
న్యూఢిల్లీ: ఇండ్ల ధరలు, తనఖా రేట్ల పెరుగుదల వల్ల గత రెండేళ్లలో ఏడు ప్రధాన నగరాల్లో ఇండ్లను కొనుగోలు చేయగల స్థోమత తగ్గింది. అయితే ఇది వచ్చే ఏడాది మెరుగుపడవచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా రిపోర్టు పేర్కొంది. దీని ప్రకారం.. కొత్త సంవత్సరంలో రెపో రేటు తగ్గింపునకు అవకాశం ఉంది. స్థోమత స్థాయులలో మెరుగుదల ఇంటి విక్రయాలను మరింత పెంచుతుంది. గత రెండేళ్లలో ఆస్తి ధరలు, హోం లోన్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ కన్సల్టెంట్ ఆదివారం తన 'హోమ్ పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్' (హెచ్పీఏఐ)ని విడుదల చేసింది.
ఇది సగటు వార్షిక ఆదాయాన్ని (మొత్తం నగర స్థాయిలో) ఆర్జించే కుటుంబం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నగరంలోని ఆస్తిపై హౌసింగ్ లోన్‌కు అర్హులా కాదా అనేది తెలియజేస్తుంది. ఆర్థిక మాంద్యానికితోడు, ద్రవ్యోల్బణం ఎక్కువ కావడం, రెపో రేటూ పెరగడంతో 2022లో స్థోమత మరింత దిగజారిందని రిపోర్ట్ పేర్కొంది. 2022తో పోల్చినప్పుడు గత ఏడాది స్తోమత స్థాయులు స్వల్పంగా తగ్గవచ్చని లేదా అలాగే ఉండవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది రెపోరేటులో 60–-80 బేసిస్ పాయింట్ల తగ్గింపును జేఎల్ఎల్ అంచనా వేస్తోంది.
నగరంలోని ఒక కుటుంబ వార్షిక ఆదాయం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 1,000- చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌పై హోం లోన్‌కు అర్హత సాధించగలదా లేదా ? అనేది హెచ్పీఏఐ తెలియజేస్తుంది. 100 విలువ అంటే ఒక కుటుంబానికి లోన్ పొందేందుకు సరిపోయేంత ఆదాయం ఉందని అర్థం. 100 కంటే తక్కువ విలువ అంటే సగటు కుటుంబానికి హౌసింగ్ లోన్‌కు అర్హత పొందేందుకు తగిన ఆదాయం లేదని సూచిస్తుంది. డేటా ప్రకారం, ముంబైలో స్థోమత సూచిక 92 నుంచి 88కి తగ్గుతుందని అంచనా. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇండెక్స్ 125 నుంచి 121కి తగ్గుతోంది. బెంగళూరు సూచీ 168 నుంచి 158కి పడిపోయిందని అంచనా. హైదరాబాద్‌లో గత ఏడాది 174 వద్ద ఉన్న సూచీ 169 దగ్గరకు వెళ్లింది. పూణేలో 183 నుంచి 182కి స్వల్పంగా పతనమవుతుంది. కోల్‌కతాలో 193 నుంచి 194కి స్వల్పంగా మెరుగుపడుతున్నది. చెన్నై స్థోమత సూచిక ఈ సంవత్సరం 162 వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా.