విశ్లేషణ: కనీస మద్దతు ధర చట్టం తేవాలె

విశ్లేషణ: కనీస మద్దతు ధర చట్టం తేవాలె

మనదేశంలో వ్యవసాయం అనేది ఒక జీవన విధానం. ఎన్నో దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రజానీకం వ్యవసాయాన్ని తమ జీవితాల్లో అంతర్భాగంగా మార్చుకున్నారు. హరిత విప్లవం ద్వారా దేశ ఆహార భద్రత విషయంలో రైతాంగం చేసిన కృషి  ఫలించి మనదేశం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. హరిత విప్లవం వచ్చిన రెండు తరాల తర్వాత కూడా సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయాన్ని సంప్రదాయ జీవనశైలిలో భాగంగా కొనసాగిస్తున్నారు. దేశ ఆర్థిక శక్తి నగరాలు, పట్టణాల్లో ఉంటే రాజకీయ శక్తి గ్రామాల్లో ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రైతుల మేలు కోసం ఉద్దేశించిన చట్టాలని చెప్పినా రైతుల తిరస్కారానికి గురయ్యాయి. ఈ చట్టాలపై రైతాంగం అభ్యంతరాలను పరిశీలించకుండా ముందుకువెళ్లడంతో కీలకమైన సంస్కరణలు చేయగలిగే గొప్ప అవకాశాన్ని దేశం కోల్పోయింది. 

పాత చట్టాలతో రైతులకు నష్టం
దేశ జనాభాలో సగానికిపైగా ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మార్పు చెందాలని, ఫలితంగా రైతుల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల రావాలని అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదు. ప్రస్తుతం ఉన్న చట్టాల ద్వారా రైతులు పంటల అమ్మకం కోసం మార్కెట్ యార్డ్, కమీషన్ దారులు, మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోంది. మూడు శాతం మార్కెట్ ఫీజు, మూడు శాతం కమీషన్ దారుల ఫీజు, అనేక రకాల ఖర్చులు రైతుల నుంచే రాబడుతున్నారు. ఇంత చేసినా రైతులకు వచ్చేది కనీస మద్దతు ధర మాత్రమే. గిట్టుబాటు ధర కాదు. తెలుగు రాష్ట్రాల్లో వడ్లకు క్వింటాల్​కు దొడ్డు రకాలకు రూ.2,500 నుంచి రూ.3 వేలు ఉండవలసిన చోట మద్దతు ధర కంటే రూ.300 తక్కువ ఉండటం ప్రస్తుత చట్టాల్లోని లోపమే. సన్న, చిన్నకారు రైతులు పండించిన పంటలను అమ్మడానికి మార్కెట్ యార్డ్, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చాక అకాల వర్షాలతో నష్టపోతున్నారు. రైతు తమ పొలంలో ఒక హక్కుగా పొందవలసిన మద్దతు ధర అకాల వర్షాల కారణంగా కోల్పోవాల్సి వస్తోంది. చిన్న కమతాలు ఉన్న రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ యాంత్రీకరణకు పెట్టుబడి పెట్టలేని, అధిక ఉత్పత్తి సాధించలేని స్థితి దీర్ఘకాలం కొనసాగడం దేశ ఆర్థిక ప్రయోజనాలకు దోహద పడదు. రైతాంగం ముందున్న అతి పెద్ద సమస్య తమ పంటలకు మద్దతు ధర, గిట్టుబాటు ధర పొందలేకపోవటమే. ఈ విషయంలో కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యంపై కాకుండా ఒక చట్టం ద్వారా రక్షణ కావాలని కోరుకోవడం దురాశ  ఏమాత్రం కాదు. 

రైతులను ఒప్పించలేకపోయిన్రు
కొత్త సాగు చట్టాలకు సంబంధించి మేధావుల సమర్థన లోపభూయిష్టంగా ఉండటంతో రైతాంగం అనేక అపోహలకు లోనైంది. హరిత విప్లవం నాటి మద్దతు ధర విధానానికి కాలం చెల్లిందని, రైతులు వరి, గోధుమ నుంచి ఇతర పంటల వైపు మళ్లి కేంద్రం మద్దతు ధర కోసం వెచ్చిస్తున్న నిధుల పొదుపు జరగాలని చేసిన వాదన రైతులను భయాందోళనకు గురిచేసింది. అయితే బియ్యం కోసం కిలో రూ.40 వెచ్చించి కిలో రూ.2 లేదా రూ.3కు దేశ జనాభాలో 67% మందికి అందిస్తోంది. హరిత విప్లవం నాటి విధానాలకు కాలం చెల్లిందని వాదిస్తున్న మేధావులు.. రూపాయికే కిలో బియ్యం ఇచ్చి సబ్సిడీగా రూ.30 భరించే బదులు నేరుగా పేదలకు నగదు బదిలీ చేయాలని కోరకపోవడం పక్షపాత ధోరణే. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర రావాలని, అలాగే వినియోగదారుడు తనకు సరసమైన ధరకు ఆహార పదార్థాలు లభించాలని కోరుకోవడం సహజం. ఆహార ధాన్యాలను సబ్సిడీకి పేదలకు అందిస్తే రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించాల్సిందే. ఇటీవల వంట నూనెల ధరలు పెరిగాయని ప్రభుత్వం దిగుమతి సుంకాలను పూర్తిగా తగ్గించింది. అనేక సందర్భాల్లో ఆహారధాన్యాల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటి ధరలు తగ్గించడం దేశీయ రైతాంగానికి నష్టం కలిగించింది. వినియోగదారుల కోసం లేక ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల పొదుపు కోసమో సంస్కరణలు తీసుకువచ్చి రైతాంగాన్ని సంక్షోభం పాలు చేస్తారని భావించడమే ఈ చట్టాల పట్ల వ్యతిరేకతకు కారణం.

ప్రైవేట్​ గోడౌన్ల నిర్మాణం జరగాలె
ఆహారధాన్యాల నిల్వ అవసరాల కంటే మించి ఉండటం దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారిందనేది కూడా వాస్తవమే. దేశంలో ఆహారధాన్యాల గోదాముల నిర్వహణ ప్రైవేట్ పరం గా ఎక్కువగా జరగడంలేదు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్లు మార్కెట్ కు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన వడ్లను వెంటనే శుద్ధి చేసి సైలోల విధానంలో నిల్వ ఉంచి తదుపరి విడుదల చేసి ఉంటే రైతాంగానికి మేలు జరిగేది. కానీ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఆహార ధాన్యాల గోదాములు లాభదాయకంగా లేకపోవడంతో ఎక్కువ స్థాయిలో వాటిని నిర్మించడం లేదు. పెద్ద ఎత్తున పంట మార్కెట్​కు వస్తున్న సమయంలో సరైన నిల్వ సామర్థ్యం లేక అకాల వర్షాలతో రైతాంగమే కాకుండా రాష్ట్రం కూడా ఆర్థికంగా నష్టపోతోంది. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాల్లో రైతులకు తమ పంటల మద్దతు ధర విషయంలో చట్టబద్ధత కల్పించకపోవడంతో వాటిని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంస్కరణల తర్వాత పట్టణ ప్రాంతాల్లో పేదలు.. ధనికుల మధ్య అసమానతలు పెరిగిపోయాయి. గత దశాబ్దకాలంగా గ్రామీణ భారతంలో కూడా ఇలాంటి అసమానతలే చోటుచేసుకున్నాయి. పట్టణాల్లోని సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పన్ను ఎగవేతదారులు వ్యవసాయ భూములను భారీగా కొనుగోలు చేసి భూసంస్కరణల ఫలితంగా కనుమరుగైన ఫ్యూడల్ శక్తుల స్థానంలో కొత్త కార్పొరేట్ ఫ్యూడల్ శక్తులుగా  అవతరించారు. భూమిలేని గ్రామీణ పేదలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో డైరీ, పౌల్ట్రీ, గొర్రెలు, చేపల పెంపకం మొదలైన వాటితో ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు గిరి ఆవు పాలని.. సేంద్రియ దేశీయ ఆవు పాలని.. సేంద్రియ పండ్లని.. కూరగాయలని తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించుకొని కొత్త వ్యవసాయ చట్టాల సంస్కరణల కంటే ముందే ప్రభావాన్ని చూపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న రైతాంగంలో చిన్న, సన్నకారు రైతులే అత్యధికం. 
మరీ ముఖ్యంగా తెలంగాణలో సన్న, చిన్నకారు రైతులు 90% పైనే ఉంటారు. కొత్త వ్యవసాయ చట్టాలు సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఉద్దేశించినవే. వ్యవసాయ సంస్కరణలకు సంబంధించిన ఈ చట్టాలపై ఏకాభిప్రాయం సాధించకపోవడంతో రైతుల్లో ఆందోళన చెలరేగింది. ఈ చట్టాల్లో రైతులకు మేలు చేసే అనేక అంశాలు ఉన్నప్పటికీ వాటిపై సరైన అవగాహన కల్పించలేకపోయారు. తమ పంటలకు కనీస మద్దతు ధర కోసం కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తుందని రైతాంగం భావించి సంవత్సర కాలంగా పోరాడింది. రైతుల ఉద్యమంతో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. కొత్త సాగు చట్టాల కంటే ముందు అన్ని ఆహార పంటలకు కనీస మద్దతు ధర లభించేలా ఒక చట్టాన్ని పాస్ చేసి ఉంటే ఈ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు.