ధరణి వచ్చాక ఫామ్ వెంచర్​లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు

ధరణి వచ్చాక ఫామ్ వెంచర్​లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు
  • భూరికార్డుల ప్రక్షాళనలో పీఆర్, ఆర్​అండ్​బీ, ఎన్​హెచ్ భూములకు పాస్​బుక్స్ జారీ
  • ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు
  • రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు

జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల రెవెన్యూ విలేజ్ పరిధిలోని 317 సర్వే నంబర్ లో 9.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో నుంచి చిన్నపెండ్యాల – తరిగొప్పుల పీడబ్ల్యూడీ రోడ్డు చాలా ఏండ్ల కిందే వేశారు. ఈ రోడ్డు కింద ఎకరం భూమి పోయింది. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ సర్వే నంబర్ లోని మొత్తం భూమి వ్యవసాయ భూమిగానే చూపిస్తున్నది. రోడ్డు ఉన్నట్లు నమోదు కాలేదు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి రెవెన్యూ ఆఫీసర్లు పాత పట్టాదారుతో కలిసి ఆ ఎకరంకు ఓ వ్యక్తి పేరిట పాస్ బుక్ జారీ చేశారు. సదరు వ్యక్తి 2020లో మరొకరికి అమ్మి.. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ పాస్ బుక్ పట్టుకొచ్చి 317 సర్వే నంబర్ లో తనకు భూమి ఉందంటూ.. అదే సర్వే నంబర్ లో 20, 30 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న రైతులపై దౌర్జన్యం చేశాడు. దీంతో బాధితులంతా సదరు వ్యక్తిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

కరీంనగర్​ కార్పొరేషన్ అల్గునూర్ డివిజన్​లోని ఐదెకరాల వెంచర్​లో కొన్నేండ్ల కింద పలువురు ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు అమ్ముకునేటప్పుడు వెంచర్​కు మూడు వైపులా 30 ఫీట్ల వెడల్పుతో మూడు రోడ్లు చూపించిన రియల్టర్.. తాజాగా​అందులో రెండు రోడ్లను మూసేశాడు. ఇటీవల తమ జాగా చూసొద్దామని వెంచర్​కు వెళ్లిన ప్లాట్ల యజమానులకు రోడ్ల చివర్లో కనీలు కనిపించడంతో షాక్​కు గురయ్యారు. ఆరా తీస్తే ఆ రోడ్లను ప్లాట్లుగా మార్చి వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్​ చేసినట్లు తేలింది. ఫోన్​ చేసి అడిగితే తన వెంచర్​కు ఒకవైపే రోడ్డు ఉంటుందని, మూడువైపులా రోడ్ల గురించి తానెప్పుడు చెప్పలేదని మాటమార్చాడు. ఆ రియల్టర్​పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్లాట్ల యజమానులు  తలపట్టుకుంటున్నారు.

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో ఆరేండ్ల కింద జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు రెవెన్యూ ఆఫీసర్లు చాలా చోట్ల రోడ్లకు కూడా పట్టా చేసి పాస్ బుక్స్ జారీ చేశారు. భూ రికార్డుల్లో రోడ్లను కూడా వ్యవసాయ భూములుగా నమోదు చేశారు. ఇలాంటి వాటిలో గ్రామాల మధ్య ఉండే పంచాయతీ రాజ్ రోడ్లతో పాటు ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ కు చెందిన భూములు కూడా ఉన్నాయి. ఇలా రోడ్డు విస్తీర్ణంతో పట్టాలు పొందిన వ్యక్తులు.. అదే సర్వే నంబర్ లో రోడ్డు పక్కనే ఉన్న వేరే వాళ్ల భూముల్లోకి ప్రవేశించి.. తమ భూమి ఇందులోనే ఉందంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. అందుకు ప్రూఫ్స్​గా పాస్ బుక్స్ చూపిస్తున్నారు. ఇరువర్గాల వద్ద పాసు పుస్తకాలు ఉండడంతో ఇలాంటి వివాదాలను పరిష్కరించలేక రెవెన్యూ ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. ఎవరి భూమో తేల్చుకునేందుకు కోర్టులకు వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ తరహా వివాదాలపై కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి.

సప్లిమెంటరీ సేత్వార్ ప్రిపేర్ చేయడంలో నిర్లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు, ఇరిగేషన్ కెనాల్స్, ఇండస్ట్రీస్ తదితర అవసరాల కోసం రాష్ట్రంలో గతంలో లక్షలాది ఎకరాల భూములను సేకరించాయి. ఇప్పటికీ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ ప్రక్రియ నడుస్తూనే ఉంది. భూమిని సేకరించిన సందర్భంలో పట్టాదారులకు పరిహారం చెల్లించాక ఆ భూమి స్వభావాన్ని భూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా లేదంటే, ఏదైనా ప్రభుత్వ శాఖకు చెందిన భూమిగా మార్చాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ రికార్డులతో పాటు సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు తమ దగ్గర ఉండే సేత్వార్ రికార్డుల్లోనూ మార్పులు చేసి.. సప్లిమెంటరీ సేత్వార్ రికార్డును రిలీజ్ చేయాలి. ఇలా జరిగితేనే ఆ భూములపై మళ్లీ పాస్ బుక్స్ జారీ చేయడం కుదరదు. కానీ, రాష్ట్రంలోని పంచాయతీ రోడ్లు, స్టేట్, నేషనల్ హైవేస్ కు చెందిన భూములు ఇంకా చాలా చోట్ల పట్టాదారుల పేరిటే చూపిస్తున్నాయి. ఇలా పాస్ బుక్స్ పొందిన వ్యక్తులు రైతుబంధు సాయం పొందుతుండడమేగాక ఆ భూమిని వేరేవాళ్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వార్ ప్రిపేర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇలా వేలాది ఎకరాల్లో రోడ్డు స్థలాలు, పక్కన పట్టా భూములతో కలిపి పాస్ బుక్స్ జారీ అయ్యాయని పేర్కొంటున్నారు.

ప్లాట్లన్నీ అమ్మేశాక ఒకటి, రెండు రోడ్లు క్లోజ్

ఉదాహరణకు ఎవరైనా ఒక ఎకరం (40 గుంటల్లో)లో రెండు గుంటలకో ప్లాట్ చొప్పున 13 ప్లాట్లుగా (26 గుంటలు) చేసి, మరో 14 గుంటల భూమిని రోడ్లకు వదిలారనుకుందాం. ఇలా 26 గుంటల భూమిని 13 మందికి రిజిస్ట్రేషన్ చేశాక.. రోడ్ల కింద తీసిన మిగతా 14 గుంటల భూమి సదరు పట్టాదారు పేరిటే ధరణిలో చూపిస్తుంది. ఇలా రోడ్ల కింద తీసిన భూమిని కూడా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. లే అవుట్ ప్లాట్ల విషయంలోనూ ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. మొదట్లో వెంచర్​కు రెండు, మూడు రోడ్లు చూపే రియల్టర్లు, అసలు ప్లాట్లన్నీ అమ్ముకున్నాక ఒకటి, రెండు రోడ్లను క్లోజ్​చేసి చిన్నచిన్న  ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఇలా రోడ్లను కూడా రిజిస్ట్రేషన్ చేయడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నారు.

ఫామ్ వెంచర్లలో రోడ్లకూ రిజిస్ట్రేషన్ల ముప్పు

ధరణి పోర్టల్ వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యవసాయ భూముల్లో అనధికార వెంచర్లు వేయడం, గుంటల చొప్పున అమ్మడం కామన్ అయింది. ఫామ్ ల్యాండ్స్ లో గుంట, రెండు గుంటల ప్లాట్లు కొనుగోలు చేస్తే రైతుబంధు, రైతు బీమా వర్తించడం, లేఔట్ ప్లాట్ల ధరతో పోలిస్తే సగానికన్నా తక్కువ రేటుకే ప్లాట్ దక్కుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ప్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది తహసీల్దార్లు తమ వాటా తీసుకొని చాంతాడంత బై నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కానీ, ఇలాంటి ఫామ్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు తప్పవని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.