ఏది పడితే అది తింటే పోషకాలు అందుతాయా..? పోషకాహార పదార్థాల గురించి మనకున్న అవగాహన ఎంత !

ఏది పడితే అది తింటే పోషకాలు అందుతాయా..? పోషకాహార పదార్థాల గురించి మనకున్న అవగాహన ఎంత !

మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియల నిర్వహణ, మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారం తీసుకుంటాం. నిత్యం తీసుకొనే ఆహారంలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తీసుకొనే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నీరు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే పోషకాలు లోపించి అనేక వ్యాధులకు గురవుతాం. 

మనకు ఆహారం రెండు రకాలుగా లభిస్తుంది. అవి మొక్కలు, జంతువులు. మొక్కల నుంచి ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు లభిస్తాయి. జంతువుల నుంచి పాలు, పాల సంబంధ పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం లభిస్తాయి. మనం తీసుకున్న ఏ పదార్థమైనా ఇంధనం లాగ పనిచేసి శరీర కణజాలాల మరమ్మతులకు, పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి, వ్యాధి నిరోధకతకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆహార పదార్థాలు, పోషణ గురించి అధ్యయనాన్ని డైటెటిక్స్ అంటారు. మనం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లు(పిండి పదార్థాలు), ప్రోటీన్లు(మాంసకృత్తులు), కొవ్వుపదార్థాలతో కూడిన ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. 

పిండి పదార్థాలు(కార్బోహైడ్రెట్లు): ఇవి శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులను కలిపి శక్తి జనకాలు అంటారు. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు 1:2:1 నిష్పత్తిలో కలిసి ఏర్పడుతాయి. ఇవి పాలీ హైడ్రాక్సీ ఆల్టిహైడ్లు లేదా కీటోన్ల కర్బన సమ్మేళనాలు. ఒక్కో కర్బన పరమాణువుకు ఒక నీటి అణువు చేరి ఉండటం వల్ల వీటిని కార్బోహైడ్రేట్లు అంటారు. సరాసరిన ప్రౌఢ దశలోని వ్యక్తికి రోజుకు 500 గ్రాముల పిండి పదార్థాలు అవసరం. ఒక గ్రాము పిండి పదార్థాల నుంచి 4 కిలోల క్యాలరీల శక్తి విడుదలవుతుంది. ఇవి ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, దుంపల్లో అత్యధికంగా చిలకడదుంప, బీట్రూట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉన్న పదార్థంలో అయోడిన్ ద్రావణాన్ని కలుపగా వెంటనే ఆ పదార్థం నీలిరంగులోకి మారుతుంది. దీన్నే అయోడిన్ పరీక్ష అంటారు. 

మాంసకృత్తులు (ప్రోటీన్స్): ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్​తో ఏర్పడతాయి. కొన్ని రకాల ప్రోటీన్లు సల్ఫర్, పాస్ఫరస్​లతో కూడా ఏర్పడతాయి. ప్రోటీన్లతో నైట్రోజన్ ప్రత్యేకమైన రోజుకు 70 నుంచి 100 గ్రాముల ప్రోటీన్లు అవసరమవుతాయి. 4 కిలోల క్యాలరీల శక్తి విడుదలవుతుంది. ప్రోటీన్లను శరీర నిర్మాణకాలు అంటారు. ఎందుకంటే అవి శరీర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ముఖ్యంగా పాలు, మాంసం, గుడ్లు, పప్పుధాన్యాల్లో ముఖ్యంగా సోయాబీన్​లో అత్యధికంగా ఉంటాయి. ప్రోటీన్లను గుర్తించడానికి 2శాతం CUSO4, 10శాతం NaoH, 10 చుక్కల నీటి మిశ్రమాన్ని ప్రోటీన్లు గల ఆహారంలో వేసినప్పుడు ఆ పదార్థం నీలిరంగు/ వంకాయ రంగులోకి మారుతుంది. 

కొవ్వు పదార్థాలు (లిపిడ్స్): ఇవి అధిక శక్తినిచ్చే పోషకాలు. శరీరంలో నిల్వ ఉంటాయి. పిండి పదార్థాల మాదిరిగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో ఏర్పడతాయి. కానీ ఆక్సిజన్ పరమాణువులు కార్బన్ పరమాణువులు కంటే తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్లు. సరాసరి ఒక వ్యక్తికి రోజుకు 50 గ్రాముల కొవ్వు పదార్థాలు అవసరమవుతాయి. ఒక గ్రాము కొవ్వు నుంచి 9.45 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. ఇవి ముఖ్యంగా నూనెలు, పాల సంబంధ పదార్థాలు గుడ్డు పచ్చసొన, జంతువుల మాంసంలో ఉంటాయి. వీటిని సాధారణంగా కాగితపు పరీక్షతో నిర్ధారిస్తారు. కొవ్వు పదార్థాన్ని కాగితంపై రుద్దినప్పుడు అది పారదర్శకంగా మారుతుంది. 

ఖనిజ లవణాలు: ఇవి శరీరానికి అవసరమైన అకర్బన పదార్థాలు. ఇవి శరీర బరువులో 4 శాతం ఉంటాయి. వీటిని స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. 

స్థూల పోషకాలు: ఇవి శరీరానికి అధిక పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు. అవి..
కాల్షియం: ఎముకలు, దంతాల్లో కాల్షియం ముఖ్య పదార్థం. రక్తస్కంధనం, కండర సంకోచం, నాడీ క్షోభ్యత మొదలైన క్రియల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది లోపించడం వల్ల దంత సమస్యలు, ఎముకలు సరిగా పెరగకపోవడం, పెద్దల్లో ఆస్టియోమలేషియా, పిల్లల్లో రికెట్స్ సమస్యలు వస్తాయి. పాలు, జున్ను, గుడ్డు సొన, బీన్స్, కాబేజీ, కాళీఫ్లవర్​లో ఇది విరివిగా లభిస్తుంది. 

పాస్ఫరస్ (భాస్వరం): ఎముకలు, దంతాల్లో ఉంటుంది. అధిక శక్తినిచ్చే పదార్థాలు. చాలా ఎంజైముల్లో పాస్ఫరస్ ఉంటుంది. దీని లోపంతో ఎముకలు, దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాలు, పప్పుధాన్యాలు, గుడ్డు, చేపలు, మాంసంతో లభ్యమవుతుంది. 

సోడియం: ఇది శరీరంలో అయాన్ల, నీటి సమతాస్థితికి తోడ్పడుతుంది. కండరాలు కొంకర్లు పోవడం, తలనొప్పి, వికారం కలుగుతాయి. రోజూ వినియోగించే ఉప్పు, జున్ను, గోధుమల్లో లభిస్తుంది. 
పోటాషియం: కండరాల్లో ముఖ్యంగా హృదయ కండరాల్లోని ద్రవాల్లో అధికంగా ఉంటుంది. శరీరంలో జరిగే వివిధ జీవక్రియల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సీరంతో పోటాషియం పెరిగితే మూత్ర పిండాలు విఫలమవ్వడం, నిర్జలీకరణ, గుండె ఆగిపోవడం జరుగుతుంది. కోడి మాంసం, అరటిపండు, నారింజ, బంగాళాదుంపల్లో లభిస్తుంది. 

మెగ్నీషియం: ఎముకల్లోని కాల్షియం, పాస్ఫరస్ లవణాలతో కూడి ఉంటుంది. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాల జీవ క్రియలకు ఇది చాలా అవసరం. కొకో గింజలు, సోయాబీన్స్​లో అధికంగా లభ్యమవుతుంది.
క్లోరిన్: నీటి సమతాస్థితికి, ద్రవాభిసరణ పీడనాల నియంత్రణకు అవసరమవుతుంది. రక్తంలో ఆమ్ల, క్షార సమతాస్థితిని నియంత్రిస్తుంది. వాంతులు, హైపోక్లొరెమిక్ ఆల్కనోసిస్ వంటి వ్యాధులు కలుగుతాయి. టేబుల్ సాల్ట్ (ఉప్పు)తో లభిస్తుంది. 

నీరు

మానవ శరీరంలో 65శాతం నీరు ఉంటుంది. ఈ నీటిలో 70 శాతం కణాంతర్గతంగాను, 30 రక్తం, శోషరసం వంటి దేహ ద్రవాలతో ఉంటుంది. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు 2:1 నిష్పత్తిలో కలిసి ఉంటాయి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. నీటిలో అనేక పదార్థాలు కరగడంతో నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. పదార్థాల రవాణా, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి నీరు చాలా అవసరం. 

పీచు పదార్థాలు

సన్నని దారాలు/ నారాల వంటి నిర్మాణాలున్న ఆహార పదార్థాలను పీచు పదార్థాలు అంటారు. ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. బీరకాయ, బెండకాయ, చిలగడదుంప, పొట్టుతియ్యని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, బఠాణి, గుమ్మడి, పాలకూర, ఆపిల్, అరటిలో పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. మలబద్దకం నివారించడానికి పీచు పదార్థాలను తీసుకోవడం ఆవశ్యకం. 

సూక్ష్మ పోషకాలు

ఇవి శరీరానికి స్వల్ప పరిమాణంలో అవసరమయ్యే పోషకాలు. అవి.. 
ఇనుము: హీమోగ్లోబిన్​లో ఇనుము అతి ముఖ్య భాగం. ఇది సైటోక్రోముల్లో కూడా ఉంటుంది. రక్తహీనతకు కారణమవుతుంది. ఆకుకూరలు, చేపలు, గుడ్లలో లభ్యమవుతుంది.

రాగి: హీమోగ్లోబిన్ సంశ్లేషణ, కొన్ని రకాల ఎంజైముల క్రియాశీలతకు ఇది అవసరం. బరువు తగ్గడం, పోషణ లోపం, రక్తహీనత కలుగుతాయి. గింజలు, షెల్ఫిష్, కాలేయం, మూత్ర పిండాల్లో లభిస్తుంది. 

అయోడిన్: థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి ఇది అవసరం. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనే రుగ్మతులకు కారణమవుతుంది. సముద్ర ఆహారోత్పత్తులు అయోడైజ్డ్ సాల్ట్​తో లభ్యమవుతుంది.

మాంగనీస్: ఎముకలు ఏర్పడటానికి, ప్రత్యుత్పత్తికి మాంగనీస్ అవసరం. వంధత్వానికి కారణమవుతుంది. కూరగాయలు, గింజలు, ధాన్యాలు, పండ్లలో లభ్యమవుతుంది.

కోబాల్ట్: ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి ఇది అత్యవసరం. రక్తహీనత, బరువు తగ్గడం, బలహీనత కలుగుతాయి. కోబాల్ట్ ఎక్కువ అయితే పాలీసైథిమియా వస్తుంది.

జింక్: శరీర పెరుగుదల, ప్రత్యుత్పత్తి, కణజాలాల మరమ్మతులకు, గాయాలు మానడానికి ఇది అవసరం. 
లోపిస్తే జననాంగాల క్షీణత, మరుగుజ్జుతనం కలుగుతాయి. మాంసం, కాలేయం, గుడ్లలో అధికంగా లభిస్తాయి.