భూమికి దగ్గరగా వస్తున్న మిస్టరీ ఆబ్జెక్ట్ ఏంటీ?

భూమికి దగ్గరగా వస్తున్న మిస్టరీ ఆబ్జెక్ట్ ఏంటీ?

పాత రాకెట్టా? ఆస్టరాయిడా?

ఆస్టరాయిడ్లు.. ఆకాశంలో అల్లంతదూరాన చుక్కల్లా మెరుస్తూ కన్పిస్తయి. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకొస్తయి. కొన్ని అప్పుడప్పుడు భూమికి దగ్గరగా వచ్చిపోతుంటయి. కొన్ని మీటర్ల సైజున్న చిన్న ఆస్టరాయిడ్ అయినా సరే.. భూమిపై పడిందంటే.. ఓ భారీ అణు బాంబు పేలినట్లే. అందుకే.. భూమికి దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్లపై ఆస్ట్రోనామర్లు నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నారు. అయితే.. తెల్లనివన్నీ పాలు కావన్నట్లు.. మెరిసేవన్నీ కూడా ఆస్టరాయిడ్లు కావు. చాలాసార్లు రాకెట్, శాటిలైట్ ముక్కలను కూడా ఆస్టరాయిడ్లుగా పొరబడుతుంటారు. ఇప్పుడు అలాంటి మిస్టరీనే మరోటి ఆస్ట్రోనామర్లకు సవాల్ గా మారింది. ఆస్టరాయిడ్ లా మెరుస్తూ కన్పించే మిస్టరీ ఆబ్జెక్ట్ ఒకటి ఈ నెల15న భూమి ఆర్బిట్ లోకి రానున్నది. చుట్టంలాగా నాలుగు నెలలు భూమి చుట్టూ తిరిగి.. ఆ తర్వాత తన దారిన తాను ఎగిరిపోనున్నది. ఇంతకూ అదేమిటి? ఆస్టరాయిడా? రాకెట్టా? అది దగ్గరగా వచ్చిపోయాకే మిస్టరీ వీడుతుందని చెప్తున్నారు.

పోయిన నెలలోనే కనుగొన్నరు..

భూమి వైపు చుక్కలా మెరుస్తూ వస్తున్న ఓ ఆబ్జెక్ట్ ను సెప్టెంబర్ 17న హవాయిలోని ఓ అబ్జర్వేటరీ వద్ద ఉన్న ‘ది పనోరమిక్ సర్వే టెలిస్కోప్ అండ్ రాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్ (పాన్ స్టార్స్1)’ టెలిస్కోపుతో ఆస్ట్రోనామర్లు గుర్తించారు. టెంపరరీగా ‘ఆస్టరాయిడ్ 2020 ఎస్ వో’ అని దానికి పేరు పెట్టారు. భూమి వైపు వచ్చే నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్స్ లిస్టులో దీనిని చేర్చారు. దీనిని మన భూమి ఈ నెల 15న తన గ్రావిటీతో ఆకర్షించనుందని
అంచనా వేశారు. ఇది డిసెంబర్ 1న మన భూమికి చంద్రుడి కన్నా ఎంతో దగ్గరగా.. 50 వేల కిలోమీటర్ల దగ్గరకు రానుందట. తర్వాత వచ్చే ఫిబ్రవరి2న ఇది మనకు 2.30 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వస్తుందట. చివరకు మార్చిలో భూమి చుట్టూ తిరుగుతున్న కక్ష్యను వదిలేసి.. మళ్లీ సూర్యుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఎగిరిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈసారికైతే ఇది మన భూమిపై పడే చాన్స్ ఏమాత్రం లేదని చెప్తున్నారు.

నాసా రాకెట్ ముక్కనేనా?

ఇంతకూ ఇది ఆస్టరాయిడేనా? కాదా? అంటే.. కొందరు అవునని.. మరికొందరు కాదని అంటున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ‘నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్’ విభాగానికి డైరెక్టర్ అయిన పాల్ చొడాస్ మాత్రం అది కచ్చితంగా రాకెట్ కు చెందిన ముక్కనే అని చెప్తున్నారు. ఆయన కొన్ని దశాబ్దాలుగా ఆస్టరాయిడ్లపై రీసెర్చ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాంటి ఎన్నో మిస్టరీ ఆబ్జెక్టుల గుట్టును విప్పారు. కొందరు మినీ ఆస్టరాయిడ్ గా చెప్తున్న  ఆ స్పేస్ ఆబ్జెక్ట్ వాస్తవానికి 54 ఏళ్ల కిందట నాసా ప్రయోగించిన రాకెట్ కు సంబంధించిన శకలమే అయ్యి ఉంటుందని పాల్ అంటున్నారు. ‘‘నాసా 1966లో చంద్రుడిపైకి సర్వేయర్ 2 ల్యాండర్ ను సెంటార్ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఆ ల్యాండర్ థ్రస్టర్లు ఫెయిల్ కావడంతో అది చంద్రుడిపై కూలిపోయింది. మూన్ ఆర్బిట్ లో ల్యాండర్ ను వదిలేసిన సెంటార్ రాకెట్ అప్పర్ స్టేజ్ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. క్రమంగా సూర్యుడి కక్ష్యలోకి చేరింది. మన భూమిలాగే.. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న ఆ ముక్కే.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మన టెలిస్కోపులకు చిక్కింది..” అని పాల్ వివరిస్తున్నారు.

గతంలోనూ..

పాల్ చొడాస్ 2002లోనూ ఓ మిస్టరీ ఆబ్జెక్ట్ గుట్టును విప్పారు. అది1969లో అపోలో 12 మిషన్ (సెకండ్ మూన్ ల్యాండింగ్) కు నాసా ప్రయోగించిన శాటర్న్ వీ రాకెట్ థర్డ్​ స్టేజ్ అని ఆయన వివరించారు. ఆ మరుసటి ఏడాదే.. 2003లో అది ఎర్త్ ఆర్బిట్ లోకి చేరడంతో దాని మిస్టరీ తొలగిపోయింది. గతేడాది బ్రిటిష్​ అమెచ్యూర్ ఆస్ట్రోనామర్ నిక్ హావెస్ కూడా ఆస్టరాయిడ్ గా భావిస్తున్న ఓ ఆబ్జెక్ట్ మిస్టరీని విడగొట్టారు. అది ఆస్టరాయిడ్ కాదని.. నాసా అపోలో10 మూన్ ల్యాండింగ్ మిషన్ కు చెందిన లూనార్ మాడ్యూల్ అని తేల్చారు. అయితే, దీనిపై ఇప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు. అందుకే.. అది 2030 నాటికి మన భూమికి మళ్లీ దగ్గరగా వస్తుందని, అప్పుడు దాని సంగతి తేలుస్తానని నిక్ అంటున్నారు.

దగ్గరకొచ్చాకే నిజం తెలిసేది..

ఈ మిస్టరీ ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చిన తర్వాతే.. దీనిని ఆస్ట్రోనామర్లు మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు చాన్స్ ఉందని చెప్తున్నారు. దీని ఆర్బిట్, సూర్యుడి కాంతి వల్ల కలిగే రేడియేషన్, థర్మల్ ఎఫెక్ట్స్ వంటివి తెలుస్తాయని అంటున్నారు. ఆస్టరాయిడ్స్ అయితే.. ఔట్ సైడ్ ఫోర్సెస్ కు అంతగా ప్రభావితం కావు. ఒకవేళ ఇది సెంటార్ రాకెట్ ముక్కనే అయితే.. బయటి ఫోర్సెస్ ఎఫెక్ట్ కు గురికావడంతో ఆస్టరాయిడ్ల కంటే డిఫరెంట్ గా ప్రయాణిస్తుంది.   మామూలుగా ఆస్టరాయిడ్లు, స్పేస్ శకలాలను సైంటిస్టులు ఇలాగే గుర్తిస్తుంటారు. ఆస్టరాయిడ్లు, రాకెట్, శాటిలైట్ ముక్కలు కూడా మెరుస్తూ ఒకేలా కన్పిస్తుంటాయని అందుకే.. మెరిసేవన్నీ ఆస్టరాయిడ్లు కావని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆస్టరాయిడ్లుగా భావిస్తున్నవాటిలోనూ కొన్ని డజన్ల కొద్దీ ఫేక్ ఆస్టరాయిడ్లు ఉండొచ్చని అంచనా.

ఎంతుంటుంది?

‘ఆస్టరాయిడ్ 2020 ఎస్ వో’ దాదాపు 26 ఫీట్లు (8 మీటర్లు) ఉంటుందని, దీని బ్రైట్ నెస్ ని బట్టి అంచనా వేశారు. సెంటార్ రాకెట్ అప్పర్ స్టేజ్ కూడా10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉంటుంది కాబట్టి.. ఈ మిస్టరీ ఆబ్జెక్ట్ అదే అయి ఉంటుందని పాల్ చొడాస్ అంచనా వేస్తున్నారు. ఇది ఆస్టరాయిడ్ లా కాకుండా.. సూర్యుడి చుట్టూ ఆర్బిట్ లో మన భూమి మాదిరిగానే తిరుగుతోందని ఆయన చెప్తున్నారు. ‘‘ఆస్టరాయిడ్లు సాధారణంగా భూమిలా కాకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అలాగే ఇది భూమి వైపుగా గంటకు 2,400 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తోంది. ఆస్టరాయిడ్ లు ఇంతకంటే ఎన్నో రెట్ల ఎక్కువ వేగంతో వస్తాయి. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ ఆబ్జెక్టే అనేందుకు చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీనిపై టిటానియం డయాక్సైడ్ పెయింట్ ఉందా? లేదా? అనే క్లారిటీ వస్తే.. మిస్టరీ పూర్తిగా వీడిపోతుంది” అని పాల్ పేర్కొంటున్నారు. ఇది వచ్చే మార్చిలో భూమి ఆర్బిట్ నుంచి తప్పించుకుని, సూర్యుడి చుట్టూ తిరిగే ఆర్బిట్ లోకి చేరుతుందని, ఇప్పుడైతే ఇది భూమిపై కూలిపోదని ఆయన ధీమాగా చెప్తున్నారు.