
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆంధ్రా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ కోడిపుంజు దొంగతనం కేసులో ఫిర్యాదుదారులతో కలిసి గ్రామంలో హల్ చల్ చేశారు. అనుమానితుడి ఇంటి సీసీ కెమెరాలు పగలగొట్టి, చెల్లాచెదురు చేసి, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, అక్కడ ఉన్న కోడి పుంజులను తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంట్లో మగవాళ్లు లేకుండా పోలీసులు ఇలా దౌర్జన్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వాహనం సహా మొత్తం వాహనాలను అడ్డుకుని స్థానికులు లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోళ్ల దొంగల కోసం వెళ్లిన ఏపీ పోలీసులను నిర్భంధించడంతో దమ్మపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి కోళ్ల దొంగతనం విచారణకు ఏలూరు జిల్లా చింతలపూడి పోలీసులు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. కోళ్ల దొంగతనం గురించి విచారణ పేరుతో ఒక మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా.. ఆమె ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్ళి ఇబ్బందులు పెట్టారని, సీసీ కెమెరాలను తొలగించారని గ్రామస్తుల ఆగ్రహం చేశారు. ఏదైనా కేసు విచారణ ఉంటే.. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇష్టానుసారం ఇళ్లలోకి చొరబడి ఇలా దారుణంగా ప్రవర్తించడం ఏంటని గ్రామస్తులు ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
►ALSO READ | కస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్స్నాచింగ్