కేటాయింపులే తప్ప అమలు ఏది?

కేటాయింపులే తప్ప అమలు ఏది?

ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల గురించి ఎన్ని మాటలు చెప్పినా, ఆయా పథకాల అమలుకు బడ్జెట్ కేటాయింపులు,  నిధుల విడుదల, ఖర్చు అత్యంత కీలకమైనవి. గత తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పని తీరును అంచనా వేయడానికి కూడా ఇదే కొలమానం.  వెనుకబాటుతనానికి, వివక్షకూ గురయ్యే వర్గాల బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల విషయంలో ఈ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుసుకోవడం  అవసరం. ఏప్రిల్ 14 న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ చేసిన సమయంలో, ఆయా వర్గాల కోసం ప్రభుత్వం ఆచరణలో ఏమి చేస్తుందో తెలుసుకోవడం మరింత ముఖ్యం. 

బీసీల పథకాల అమలు ఏది?

2018-–19లో వెనుక బడిన వర్గాల (బీసీ) సంక్షేమానికి 5,960 కోట్లు కేటాయించినా, అందులో 63 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2022-–23లో రూ.6,229 కోట్లు కేటాయించినా, ఖర్చు ధోరణి మాత్రం అలాగే కొనసాగుతున్నది. రాష్ట్ర జనాభాలో బీసీలు 54 శాతం ఉన్నప్పటికీ, 2023-–24లో రూ. 2,90,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో  కేవలం 5 శాతం మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయించారు. గత ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి మొత్తంగా రూ.17,611 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.  2019-–20లో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కు రూ.299 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2021-–22లో కూడా దీని కోసం రూ.254.19 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2020-–21లో ఎం‌‌‌‌‌‌‌‌బీసీ అభివృద్ధి కార్పొరేషన్ కు రూ.500 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2020-–21లో ఓ‌‌‌‌‌‌‌‌బీసీ, డీ నోటిఫైడ్, సంచార జాతులు, ఉప సంచార జాతుల అభివృద్ధికి రూ. 20 లక్షలు కేటాయించినా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు . 2021–22 లో తెలంగాణా బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కు రూ. 500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎం‌‌‌‌‌‌‌‌బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులలో 2018-–19 లో 75 శాతం, 2020-–21లో, 2021-–22 లో 100 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 

2018-–19లో చేనేత రంగానికి కేటాయించిన రూ.722 కోట్లలో 40 శాతం ఖర్చు చేయలేదు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ల ఫెడరేషన్ కు 2017--–18లో  కేటాయించిన నిధుల్లో 91 శాతం ఖర్చు చేయలేదు . 2018--–19లో  కేటాయించిన నిధుల్లో 86 శాతం ఖర్చు చేయలేదు . తెలంగాణ రజక కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ కు 2018-–-19లో  కేటాయించిన నిధుల్లో 73 శాతం ఖర్చు చేయలేదు. ఆ తరువాత సంవత్సరాలలో ఎప్పుడూ నిధులు కేటాయించలేదు . ప్రభుత్వ హాస్టల్స్ కు 2018–--19లో  కేటాయించిన నిధులలో 36 శాతం, 2020--21లో 61 శాతం, 2021-–22లో 81 శాతం నిధులు ఖర్చు చేయలేదు. వెనుకబడిన వర్గాల రెసిడెన్షియల్హై  స్కూల్స్, జూనియర్ కాలేజీల సొసైటీకి 2018–-19లో  చేసిన కేటాయింపులలో 46 శాతం ఖర్చు చేయలేదు. 2020–--21 లో 74 శాతం, 2021–--22 లో 54 శాతం ఖర్చు చేయలేదు. 

ఎస్సీ పథకాలదీ అదే గతి!

వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులలో 2018-–19 లో రూ.4816.58 కోట్లు , 2019-–20 లో రూ.2777 కోట్లు, 2021-–22 లో రూ.4877.62 కోట్లు, 2022-–23 లో రూ.7434 కోట్లు అసలు ఖర్చు చేయనే లేదు. 2018-–19 నుంచి మొత్తం రూ. 8271 కోట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటాయించినప్పటికీ, ఖర్చు చేసింది శూన్యం. 2023-–24 బడ్జెట్ లో రూ.1950 కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎన్ని ఇళ్లు కేటాయించిందో  చెప్పవలసి ఉంది. 2018-–19 లో దళితుల సంక్షేమానికి బడ్జెట్ పెంచినట్లు కనిపించినా, అందులో 40 శాతం ఖర్చు చేయనే లేదు. 2016-–17 నుంచి 2020-–21 మధ్య కాలంలో కాగ్ నివేదికల ప్రకారం 45.8 శాతం నిధులు ఖర్చు చేయనే లేదు. దళితుల సాధారణ విద్య కోసం 2017-–18 లో కేటాయించిన నిధులలో 42 శాతం ఖర్చు చేయనే లేదు. షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తరగతులు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీల కోసం 2017-–18 లో కేటాయించిన నిధులు రూ.1509 కోట్లలో 49 శాతం ఖర్చు చేయనే లేదు. 2022-–23లో  కూడా ఈ రంగాలకు కేటాయించిన రూ. 6699 కోట్లు ఖర్చు చేయనే లేదు. దళితుల ఇళ్ల నిర్మాణానికి 2020-–21 లో రూ. 1850 కోట్లు కేటాయించినా, అందులో 99 శాతం  ఖర్చు  చేయనే లేదు. దళితుల పరిశ్రమ కోసం 2021-–22 లో రూ.627 కోట్లు కేటాయించినా అందులో 50 శాతం   ఖర్చు చేయనే లేదు. 2022-–23 లో దళిత బంధు కోసం కేటాయించిన నిధులలో రూ. 6700 కోట్లు ఖర్చు చేయనే లేదు.  సమసమాజ సాధన ఏది? పథకాలకు కేటాయింపులు తప్ప, ఖర్చు చేసింది లేదెందుకు? అంబేద్కర్​ ఆశయాలు ఏవి?. 


గిరిజనుల పథకాల నిధుల మళ్లింపు

రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌‌‌‌‌‌‌‌సీ‌‌‌‌‌‌‌‌ఆర్ 2022 సెప్టెంబర్ 17 న గిరిజన బంధు గురించి హామీ ఇచ్చినా 2023-–24 బడ్జెట్ లో ఇందు కోసం రూపాయి కూడా కేటాయించలేదు. కాగ్ నివేదికల ప్రకారం గిరిజన సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగినప్పటికీ, ఖర్చులు మాత్రం 50 శాతం దాటడం లేదు. 2016-–17 బడ్జెట్ లో 17.57 శాతం, 2017-–18లో 46 శాతం, 2018-–19లో 43 శాతం, 2019-–20లో 26 శాతం, 2020-–21లో 37 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2023-–24 బడ్జెట్ లో గిరిజన సంక్షేమానికి కేవలం రూ. 3,025 కోట్లు కేటాయించారు. ఇది ఎస్‌‌‌‌‌‌‌‌టీ  సబ్ ప్లాన్ లో కేవలం 19.9 శాతం మాత్రమే. 2014 నుంచి ఈ ఎస్‌‌‌‌‌‌‌‌డి‌‌‌‌‌‌‌‌ఎఫ్ నిధులలో 70 శాతం నిధులు ఈ పద్దు క్రింద ఇతర శాఖలకు ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకు ఈ నిధుల నుంచి స్మార్ట్ నగరాలకు రూ.127 కోట్లు, విమానాల రన్ వే కోసం రూ.18.16 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 830.51కోట్లు, హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి రూ.113.5 కోట్లు, హైదరాబాద్ ఆగ్లోమేరేషన్ కోసం రూ.1162.96 కోట్లు, విమానాశ్రయానికి వేసే మెట్రో లైన్ కు రూ. 45.4 కోట్లు కేటాయించారు. 2018-–19లో గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులలో 50 శాతం మాత్రమే ఖర్చు చేశారు.  2019-–20 లో రూ.10 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులలో 2018-–19లో రూ. 3001 కోట్లు, 2019-–20లో  రూ.1102 కోట్లు, 2020-–21 లో రూ. 3264.52 కోట్లు , 2021-–22 లో  రూ.2908 కోట్లు, 2022-–23 లో రూ.702 కోట్లు ఖర్చు చేయనే లేదు. 

 - కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక