకు 64.92 శాతం వాటా ఉండగా, ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది.
క్యాష్ రూపంలో జరిగే ఈ డీల్ పూర్తయితే హిందుస్తాన్ జింక్ షేర్లు పడతాయని, తమ డిజిన్వెస్ట్‌మెంట్‌కు నష్టం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. డీల్‌ను షేర్ల స్వాప్ లేదా వారెంటీలను ఇష్యూ చేయడం ద్వారా వేదాంత పూర్తి చేయాలని సలహా ఇచ్చింది. మొత్తంగా ఈ డీల్ ఆగిపోవడంతో ఫండ్స్ సేకరించడానికి మరిన్ని మార్గాలను వేదాంత రిసోర్సెస్ వెతుకుతోంది. అప్పులను తీర్చే పొజిషన్‌లో ఉన్నామని వేదాంత రిసోర్సెస్ చెప్పుకొస్తోంది.
లోన్ దొరికింది!
వేదాంత లిమిటెడ్ తమకు అప్పు దొరికిందని ప్రకటించింది. 1.75 బిలియన్ డాలర్లను వివిధ బ్యాంకుల గ్రూప్ నుంచి దక్కించుకున్నామని, చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఈ నెల లోపు పే చేయాల్సిన లోన్లంటిని ఇప్పటికే చెల్లించామని వేదాంత పేర్కొంది. గత 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల అప్పులను తగ్గించుకున్నామని వివరించింది.