
- మేనిఫెస్టోల తయారీలో బీఆర్ఎస్, బీజేపీ బిజీ
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తలదన్నేలా వ్యూహాలు
- మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కేసీఆర్ చర్చలు
- మహిళల కోసం ప్రత్యేక స్కీమ్ తెచ్చే చాన్స్
- కౌంటర్ స్కీమ్‌లపై బీజేపీ కసరత్తు
- రైతులు, మహిళలపై స్పెషల్ ఫోకస్
- 6 గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్
- మేనిఫెస్టోలో మరిన్ని స్కీమ్‌లు చేర్చే అవకాశం
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఏ హామీ ఇస్తే.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే లెక్కలు వేసుకుంటున్నాయి. అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో జనం బాటపట్టింది. ఆ గ్యారంటీలపై జనంలో చర్చ జరుగుతుండటంతో మిగతా పార్టీలూ అలర్టయ్యాయి. ఏమేం వరాలు ఇవ్వాలి.. కొత్తగా ఏ హామీలివ్వాలి.. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు ఎలాంటి స్కీమ్‌లను ప్రకటించాలి... అని బీఆర్ఎస్, బీజేపీ మేనిఫెస్టోల తయారీలో నిమగ్నమయ్యాయి.
కాంగ్రెస్ గ్యారంటీలను తలదన్నే మేనిఫెస్టో రూపొందించాలని బీజేపీ కసరత్తు చేస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో అటు కేంద్ర పథకాలకు తోడుగా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకునేలా కొత్త స్కీమ్‌ల రూపకల్పనపై కమలం నేతలు దృష్టి పెట్టారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కూడా ఈసారి మేనిఫెస్టో కీలకమని భావిస్తున్నది.
తొమ్మిదేండ్లలో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, మిషన్ కాకతీయ స్కీమ్‌లను దేశానికే ఆదర్శంగా అమలు చేసినట్లు బీఆర్ఎస్ పదేపదే ప్రచారం చేసుకుంటున్నది. దీనికి తోడు అన్ని వర్గాలకు సంతృప్తికరమైన హామీలిచ్చి అమలు చేశామనే ధీమా వెలిబుచ్చుతున్నది. వీటితో సరిపోదని, మూడోసారి అధికారంలోకి రావాలంటే ప్రత్యర్థుల హామీలకు మించిన జనాకర్షక ప్రయోగాలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
కర్నాటక తరహాలో కాంగ్రెస్
ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో జనంలో బలంగా వెళ్లింది. అందుకే అక్కడ తమకు విజయం ఈజీ అయిందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఇంచుమించుగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అదే తీరు ప్రయోగం చేస్తున్నది.
మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెల నెలా రూ. 2,500 ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్.. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, వరి పంటకు రూ. 500 బోనస్, ప్రతికుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా, అన్ని కేటగిరీల పెన్షన్‌దారులకు రూ.4 వేల పెన్షన్.. అనే గ్యారంటీలను ఇటీవల ప్రకటించింది. నేరుగా పార్టీ ముఖ్యనేత సోనియా గాంధీతో వీటిని అనౌన్స్ చేయించటంతో జనానికి భరోసా కలిగిందని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. ఈ గ్యారంటీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని వారు నమ్ముతున్నారు. ఇంకిన్ని స్కీమ్‌లు మేనిఫెస్టోలో చేరే అవకాశం ఉందని అంటున్నారు.
మేనిఫెస్టోపై కేసీఆర్ కసరత్తు
అందరికంటే ముందే అభ్యర్థులను అనౌన్స్ చేసిన బీఆర్ఎస్ పార్టీ.. మేనిఫెస్టోపై ఆచితూచి వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ గ్యారంటీలు అందరిలో చర్చకు తెరలేపటంతో.. అంతకుమించి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారు చేసే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. అక్టోబర్ 16న ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తామని ఇటీవలే పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజున వరంగల్‌లో భారీ బహిరంగ సభ వేదికపై దీన్ని విడుదల చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు నూటికి నూరు శాతం ప్రయోజనం ఉండే స్కీమ్‌లన్నీ అమలు చేశామని,` గత రెండు మేనిఫెస్టోల్లో ఉన్నవి కాకుండా లేనివి కూడా అమలు చేశామని మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల ఫైనాన్స్ అధికారులతో రివ్యూ చేశారు. కొత్త మేనిఫెస్టో తయారీకి అవసరమైన ఇన్‌పుట్స్‌పై చర్చించినట్లు తెలిసింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ అమల్లోకి తెచ్చింది. అదే తీరుగా మిగతా పింఛన్ల పెంపు, రైతు బంధు సాయం పెంచే అంశాలు కొత్త మేనిఫెస్టోలో ఉండే అవకాశాలున్నాయి. ఈసారి మహిళా పింఛన్ స్కీమ్ లేదా మహిళల పొదుపు నిధి పేరుతో కేసీఆర్ కొత్త స్కీమ్ తెస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు.
కౌంటర్ స్కీమ్‌లపై బీజేపీ ప్లాన్
బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టో తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కర్నాటక ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌కు దీటుగా కౌంటర్ మేనిఫెస్టో తయారు చేయాలని యోచిస్తున్నది. ప్రధానంగా రైతులు, మహిళలను ఆకట్టుకునే పథకాలు, కార్యక్రమాలపై మేథోమథనం సాగిస్తున్నది. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించేలా భారీగా సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది. కాంగ్రెస్ గ్యారంటీల్లో ఉన్న ఉచిత ప్రయాణం, నెలనెలా మహిళలకు ఆర్థిక సాయం వంటి వాటిని మించిన స్కీమ్‌లపై బీజేపీ కసరత్తు చేస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లింక్ చేసుకొని.. రైతులను ఆకట్టుకునే ఎరువుల సబ్సిడీ, పంట ఉత్పత్తులకు బోనస్, పెట్టుబడి సాయం అందించే బహుళ ప్రయోజన స్కీమ్‌లపై దృష్టి పెట్టింది.
మహిళల కోసం..!
అన్ని పార్టీలు ఈసారి ఎన్నికల మేనిఫెస్టో తయారీలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3.06 కోట్ల ఓటర్లున్నారు. వీరిలో దాదాపు సగం అంటే 1.52 కోట్ల మంది మహిళలున్నారు. అందుకే మహిళలను ఆకట్టుకుంటే ఇంటిల్లిపాది ఓట్లు గంపగుత్తగా సాధించే అవకాశముంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు మేనిఫెస్టోలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.