సిటీలో ఇష్టమొచ్చినట్లు తిరిగితే.. ట్రాఫిక్ పన్ను వేస్తారు..?!

సిటీలో ఇష్టమొచ్చినట్లు తిరిగితే.. ట్రాఫిక్ పన్ను వేస్తారు..?!

కారు ఉంది నా ఇష్టమొచ్చినట్లు.. సిటీలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా అంటే కుదరదు.. బైక్ ఉంది కదా అని అర్థరాత్రులు సిటీ మొత్తం చక్కర్లు కొడతా అంటే కుదరదు.. అవును.. మీరు మీ ఏరియాలోనే తిరగాలి.. మరో ప్రాంతానికి వెళ్లాలంటే పన్ను కట్టాలి.. అంటే టోల్ ట్యాక్స్ అన్నమాట.. ప్రస్తుతం బెంగళూరు సిటీలో ట్రాఫిక్ ను నియంత్రించటానికి రద్దీ పన్ను విధానాన్ని తీసుకొస్తున్నారు.. 2021 నుంచే కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తూ.. పూర్తి స్థాయిలో అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇంతకీ రద్దీ పన్ను అంటే ఏంటీ.. :

ఇది కొత్త విధానం ఏమీ కాదు. లండన్, సింగపూర్ దేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా అమలు అవుతుంది. ఉదాహరణకు మీరు కూకట్ పల్లి ఏరియాలో కారు లేదా ఇతర వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుందాం.. అప్పుడు మీరు కూకట్ పల్లితోపాటు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాదు కూకట్ పల్లి నుంచి దిల్ ఖుష్ నగర్ వెళ్లాలి అనుకుంటే.. మీ వాహనానికి ట్యాక్స్ కట్టాలి. ఇది ఎలా వసూలు చేస్తారు అని అనుకోవచ్చు.. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ లు ఉన్నాయి కదా.. అలాగే సిటీలో కొన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. 

రద్దీ పన్ను విధానం వల్ల ఉపయోగం ఏంటీ.. :

సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. దీని వల్ల కొద్ది దూరానికే గంటల తరబడి సమయం పడుతుంది. దీన్ని కంట్రోల్ చేయటానికి ఈ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దీని వల్ల సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గి పొల్యూషన్ తగ్గటంతోపాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగం పెరుగుతుంది. 

బెంగళూరుకు ఇది ఎంత వరకు ఉపయోగం :

ప్రస్తుతం బెంగళూరు సిటీ ట్రాఫిక్ రద్దీతో నరకం చూస్తుంది. ఈ ట్యాక్స్ తీసుకురావటం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి.. మెట్రో, ఆర్టీసీ బస్సులు, ఆటోల వైపు ప్రయాణికులు డైవర్ట్ అవుతారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది అని అంచనా వేస్తున్నారు అధికారులు. 

బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసుల ప్రణాళిక ఏంటీ.. ఎలా వసూలు చేస్తారు :

బెంగళూరు సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో టోల్ మెషీన్స్, టోల్ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. కారు లేదా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ ఛార్జీలు ఉంటాయి. 

ALSO READ : మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం దోస్తీ

ఇండియాలో కొత్త కాదు.. గతంలో ముంబై, ఢిల్లీలోనూ అమలు :

రద్దీ పన్ను విధానం ఇప్పుడు బెంగళూరు సిటీలోనే కొత్తగా పెడుతున్నారు అనటానికి ఏమీ లేదు. గతంలో ఢిల్లీ, ముంబై సిటీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే జనం నుంచి తీవ్ర నిరసనలు రావటంతో.. స్థానిక రాజకీయ నేతల ఒత్తిడితో.. రద్దీ పన్ను విధానాన్ని వెనక్కి తీసుకున్నాయి ఆయా ప్రభుత్వాలు. 

బెంగళూరులో ఎక్కడెడక్క అమలు చేయబోతున్నారు :

బెంగళూరు సిటీలో అత్యంత రద్దీ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో ఔటర్ రింగ్ రోడ్డు, సర్జాపూర్ రోడ్, హోసూర్ రోడ్డు, ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డు, ఓల్డ్ మద్రాస్ రోడ్డు, బళ్లారి రోడ్డు, బెన్నర్ గట్ట రోడ్డు, కనకపుర రోడ్డు, మాదాది రోడ్డు, వెస్ట్ ఆఫ్ చోర్డ్ రోడ్డు, తూమకూరు రోడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోకి వీకెండ్ మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది. మిగతా ఐదు రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగతా ప్రాంతాల వాళ్లు రావాలంటే రద్దీ పన్ను కట్టాలి. ఈ విధానాన్ని త్వరలో అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు బెంగళూరు సిటీ అధికారులు. 

ప్రస్తుతం సింగపూర్, లండన్ ప్రాంతాల్లో ఈ విధానం ఎన్నో ఏళ్లుగా ఉంది. ఆయా ప్రాంతాలను అధ్యయనం చేసిన తర్వాతే బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు, కర్ణాటక ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. దీని ద్వారా ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయొచ్చని భావిస్తుంది. అయితే దీని వల్ల జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.