రెగ్యులరైజేషన్​పై సర్కారు నానుస్తోంది

రెగ్యులరైజేషన్​పై సర్కారు నానుస్తోంది

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్​పై సర్కారు నాన్చుడు ధోరణి పాటిస్తోంది. నిన్నమొన్నటిదాకా కోర్టు కేసులను సాకుగా చూపిన ప్రభుత్వం, ప్రస్తుతం ఏ అడ్డంకి లేకపోయినా ప్రాసెస్ మాత్రం పూర్తిచేయట్లేదు. దీనికితోడు రెగ్యులరైజేషన్​కు పలు నిబంధనలు పెడుతుండటంతో తాము పర్మినెంట్ అవుతామో లేదో అనే ఆందోళన ఎంప్లాయీస్​లో మొదలైంది. 

కోర్టు కేసుల్లోనూ లైన్ క్లియర్

తెలంగాణ వచ్చాక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్​ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్ అందుకు తగ్గట్లే 2016 ఫిబ్రవరి 26న రెగ్యులరైజేషన్​ కోసం జీవో 16 రిలీజ్ చేశారు. దీనిపై కొందరు కోర్టుకెక్కడంతో ఆ ప్రాసెస్ ఆగిపోయింది. అయితే పోయినేడాది డిసెంబర్ లో రెగ్యులరైజేషన్​ పై ఉన్న కేసులన్నింటినీ హైకోర్టు కొట్టివేయడంతో కాంట్రాక్టు ఉద్యోగులకు లైన్​ క్లియర్ అయింది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,70,338 మంది కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హతల ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగా అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి వివరాలను పంపించాలని ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ఆదేశాలిచ్చారు. 

రెగ్యులరైజ్ అయ్యింది వెయ్యిలోపే..

అడ్డంకులు తొలగిన తర్వాత కూడా రెగ్యులరైజేషన్​ ప్రక్రియ నిదానంగా సాగుతోంది.  ఇప్పటి దాకా 11,103 మందిలో వెయ్యిలోపే రెగ్యులరైజ్ అయ్యారు. పంచాయతీరాజ్ డిపార్ట్​మెంట్​లో 65మంది టెక్నికల్ ఆఫీసర్లు, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినెట్లను 3 నెలల క్రితమే రెగ్యులరైజ్ చేసింది. వీరిలో పాటు ఐసీడీఎస్ లో పనిచేసే 143 మంది కాంట్రాక్టు సూపర్​వైజర్లనూ ఇటీవల రెగ్యులరైజ్ చేశారు. పలు డిపార్ట్​మెంట్లలో మరికొంతమందిని రెగ్యులరైజ్ చేశారు. అయితే ప్రధానంగా విద్యా, వైద్యశాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాత్రం  స్పష్టత రావట్లేదు. అయితే సాంక్షన్ పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై ఇంకా అయోమయమే కొనసాగుతోంది.

కాంట్రాక్టు లెక్చరర్లలో ఆందోళన 

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్​లో 3,554, డిగ్రీలో 812, పాలిటెక్నిల్ లో 485 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వీరిలో మెజార్టీ లెక్చరర్లు 15 ఏండ్ల నుంచి పనిచేస్తున్నారు. ఇప్పుడు వివిధ కారణాలు చూపుతూ  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ వివరాలు తీసుకుంటున్నది. ఇంటర్ లో జనరల్, ఒకేషనల్ కోర్సుల వివరాలను వేర్వేరుగా పంపించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కొందరికి అవసరమైన క్వాలిఫికేషన్లు లేవని అధికారులు గుర్తించారు. దీంట్లో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన దూరవిద్య వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు పెట్టారు. కొందరిది జాయినింగ్ నాటికే వయసు ఎక్కువ ఉండటం, ఇంకొందరికి  తగిన అర్హతలు లేకపోవడంతో వారిని రెగ్యులరైజ్ చేస్తారా లేదా అనే ఆందోళన వారిలో నెలకొంది. హెల్త్ డిపార్ట్​మెంట్​లోనూ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులదీ అదే పరిస్థితి.  దీంతో ఆయా డిపార్ట్మెంట్ల కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఆందోళనలో ఉన్నారు.

దసరా కానుకగా ఇస్తారనే ఆశతో ఉన్నం: 

కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగులందరూ  క్రమబద్దీకరణ కోసం ఎండ్ల నుంచి  ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా సీఎం కేసీఆర్​  రెగ్యులరైజ్​ చేస్తారనే ఆశతో ఉన్నాం. 20 ఏండ్ల నుంచి  పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విముక్తిని కల్పించాలని వేడుకుంటున్నం. 

- కొప్పిశెట్టి సురేశ్​, కాంట్రాక్టు ఉద్యోగుల అమలు సాధన కమిటీ కన్వీనర్