మస్క్, ట్రంప్ ఫైట్ ఏంకానుంది.. శక్తివంతమైన మిత్రులు శత్రువులుగా మారితే ఎవరికి నష్టం..?

మస్క్, ట్రంప్ ఫైట్ ఏంకానుంది.. శక్తివంతమైన మిత్రులు శత్రువులుగా మారితే ఎవరికి నష్టం..?

అత్యంత  సన్నిహిత  స్నేహితులుగా ఉన్న ఇద్దరు శక్తిమంతమైన వ్యక్తులు శత్రువులుగా మారడం, ఆపై ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం ప్రారంభిస్తే  చూసేవారందరికీ ఆసక్తికరంగా,  సరదాగా ఉంటుంది.  భారతదేశ  రాజకీయాల్లోనూ  రాజకీయ  నాయకులు అకస్మాత్తుగా శత్రువులుగా మారడం మనం చాలా తరచుగా చూస్తున్నాం.  ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, బిలియనీర్​ ఎలాన్ మస్క్,  ప్రపంచదేశాల్లోనే  శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అకస్మాత్తుగా విభేదాలు రావడం,  విడిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

వీరిద్దరి వ్యవహారాన్ని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,  ప్రపంచ వాణిజ్య దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య స్నేహం సుమారు మూడు సంవత్సరాల  క్రితం  ఆరంభమైంది.  ఒకవిధంగా  ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యే  ప్రయత్నంలో ఉన్నప్పుడు వీరిమధ్య స్నేహం ప్రారంభమైంది.  

ఎలాన్​ మస్క్  ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీ కాబట్టి,  మస్క్ తనకు మద్దతు ఇస్తే  పుష్కలంగా డబ్బు లభిస్తుందని దీంతోపాటు అదనంగా
గొప్ప ప్రజా ప్రయోజనం కూడా లభిస్తుందని రాజకీయనేతగా మారిన వ్యాపారవేత్త  ట్రంప్‌‌‌‌కు  తెలుసు. 

ఎలాన్ మస్క్ అత్యంత  ప్రతిభావంతమైన టెక్నాలజీ జీనియస్​.  సాంకేతిక మేధావి అయిన ఎలాన్​ మస్క్​ అత్యున్నత  టెక్నాలజీ  కంపెనీలను ప్రారంభించాడు.  అంతరిక్షం,  టెస్లా  ఎలక్ట్రిక్ కార్లు, ఉపగ్రహాల నుంచి  ఎటువంటి అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలను నిర్వహించే అంతిమ సాంకేతిక సంస్థలను  మస్క్​ ప్రారంభించాడు. 2025 జనవరిలో  డొనాల్డ్​ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఎలాన్  మస్క్‌‌‌‌ను ప్రతిష్టాత్మకమైన కేబినెట్ పదవిలో నియమించాడు.  మస్క్  తనతోపాటు ప్రతిచోటా ఉండటం వల్ల  మస్క్  ప్రత్యేక హోదాను  కూడా ట్రంప్  హైలైట్ చేశాడు. 

అయితే, ఈ నేపథ్యంలో ఎదురైన ప్రధాన సమస్య ఏమిటంటే ఎలాన్​ మస్క్ ఇతర మంత్రులపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించాడు. ఈక్రమంలో ఇటీవల వైట్ హౌస్‌‌‌‌లో మరొక మంత్రితో ఫిజికల్​ ఎన్​కౌంటర్​..బాహాబాహి దాడి సంఘటనల గురించి ఆసక్తికరమైన నివేదికలు ఉన్నాయి. ఈ వరుస సంఘటనలతో  ట్రంప్  మస్క్‌‌‌‌ను వదిలించుకోవాలని కోరుకున్నాడు.  నెమ్మదిగా  మస్క్  వెళ్లిపోవాలని సూచించాడు. ఇది  స్నేహపూర్వక నిష్క్రమణ.  

కానీ, ట్రంప్​  వైఖరితో మస్క్ కలత చెందాడు.  ఒక రోజులోనే,  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌‌‌‌పై నేరుగా మాటల దాడి చేయడం ప్రారంభించాడు.  ట్రంప్​ను అవమానించడం మొదలుపెట్టాడు.  దూకుడుగా వ్యవహరిస్తోన్న  ఎలాన్​ మస్క్  ట్రంప్ శత్రువులకు మద్దతు ఇస్తానని బెదిరించాడు.  ట్రంప్​పై నిర్లక్ష్యంగా ఆరోపణలు చేస్తూనే తాను మూడో పార్టీ (ది అమెరికన్​ పార్టీ) ప్రారంభించే అవకాశం ఉందని మస్క్​ ఎక్స్​లో ట్వీట్​ చేశాడు. అమెరికన్స్​ నుంచి మంచి స్పందనే వచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి. 

మస్క్ వ్యాపారాలు

ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న వ్యాపారాలన్నీ ఆధునిక సాంకేతికతను కలిగి ఉన్నప్పటికీ,  అమెరికా ప్రభుత్వ సబ్సిడీలు, అగ్రరాజ్యం అనుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అధ్యక్షుడు  డొనాల్డ్​ ట్రంప్ వెంటనే మస్క్‌‌‌‌కు నిధులు నిలిపివేయవచ్చని,  ఇతర వ్యాపారాలకు అనుమతులను సమీక్షిస్తామని ప్రకటించారు.  దీంతో,  వెంటనే మస్క్ కంపెనీల వాటా విలువ బాగా పడిపోయింది.  ఈ పరిణామం ఎలాన్ మస్క్‌‌‌‌పై  తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ఇచ్చిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు.  వెంటనే, మస్క్  ట్రంప్‌‌‌‌పై  మాటల దాడి చేయడం మానేసి, అన్ని అవమానకరమైన సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌లను తొలగించారు. 

ఒకవిధంగా  మస్క్ తన దూకుడును తగ్గించి  వెనక్కి తగ్గారని స్పష్టం అవుతోంది. ఎందుకంటే,  డొనాల్డ్​ ట్రంప్  వంటి శక్తిమంతమైన అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆయన సరిపోరు.  మస్క్​ తన ప్రత్యర్థులకు సహకరించేవిధంగా ఏదైనా శత్రు రాజకీయ కార్యకలాపాలు చేస్తే ఆయనను  శిక్షిస్తానని  ట్రంప్​ హెచ్చరించారు.  ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకుంటే  ఎలాన్ మస్క్ తన పోరాటం నుండి వెనక్కి తగ్గాడా లేదా చూడాలి.  ట్రంప్​ ఆగ్రహిస్తే  తన వ్యాపార సామ్రాజ్యం నాశనం అవుతుందని మస్క్​ అర్థం చేసుకున్నాడు.  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ప్రత్యక్షంగా ఎలాన్ మస్క్​పై  శిక్షాత్మక చర్యలు  తీసుకోనప్పటికీ, మస్క్ ఎలక్ట్రిక్ (TESLA) కార్లు పనికిరానివని బహిరంగంగా చెప్పాడు. కానీ, దీనిపై  ట్రంప్ నేరుగా  ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదు.

నేర్చుకోవలసిన పాఠాలు

శక్తిమంతమైన  వ్యక్తితో  స్నేహం చాలా ప్రమాదకరం. పవర్​ఫుల్ పొలిటీషియన్​తో స్నేహం తెగిపోతే, ఆ శక్తిమంతమైన రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థికి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాడు.  భారతదేశంలోనూ  మన దిగ్గజ వ్యాపారవేత్తలలో  కొందరు శక్తిమంతమైన రాజకీయ నాయకులకు దగ్గరవుతారు. కానీ, ఆ రాజకీయ నాయకుడి శత్రువులు వ్యాపారవేత్తలపై  రాజకీయపరంగా మాటల  దాడి చేయడం ప్రారంభిస్తారు. అంబానీ,  అదానీలు ప్రతిరోజూ ఎలా రాజకీయ నాయకుల దాడిని ఎదుర్కొంటున్నారో  మనందరికీ తెలుసు. 

ఒక వ్యాపారవేత్త ఏ రాజకీయ నాయకుడితోనూ ఎక్కువగా సన్నిహితంగా ఉండకుండా ఉండాలి.   ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం అమెరికన్ వారెన్ బఫెట్.  బిగ్గెస్ట్​ ఎంటర్​ప్రెన్యూర్​ అయిన బఫెట్  రాజకీయ నాయకులకు,  ప్రభుత్వానికి దూరంగా ఉంటాడు.  బఫెట్ బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద  అసెట్ కంపెనీకి అధిపతి అని మనం గమనించాలి. కాగా, మస్క్ అధికారానికి దగ్గరగా ఉండటంతో  ఆ హోదాను  ఆనందించాడు. తనను తాను శక్తిమంతుడిగా  భావించాడు.  ఈ విషయంలో  మస్క్ తప్పు చేశాడు.  ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడితో పోరాడటానికి మస్క్​ మూల్యం చెల్లించుకోక తప్పదు.

 ట్రంప్​కు రక్షణగా ఎక్స్​

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌తో సన్నిహితంగా ఉన్నప్పుడు మస్క్ వినయంగా ఉండాల్సింది.  కానీ,  ట్రంప్​కు వ్యతిరేకంగా వ్యవహరించాడు.  బదులుగా,  మస్క్​ డజన్లకొద్దీ  పవర్​ఫుల్​ శత్రువులను సంపాదించుకున్నాడు.  ట్రంప్​ ఆప్తులు మస్క్​ను  విడిచిపెట్టేశారు.  మస్క్ ఒక మేధావి.  కాలేజ్​ దశలో ఉన్నప్పుడే మస్క్​ ధనవంతుడయ్యాడు. మస్క్ తన సంపదను  వారసత్వంగా పొందలేదు. తన  సంపదను  తానే సృష్టించుకున్నాడు.  కానీ, మస్క్ అధికారానికి దగ్గరగా ఉండటం వల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోవాలి. 

మస్క్ ఇప్పుడు మానవులను అంగారక గ్రహానికి రవాణా చేసే రాకెట్ల సాంకేతిక సవాలు కంటే పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడు. ట్రంప్ తన శత్రువులను విడిచిపెట్టడు.  కానీ, మస్క్ అత్యంత  ప్రసిద్ధ సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’ ను నియంత్రిస్తున్నందున,  అతనికి 20 కోట్ల మంది ఫాలోవర్స్​ ఉన్నందున అతనికి కొన్ని రక్షణలు ఉన్నాయి.  అంతేకాకుండా, మస్క్ ఉత్పత్తులు అమెరికా ప్రభుత్వానికి అవసరం.  కానీ, ట్రంప్ దృష్టి  నుంచి బయటపడటానికి మస్క్ కు చాలా దౌత్యం అవసరం.  కథ ఇంకా ముగియలేదు.

ట్రంప్ ఏమి చేయొచ్చు

డొనాల్డ్  ట్రంప్  మస్క్‌‌‌‌ను క్షమించే అవకాశం లేదు.  అదేవిధంగా  మస్క్​కు మునుపటి హోదాను తిరిగి ఇచ్చే ప్రశ్నే లేదు.  ట్రంప్ ఎలాన్​ మస్క్‌‌‌‌ను శిక్షించడానికి తగిన సమయం, అవకాశాన్ని ఎంచుకుంటాడు.  ట్రంప్  మస్క్‌‌‌‌కు చాలా నష్టం కలిగించవచ్చు. బిలియన్ డాలర్ల నిధులను ఉపసంహరించుకోవడంతోపాటు, మస్క్ కు చెందిన అన్ని కంపెనీలపై  అమెరికా ప్రెసిడెంట్ హోదాలో  ట్రంప్ విచారణకు ఆదేశించవచ్చు.  ట్రంప్ మస్క్‌‌‌‌కు ఎంతనష్టం చేయగలరో అనేదానికి పరిమితి లేదు.  ఈ నేపథ్యంలో  మస్క్ తనను తాను రక్షించుకోగలరా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. 

అయితే,  ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్ కొంతవరకు తనను తాను రక్షించుకోగలడు. అమెరికా ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్య ఏమిటంటే, మస్క్ కంపెనీ ఇప్పటివరకు అత్యంత శక్తిమంతమైన  రాకెట్‌‌‌‌ను అభివృద్ధి చేసింది.  అది స్టార్‌‌‌‌షిప్.  అమెరికా అంతరిక్ష పరిశోధననా సంస్థ నాసాకు స్టార్​షిప్​ రాకెట్లు అవసరం. అవి లేకపోతే  నాసా కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం ఉంది.  మస్క్ కంపెనీలు దెబ్బతిన్నట్లయితే యూఎస్ రక్షణ పరిశ్రమ నష్టపోతుంది.

- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్​